🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 81*
*****
*శ్లో:- భార్యా వియోగశ్చ, జనాపవాదః ౹*
*ఋణస్య శేషం, కుజనస్య సేవా ౹*
*దారిద్ర్యకాలే ప్రియదర్శనం చ ౹*
*వినాగ్నినా పంచ దహన్తి కాయమ్ ౹౹*
*****
*భా:-1. సంసార రథసారథిగా గృహకార్యాలలో కీలకపాత్ర పోషిస్తూ,కష్టసుఖాల్లో,కలిమిలేముల్లో,గెలుపోటములలో తోడూనీడగా నేనున్నానని అభయమిచ్చే భార్యామణి మరణం వల్ల కలిగే వియోగబాధ ; 2.జాతి, కుల, మత, సామాజిక,ఆర్థిక,హార్దిక అసమానతల వల్ల పగవారు,పరాయివారు,పరిసరాలవారితో ఇమడలేని విపత్కర పరిస్థితుల్లో చీటికీమాటికీ వచ్చే లోకాపవాదము ; 3.సంసార సాగరాన్ని యీదడానికి చేసిన అప్పులు వడ్డీలకు వడ్డీలు పెరిగి, తడిసి మోపెడై, చివరకు తీర్చడానికి చేతగాక చేతులెత్తేసే పరిస్థితి దాపురించడం ; 4. బ్రతుకుతెరువు కోసం దుర్మార్గులైన మోతుబరుల బారినబడి, వారి మెచ్చుకోలు నిమిత్తం నీచాతినీచమైన సేవలు చేయవలసి రావడం ; 5. కుటుంబ జీవనం గడవడమే దినదినగండమై, పగలే చుక్కలు కనపడుతున్న దుర్భర దారిద్ర్య పరిస్థితులలో ప్రేమాదరాభిమానాలను ఒలకబోస్తూ, అతి సన్నిహిత బంధువులు ఆత్మీయంగా ఆకస్మిక దర్శనానికి రావడము - అనే యీ ఐదు సంఘటనలు నిప్పు లేకుండానే చిత్తాన్ని, కాయాన్ని నిలువునా దహించివేస్తాయి. చితిమంటలు చచ్చిన తరువాత కాలిస్తే, ఇవి బ్రతికుండగానే కాల్చివేస్తాయని సారాంశము. పగవాడికి కూడ ఈ ఐదు దరి దాపులకు రాకూడదని కోరుకోవాలి. ఒకవేళ వచ్చినా నిబ్బరంగా ఉండడం నేర్చుకోవాలి*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి