శ్రీ సత్యనారాయణ వ్రతము కథ అందరికి సుపరిచిత మైనది . అది సెంస్కృత శ్లోకములుగా , తెలుగు వచనముగా వ్రత పుస్తకములలో నుండును.
నాకు ఆ వ్రత కథను సరళ పద్యరూపమున వ్రాయవలయునని స్వామి యనుగ్రహమున సంకల్పము కలిగినది . స్వామి దయవలన పూర్తి చేసినాను .
శ్రీ సత్యనారాయణ వ్రత కథను మన అద్వైతవాణి యందు ఈ కార్తీక మాసమునందు ప్రతి రోజు కొంత సమర్పించుటకు అభిలషించు చున్నాను .
సభ్యులు స్వామి కథను ఆస్వాదించి నాకు ఆశీస్సులందితురని ఆశిస్తున్నాను .
ఇట్లు
భవదీయుడు
గోపాలుని మధుసూదన రావు
----------------------------- - ---------------------------------
శ్రీ సత్యనారాయణస్వామి వ్రతమహాత్మ్యము
మొదటి అధ్యాయము
తే. శ్రీకరంబైన నైమిశక్షేత్రమందు
శౌనకాదిగ వరలెడి సకలమునులు
వివిధకథలను సూతుచే వినుచునుండి
వినయమొప్పగ నడిగిరి వేడు కొనుచు 1
తే. "ఎట్టి వ్రతమును జనములు నిలను సేయ
కామితార్థంబు కల్గును కలియుగమున
వినగ కోరిక జనియించె విబుధవర్య !
తెలియపరచుడు వినెదము తీరు గాను 2
క. మునిసంఘము లీరీతిగ
ఘను సూతును నడిగినంత కడుయుత్చుకతన్
విని సూతుడు చిఱునగవుతొ
ననెమునులతొ నంతటిటుల యానందముతోన్ 3
ఆ. నారదుండు దొల్లి నారాయణుని జూచి
యివ్విధంబు నడుగ నెరుగ దలచి
మునిని గాంచి యపుడు ముదమంది శ్రీహరి
నుడివినట్టి నుడులు నుడివె దిపుడు 4
క. సురముని నారదు డొకపరి
హరినామము బాడుకొనుచు నవనకి జనియున్
నరు లచ్చట పలువెతలతొ
కరమరుదుగబ్రతుకుచుండ గాంచెను వ్యధతోన్ 5
సీ. ఈతి బాధలతోడ నిక్కట్లు పడుచును
నకనకలాడెడి నరుల గాంచె
తనురుగ్మతలతోడ తల్లడిల్లుచు మిగుల
నడయాడుచుండెటి నరుల గాంచె
ఆత్మశాంతియులేక నలమట నొందుచు
నలుగుచుండెడి పెక్కు నరుల గాంచె
ఋణ విత్త బాధల కృశియించి బ్రతుకున
నానా వెతలనున్న నరుల గాంచె
తే. నరులు పడియెడి బాధలు నారదుండు
కన్నులారంగ జూచియు కడు వ్యదొంది
మానవుల బాధ పోగొట్ట మదిని దలచి
కదలె వైకుంఠపురముకు గాంచ హరిని 6
క. నారదు డట జని కాంచెను
నారాయణు శేషతల్పు నవ్యామ్బరునిన్
నీరద తను సంకాసుని
శ్రీరమ సంసేవ్య పాదు శ్రీతమందారున్ 7
సశేషము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి