15, నవంబర్ 2020, ఆదివారం

ఎవరు తీసుకున్న గోతిలో.

 ఎవరు తీసుకున్న గోతిలో.....


ఏ దేశంలో అయినా మైనార్టీ వర్గాలను రక్షించడం, వారు పైకి వచ్చేటట్లు ప్రభుత్వం సహకరించడం ఏ ప్రభుత్వానికయినా కాదనలేని కర్తవ్యం. కానీ స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి జరిగింది ఏమిటి? సాధారణ ముస్లిమ్స్ ని పైకీ తీసుకువచ్చి ముఖ్య జీవన స్రవంతిలో కలిపే ప్రయత్నం బదులు వాళ్ళ ముల్లాలను మచ్చికచేసుకొని వాళ్లకు కొమ్ములు ఇచ్చి వాళ్ళచే వాళ్ళ సాధారణ ముస్లిమ్స్ ని అభద్రతా భావం లోకి రెచ్చగొట్టి ఓటు బాంక్ తయారుచేసుకున్న ఫలితాలను నేడు చూస్తున్నాం. ఎదో హిందూ సంస్థలనో బీజేపీనో ఆక్షేపించడం వల్ల సమస్య పరిష్కారం కాదు.


స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి మొన్న 2014 వరకు అంటే సుమారు 67 సం. లు(వాజపేయి ప్రభుత్వం కూడా మేధావుల దృష్టిలో కాస్త సెక్యూలర్ ప్రభుత్వమే) ఈ దేశాన్ని సెక్యూలర్ ప్రభుత్వాలే ఏలాయి. ఈ ప్రభుత్వాలు దేశంలో మైనార్టీ అన్న అర్ధం మార్చి పడేసి మైనార్టీ అంటే ఒక్క ముస్లిమ్స్ మాత్రమే అన్న స్థితికి తీసుకువచ్చారు.


పోనీ ఈ సెక్యూలర్ ప్రభుత్వాల వల్ల సాధారణ ముస్లిమ్స్ జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగు పడ్డాయో లేదో మేధావులే చెప్పాలి. నాకు తెలిసి ఈ ప్రభుత్వాల వల్ల సాధారణ ముస్లిమ్స్ కి ఒరిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఈ ముస్లిం సముదాయాన్ని ఈ సెక్యూలర్ పార్టీలు ఎప్పుడూ ఒక ఓట్ బాంక్ గానే పరిగణించాయి తప్ప వారి అభివృద్ధి కి నిజంగా తీసుకున్న శాశ్వత చర్యలు శూన్యం.


ఒక ప్రత్యేక సముదాయనికి వారి ఉన్నతికి ఉపయోగపడేవి చేస్తూ ఓట్ బాంక్ గా మలుచుకోవడం రాజకీయంలో తప్పు లేదు. ఎందుకంటే కొన్ని సముదాయాలు ఎక్కువగా ఒక పార్టీకి ఓట్లు వేస్తే నే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ స్వతంత్రం వచ్చిన తరువాత ఎక్కువ రోజులు పాలించిన నిఖార్సయిన సెక్యూలర్ కాంగ్రెస్ నిజంగా ఆ పని చేసిందా? పోనీ మిగతా కాంగ్రెస్ వారిని వదిలేసినా ఆ పార్టీకి అతి ముఖ్య నేతలైన నెహ్రు, ఇందిరా కనీసం ఆ విధానం అవలంబించాయా? అంటే లేదు అనే సమాధానం వస్తుంది.


వారు ఓటు బాంక్ తయారుచేసుకున్న విధానం ముస్లిమ్స్ కి మంచి చేసి కాదు. వారు ముస్లిం ఓట్ బాంక్ మూడు విధాలుగా తయారు చేసుకున్నారు.


1. ముల్లాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, వారి మత విషయాల్లో కానీ, ప్రార్ధనా స్థలాల వ్యవహారాల లో కానీ, వ్యక్తిగత చట్టాలలో కానీ నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు తలపెట్ట కుండా వారిని సంతుష్ట పరిచి వారి గుప్పెట్లో ఉన్న సాధారణ ముస్లిమ్స్ ని తమ ఓటు బాంక్ గా మలచు కున్నారు. 


2. హిందూ సంస్థలను, రాజకీయ పార్టీలను బూచిగా చూపించి మీరు మాకు ఓట్లు వేసి అధికారంలోకి రానివ్వకపోతే అదిగో అక్కడ హిందూ రాజకీయ సంస్థ ఉంది అది రాజకీయం లోకి వచ్చేస్తే ముస్లిమ్స్, ఇస్లాం భారత్ లో ప్రమాదంలో పడిపోతాయి, భారత్ లో సెక్యూలరిజం నాశనం అయిపోతుంది అని భయపెట్టి ఈ ముస్లిం ఓట్ బాంక్ తయారు చేసుకున్నారు.


3. వందల సం. ల.కిందట ముస్లిం రాజుల కాలంలో ఇక్కడ హిందువులపై, వారి దేవాలయాలపై జరిగిన దాడులకు మతానికి ఏం సంబంధం లేదు అవి అందరూ రాజులు దండయాత్రలప్పుడు చేసేవే అని చెప్పి అప్పటి విధ్వంసానికి రంగులు పూసి, అప్పటి కర్కోటక రాజులను కూడా చాలా శాంతి కాముకులుగా చిత్రీకరించి చరిత్ర పుస్తకాలు మార్చి రాశారు. దాని వల్ల హిందువులలో ముస్లిమ్స్ పై ద్వేష భావం పెరగదు అని చెప్పి ముస్లిమ్స్ ని సంతుష్ట పరిచారు. 


కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల వ్యక్తిగత లబ్ది, పలుకుబడి సంపాదించిన ముల్లాలు సామాన్య ముస్లిమ్స్ మెదళ్లలో 60 సం. లుగా కాంగ్రెస్ చెప్పిన ఇవే విషయాలు నూరి పోసి వారి మనసులు కలుషితం చేశారు.


ఇదే పద్దతి అనుసరించి హిందువులలో కూడా ఓట్ బాంక్ తయారు చేసుకున్నారు. అంటే కొన్ని అణగారిని వర్గ పెద్దలను సంతుష్టి పరచడం, వారిలో అగ్రకులాల మీద ద్వేష భావం నూరి పొయ్యడం. 


అంటే ముస్లిమ్స్ దగ్గరకు వచ్చే సరికి పాత చరిత్ర తవ్వుకొని అప్పటి రాజులు చేసిన చెడ్డపనులకు నేటి కాలం ముస్లిమ్స్ ని హిందువులు ద్వేషించడం తప్పు అని ఒక పక్క చెపుతూ రెండో వైపు హిందూ అణగారిన వర్గాలలో మాత్రం నాటి అగ్రవర్ణాలు అణగారిన వర్గాలను ఎలా ఇబ్బంది పెట్టారో పదే పదే గుర్తు చేస్తూ వారు వేరు మీరు వేరు అని చెపుతూ అణగారిన వర్గాలను అగ్రవర్ణాల మీదకు ఉసిగొల్పి, హిందువులను కులాల వారీగా విడగొట్టి తమ ఓటు బాంక్ లు తయారు చేసుకున్నారు.


కాంగ్రెస్ ఈ విధానం ఎంచుకోడానికి కారణం ఉంది. ముస్లిమ్స్ ప్రత్యేక సముదాయంగా కాక మిగతా భారతీయ జన స్రవంతిలో కలిసిపోతే సాధారణ ముస్లిమ్స్ లో ఆలోచన పెరిగితే ముల్లాల గుప్పెట్లోంచి బయటకు వచ్చి వారు స్వతంత్రంగా ఆలోచించవచ్చు. అప్పుడు వారు ప్రభుత్వాన్ని, పార్టీని ప్రశ్నించవచ్చు తాము కష్టపడి తయారుచేసుకున్న ఓట్ బాంక్ బద్దలవ్వవచ్చు.


అందుకే కాంగ్రెస్ ముల్లాలకు తాయిలాలు ఇస్తూ ముస్లిమ్స్ ని ఈ దేశ సాధారణ జన జీవన స్రవంతిలో కలవకుండా ప్రత్యేక సముదాయంగా బతికేటట్లుచేశారు. ఈ సంతూష్టీకరణ రాజీవ్ హయాంలో షా బానో కేసులో సుప్రీం తీర్పును తిరగరాయడంతో ఇంకా ఊపు అందుకుంది.


ఆ పార్టీలో నెహ్రు, ఇందిరా వంటి బడానేతలు ఉన్నంతకాలం ఇది చెల్లింది. ఏ నాడైతే ఆ ఇద్దరూ లేకుండా పోయారో ఇదే కాంగ్రెస్ సంతుష్టీ కరణ పథకాన్ని అంతకంటే ఎక్కువ మోతాదులో అమలుపరచి కొన్ని రాష్ట్రాల్లో కమ్యూనిష్టులు, కొన్ని రాష్ట్రాల్లో కుల, కుటుంబ ఆధారిత ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చి మొదటి సారిగా కాంగ్రెస్ ముస్లిం ఓట్ బాంక్ కి, కుల ఓట్ బాంక్ లకి గండి కొట్టి కాంగ్రెస్ ని కోలుకోలేని దెబ్బ తీసాయి.


 కాంగ్రెస్ పార్టీ మనుగడకు తమ మద్దత్తు అవసరం అనే అన్నంత ఇదిగా ఈ ప్రాంతీయ పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు ఎదిగిపోయాయి.


ఈ కుల, ప్రాంత, మత రాజకీయ పార్టీలు అన్ని తమకు తామే సెక్యులర్ అన్న బిరుదును తగిలించేసుకున్నారు. సమాజంలో ఇంత కుల, ప్రాంతీయ మత రాజకీయాలను పోషిస్తున్న మీ పార్టీలు సెక్యూలర్ పార్టీలుగా ఎలా చెప్పుకుంటారు అని ఏ మేధావి ఏనాడూ ఈ పార్టీలను ప్రశ్నించలేదు. 


ఈ సెక్యూలరిజం ఎంత దాకా పోయింది అంటే దాని పేరు చెప్పుకుని వందల కోట్లు అవినీతి చెయ్యవచ్చు, కుటుంబ పాలన ప్రజలపై రుద్దవచ్చు, రాష్ట్రంలో ఆటవిక పాలన చెయ్యవచ్చు. అయినా సెక్యూలరిజం రక్ష పూర్తిగా ఉంటుంది అనే అన్నంత దాకా.


అంతే కాదు ఈ ఓట్ బాంక్ కోసం దేశ రక్షణ కూడా పణంగా పెట్టేసారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా మన దేశాన్ని ఇబ్బంది పెడదామా అని చూస్తున్న పాక్ ఇక్కడ కొందరిని ఉపయోగించుకొని విధ్వంసానికి ప్రణాళికలు రచించినా ఆ విషయాలు ఇంటెలిజెన్స్ సంస్థలు ముందుగా ప్రభుత్వాన్ని హెచ్చరించినా ఆ వర్గ ప్రజలను అనుమానం పై అరెస్టు చేస్తే వాళ్ళ మనసులు గాయపడి ఓటు బాంక్ ఎక్కడ కోల్పోతామో అన్నంత వరకు పోయింది ఈ సంతూష్టీకరణ రాజకీయాలు. అందుకే 2014 ముందు ప్రతీ ముఖ్య నగరంలోనూ విచ్చలవిడి బాంబు దాడులు.


స్వాతంత్ర సముపార్జన సమయంలో కూడా ఇదే తరహా సంతుష్టీకరణ విధానం గాంధీ, నెహ్రు అవలంభించడం వల్లే ముస్లిం లీగ్ కొరగాని కొయ్యిలా తయారయి గొంతెమ్మ కోర్కెలు కోరి చివరకు మత ప్రాదిపదికిన దేశవిభజనకు దారి తీసింది.


మత ప్రాదిపదికిన దేశం విడిపోయిన తరువాత అయినా స్వాతంత్య్రం వచ్చాక ఈ సంతుష్టీకరణ రాజకీయాలకు స్వస్తి పలికి ఉమ్మడి చట్టాలు అమలుకు ప్రయత్నించి దేశ సమగ్రతకు పాటుపడవలసింది. కానీ అది చెయ్యకుండా సాధారణ ముస్లిమ్స్ కి ఉపయోగపడని మళ్లీ అదే పాత సంతుష్టీకరణ ధోరణి అవలంబించారు.


ఒక పక్క సెక్యూలర్ పార్టీ అని చెప్పుకుంటూ కాంగ్రెస్ ముస్లిం లీగ్ తోనూ ఒవైసీ పార్టీ MIMతోనో పొత్తులు పెట్టుకుంది. దేశంలో ముస్లిం జనాభా పెరిగి ఓట్ బాంక్ పెద్దది అయిన తరువాత ఇప్పుడు MIM వంటి పార్టీలు ఈ సెక్యూలర్ పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. ఎలా అంటే మీ సెక్యూలర్ ఫ్రంట్ లో మాకూ స్తానం ఇచ్చి గౌరవమైన సంఖ్యలో సీట్లు ఇవ్వండి లేకపోతే మేం విడిగా ఇంకా ఎక్కువ సీట్లలో పోటీ చేసి మా ముస్లిం ఓట్ల బాంక్ ను మేమే వాడుకొని ఎక్కువ సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటు సమయంలో మిమ్మల్ని శాసిస్తాం అని చెపుతున్నాయి.


ఇక్కడే సెక్యూలర్ ఫ్రంట్ ఇబ్బంది పడుతున్నాది.

ఎలాగంటే..ముస్లిమ్స్ పార్టీ MIM ని తమ ఫ్రంట్ లో చేర్చుకుంటే తమది సెక్యూలర్ ఫ్రంట్ అని చెప్పుకునే అవకాశం పోవడమే కాదు, ఇది చూపించి బీజేపీ హిందువుల ఓట్లను ఇంకా కొల్లగొడుతుంది. పోని MIM ని చేర్చుకోపోతే ఆ పార్టీ వేరేగా ఎక్కువ సీట్లలో పోటీ చేసి ముస్లిమ్స్ ఓట్లు చీల్చి సెక్యూలర్ ఫ్రంట్ ఓట్లకు గండి కొట్టి పరోక్షంగా బిజెపి ఇంకా బలపడడానికి కారణం అవుతుంది. మొన్న బీహార్ లో జరిగింది అదే.

అదృష్ట వశాతూ ఎన్డీయే కు పూర్తి మెజార్టీ వచ్చింది. అలా కాక రెండు పక్షాలకు సమానంగా సీట్లు వచ్చి MIM కి ఇప్పుడు వచ్చిన 5 సీట్లు వచ్చి ఉంటే వారి అభ్యర్థిని ముఖ్యమంత్రి గా చూసే వారం.


అంటే తాత్కాలిక రాజకీయ లబ్ది కోసం ఆరు దశాబ్దాలు నడిపిన ఆ మత, కుల రాజకీయాలే తమ కొంప ముంచుతున్నాయి.. ఇప్పుడు సెక్యూలర్ రాజకీయాలు ఎలా నడిపినా చివరకు లాభపడేది బిజెపి మాత్రమే.


దీనినే ఇంగ్లీష్ లో catch 22 situation...

అని తెలుగులో అయితే ముందు నుయ్యి వెనుక గొయ్యి అని చెప్పుకోవచ్చు...


....చాడా శాస్త్రి...

కామెంట్‌లు లేవు: