రాయలసీమ అన్నమాటను మొదటగా ప్రయోగించిన వ్యక్తి ఎవరు ?
.....................................................
1792 లో టిప్పు బ్రిటీష్ ఈస్ట్ ఇండియా మిత్రమండలిచేత ఓడించబడిన తరువాత శ్రీరంగపట్నం సంధి జరిగింది. ఈ సంధిషరుతుల ప్రకారం టిప్పు తనమైసూరు రాజ్యంలో సగభాగాన్ని కోల్పోయాడు. మరఠాలు, హైదరాబాదు నిజాం, బ్రిటిష్ వారు టిప్పునుండి కప్పంగా తీసుకొన్న రాజ్యాన్ని పంచుకోవడం జరిగింది. బ్రిటిష్ వారికి అనంతపురం, బళ్ళారి, సేలం, మలబారులో కొంతభాగం దక్కాయి.
టిప్పు శ్రీరంగపట్నం సంధిషరుతులను ఉల్లంఘించినందుకుగాను నాల్గవ మైసూరు యుద్ధం అనివార్యమైంది. యుద్ధానంతరం మైసూరు ఒడయారు రాజ్యం పునరుద్ధరించబడింది. మిగిలిన రాజ్యభాగాలను మిత్రపక్షం పంచుకోగా హైదరాబాదు నిజాంకు కడప, కంభం, ఆదవాని (ఆదోని ), కందనవోలు (కర్నూలు), కడప, హర్పణహళ్ళి, అర్కాటు మొ॥ప్రాంతాలు దక్కాయి.
నిజాం ప్రభువు అప్పటికే సైన్యసహకారపద్ధతి వలన ఈస్టిండియా కంపెనీకి బకాయిలు పడ్డాడు. బకాయిల చెల్లింపుల నిమిత్తం 1792లో దక్కిన అనంతపురం, బళ్ళారి ప్రాంతాలను, హర్పణహళ్ళి, కంభం, ఆదవాని, కర్నూలు, కడప, ఆర్కాటు ప్రాంతాలను దాఖలు పరచడం జరిగింది.
నిజాం బ్రిటిష్ వారికి శాశ్వితంగా ఈ ప్రాంతాలను దత్తత ఇచ్చాడు కాబట్టి ఈ ప్రాంతాలను దత్తప్రాంతాలుగా అనగా Ceded Areasగా, పిలవడం జరిగింది. తదనంతరకాలంలో తమ ఆధీనంలోవున్న ప్రాంతాలను బళ్ళారి జిల్లాగా బ్రిటిష్ వారు 1800లలో ఏర్పాటుచేసి బ్రిటిష్ సైన్యంలో మేజరు జనరలుగా వున్న థామస్ మన్రోను జిల్లా కలెక్టరుగా నియమించడం జరిగింది. అప్పటినుండి ఈ ప్రాంతాలను సీడెడ్ డిస్ట్రిక్ట్ గా పిలవడం జరిగింది.
మే.జ.థామస్ మన్రో కింద పనిచేయటానికి హర్పణహళ్ళి, అనంతపురం, కంభం, కడప లలో నలుగురు సబ్ కలెక్టర్లను నియమించారు.బళ్ళారి జిల్లాకేంద్రమైనప్పటికి మన్రో అనంతపురంలోనే కార్యాలయం ఏర్పాటుచేసుకొని ఉద్యోగనిర్వహణ చేశాడు.
1808 లో బళ్లారి జిల్లానుండి విడదీసి కడప జిల్లాను ఏర్పాటుచేశారు.
1882లో అనంతపురం జిల్లా ఏర్పడింది.
1911లో చిత్తూరు జిల్లా ఏర్పడింది.
దత్తమండలాలు అని పిలవడం బానిసత్వానికి గుర్తని భావించి చిలుకూరి నారాయణరావు రాయలసీమ పదాన్ని సూచించడం జరిగింది. 1927లో జరిగిన ఆంధ్రమహాసభలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు దత్తమండలాలకు రాయలసీమ అనే పేరు ప్రతిపాదించి ఆమోదింపచేశాడు.
చరిత్రపాఠ్యాంశాలలో రాయలసీమ అనేపేరు పెట్టింది గాడిచర్ల అనేవుంది.కాబట్టి విద్యార్థులు జాగ్రత్త.
అనంతపురం ఆర్ట్స్ కళాశాల అప్పటి ఉపాధ్యాయుడైనవాడు సాహితి పిపాసకుడు చరిత్రపరిశోధకుడు కళాప్రపూర్ణ చిలుకూరి నారాయణరావు రాయలసీమ అనే పేరును మొదటగా పెట్టాడని అవగతమైంది కదా!
కాబట్టి రాయలసీమ అనే పదాన్ని మొదట ప్రయోగించినవాడు చిలుకూరని అనుకొంటే పప్పులో కాలేసినట్లే.
శ్రీనాథకవి సార్వభౌముడుఈ పదం మొదటిసారిగా ఉపయోగించినట్లు నేను చదివినట్లు గుర్తు. అది నిజమో కాదో తెలియదు కాని ఉన్న ఆధారాల ప్రకారం సిద్ధవట ప్రాంతాన్ని పాలించిన మహమండేలేశ్వరుడు మట్ల వేంకటరామభూపాలుడు (C - 1580 - 1600) అంకితం పొందిన అభిషిక్తరాఘవంలో రాయలసీమ పదం మొదటిసారిగా కనబడుతోంది. గ్రంథకర్త నడిమింటి వేంకటపతి మట్ల అనంతభూపాలుని శౌర్యాన్ని వర్ణిస్తూ వ్రాసిన గ్రంధమే అభిషిక్తరాఘవం.
మట్ల అనంతభూపాలుడు, మట్ల వేంకటభూపాలునికి పూర్వీకుడు.
పద్యం.
గాయకు లశ్వరాయ బలఖానులు మట్ల అనంతరాజ శౌ
క్షేయక ధార ద్రెవ్విరని చెప్పెడి వింతియకాక వేలుపున్
*రాయలసీమ* లోన జతురంగ బలంబులతోడ వైరముల్
పాయకయున్నవారు సరిపాళెము వైచిన యట్లజస్రమున్.
ఇక్కడ రాయలసీమ అంటే విజయనగర చక్రవర్తుల ఏలుబడిలోని ప్రాంతమని అర్థం.
(1) శ్రీనాథుడు రాయలసీమ అనేపేరును మొదటగా ప్రయోగించాడని 1953లో ఉరవకొండ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు నూతలపాటి పేరరాజు వ్రాసిన విజయనగర చరిత్రలో వ్రాసినట్లుగా నేను చదివినట్లుగా గుర్తు. పుస్తకం ఎవరికో ఇచ్చాను. ఆ మహనుభావుడు తిరిగి ఇవ్వలేదు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఆ పుస్తకం వుంటే దయచేసి చెప్పండి.
అదే విధంగా శ్రీనాథుడు రాయలసీమ పదాన్ని పెర్కొన్నాడా ? తెలిస్తే చెప్పండి.
(2) కర్నూలు జిల్లా ఎప్పుడు ఏర్పడిందో చెప్పగలరా !
.................................................................................................................
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి