15, నవంబర్ 2020, ఆదివారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*స్వామి కృప..సరోజ జీవితం.*


మొగలిచెర్ల గ్రామ సరిహద్దులో ఫకీరుమాన్యం వద్ద ఆశ్రమం నిర్మించుకొని, తీవ్ర తపోసాధన చేసిన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు  కపాలమోక్షం ద్వారా  1976 వ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి నాడు సిద్ధిపొందే నాటికి ఆ ప్రాంతానికి  బస్ సౌకర్యం కూడా లేదు..ఎవరైనా శ్రీ స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించాలని అనుకుంటే..మొగలిచెర్ల గ్రామం వరకూ బస్ లో వచ్చి , అక్కడినుండి కాలినడకన రావాల్సివచ్చేది..శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని తమ కష్టాలను ఆ సమాధి వద్ద విన్నవించుకుంటే..తమకు ఊరట కలుగుతుందనే విశ్వాసం తో ఎందరో భక్తులు వచ్చేవారు..వారికి ఉపశమనం కలిగేది కూడా..1980 నాటికి అంటే శ్రీ స్వామివారు సిద్ధిపొందిన నాలుగు సంవత్సరాలకు మందిరం వద్దకు బస్ సౌకర్యం ఏర్పడింది..అప్పటి నుండీ భక్తుల రాకపోకలకు ఉన్న ఇబ్బందులు కొంతమేర తీరిపోయాయి..


అలా బస్ సౌకర్యం ఏర్పడిన తొలినాళ్ళలో..పామూరు ప్రాంతం నుంచి పదహారు, పదిహేడేళ్ల ప్రాయం లో ఉన్న తమ కూతురిని తీసుకొని దంపతులు వచ్చారు..అమ్మాయి పేరు సరోజ..చూడటానికి ఏ లోపమూ లేకుండా లక్షణంగా ఉంది..కానీ ఆ అమ్మాయి ప్రవర్తన మాత్రం విపరీతంగా ఉండేది..ఉన్నట్టుండి పెద్దగా కేకలు పెట్టేది..పరుగెట్టేది..ఆ సమయంలో ఎవరైనా ఆపబోతే..వారిమీద చేతిలో ఉన్న వస్తువులను విసిరికొట్టేది..ఒక్కొక్కసారి రాళ్లు కూడా రువ్వేది.. ఈ విపరీతపు పోకడ ఒక సంవత్సర కాలం నుంచీ ఉందనీ..ఎవరెవరికో చూపించినా ఫలితం కలుగలేదనీ.. స్వామివారి గురించి విని..ఇక్కడ బాగుపడుతుందనే ఆశతో అమ్మాయిని తీసుకొని వచ్చామని చెప్పారా దంపతులు..


ఆ రోజుల్లో భక్తులు వుండటానికి ఒకే ఒక్క రేకుల షెడ్ ఉండేది..అందులోనే తమ కూతురు తో సహా ఆ దంపతులు వుండసాగారు..ఉదయం ఐదు గంటలకల్లా లేచి, స్నానం చేసి, కూతురితో సహా స్వామివారి మందిరం లోకి వచ్చేవారు..అమ్మాయిని తీసుకొని స్వామివారి సమాధి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసేవారు..మొదటి రెండు రోజులూ ఆ అమ్మాయి ప్రవర్తన లో పెద్దగా మార్పు రాలేదు..తల్లిదండ్రులతో పాటు ప్రదక్షిణాలు చేస్తున్నా..మధ్యాహ్నానికి మళ్లీ యథా ప్రకారం ప్రవర్తించేది..మూడు నాలుగు రోజులు గడిచిపోయాయి..ఐదోరోజు ఉదయాన్నే ప్రదక్షిణాలు చేస్తున్న సరోజ..ఒక్కసారిగా వెఱ్ఱి కేక పెట్టి..స్పృహ లేకుండా పడిపోయింది..తల్లీ తండ్రీ ఇద్దరూ భయపడి పోయారు..సుమారు అరగంట పాటు అమ్మాయి స్పృహ లేకుండా ఉన్నది..అమ్మాయిని జాగ్రత్తగా ఎత్తుకొని షెడ్ లోకి తీసుకొచ్చి పడుకోబెట్టారు..పది కిలోమీటర్ల దూరం లో ఉన్న లింగసముద్రం గ్రామం వెళితే కానీ వైద్యుడు దొరకడు.. ఎలా తీసుకెళ్లాలి?..సతమతం అవుతున్నారు..ఇంతలో..సరోజ కళ్ళు తెరిచింది..మెల్లిగా తనంతట తానే లేచి కూర్చుంది..తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు..


ఆరోజు సాయంత్రం సరోజ ఎప్పటిలాగే స్వామివారి సమాధి చుట్టూ ప్రదక్షిణాలు చేసింది..అమ్మాయి ముఖం కూడా ప్రశాంతంగా ఉంది..ప్రక్కరోజు కూడా ఎటువంటి వికారపు చేష్టలు చేయకుండా బుద్ధిగా ఉంది..ఆ తరువాత ఆ అమ్మాయి లో ఇంతకుముందు ఉన్న విపరీతపు పోకడలు కనబడలేదు..తన పని తానే చేసుకోసాగింది..


రెండురోజుల క్రితం సరోజ కేక పెట్టి, స్పృహలేకుండా పడిపోయి..తిరిగి లేచిన తరువాత వచ్చిన మార్పు ఇది అని చూస్తున్న మాకందరికీ అర్థమైపోయింది..ఆ అమ్మాయిని పీడిస్తున్న వ్యాధి అంతటితో పోయిందని తల్లిదండ్రీ కూడా భావించారు.."అమ్మాయిని పట్టిపీడిస్తున్న దుష్టగ్రహం ఆరోజుతో వదలిపోయిందని" అర్చకస్వామి చెప్పారు..


రెండు రోజుల తరువాత తల్లీ తండ్రీ సహాయం లేకుండానే..మందిర ఆవరణ అంతా శుభ్రం చేసింది..మరో వారం కల్లా..అమ్మాయికి పూర్తి స్వస్థత చిక్కిందని నమ్మకం కుదిరాక..ఆ దంపతులిద్దరూ స్వామివారికి పొంగలి పెట్టుకొని..సంతోషంగా అమ్మాయిని తీసుకొని తమ గ్రామానికి వెళ్లిపోయారు..ఆ తరువాత మరెన్నడూ సరోజ విపరీతపు ప్రవర్తన కనబడలేదు..అప్పటినుండి శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి, శ్రీ స్వామివారి సమాధిని దర్శనం చేసుకోవడమనే అలవాటును సరోజ పాటించసాగింది..


ఆనాడు స్వామివారి దయవలన బాగుపడ్డ సరోజ వివాహం చేసుకొని..సరోజమ్మ గా మారి..ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి..ఆ పిల్లలకు వివాహాలు చేసి..తన భర్తతో సహా మూడో కూతురిని, మనుమరాలిని తీసుకొని పదిరోజుల క్రితం శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చింది.. తన జీవితం బాగుపడటానికి శ్రీ స్వామివారే కారణమని..అందుకే తన కుమారులిద్దరికీ దత్తుడి పేరే పెట్టాననీ..ఇద్దరి వివాహాలూ ఇక్కడే జరిపించాననీ..కూతురి పెళ్లి మాత్రం..తమ వంశాచారం ప్రకారం అల్లుడి ఇంటిదగ్గర చేశామని..ఇప్పుడు మనుమరాలి నామకరణం చేయించడం కోసం ఇక్కడికి తీసుకొచ్చాననీ చెప్పింది...


బాధ్యతలన్నీ తీరిన తరువాత..స్వామివారి సన్నిధిలోనే శేష జీవితాన్ని వెళ్లదీయాలని తన కోరిక అని చెప్పింది సరోజమ్మ..


సర్వం..

శ్రీ దత్త కృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: