ఓం నమశ్శివాయ 🙏
శ్రీకాశీ విశ్వనాథుఁడు ఒక శివరాత్రి పర్వ దినాన అనుగ్రహంతో ప్రవహింపఁ జేసిన శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి యందలి
26 వ పద్యము నుండి 30 వ పద్యము వరకు.
👇
26. ప్రపంచ భూత సాక్ష్య దివ్య పంచ వక్త్ర శోభివే,
విపంచి నాదమాధురిన్ సువేద్యమౌదువే హరా!
కృపాకటాక్ష వీక్షణల్ ధరిత్రిపైన నింపితే!
ప్రపూజ్య ఓం నమశ్శివాయ భవ్య మంత్రమై. శివా!
27. వినాశమన్నదెన్న లేని విశ్వ సాక్షివే ! హరా !
మనోజ్ఞ సృష్టి చేసి, దాని మట్టిఁ జేయ న్యాయమా ?
ప్రణామముల్ ప్రపంచ దివ్య భవ్య భాగ్య రక్షకా!
ననున్ గనంగదోయి సాంబ! నా మనోజ్ఞుఁడా! శివా!
28. నిరంతరాయ దృష్టి నీది. నిర్వికల్పుఁడా! భవా!
భరింపరాని దుష్ట భావ పాపు లేల పుట్టిరో!
విరించి చేయు సృష్టిఁ గాంచి వేగమే గ్రహించి, యీ
భరంబుఁ బాపి కావుమయ్య భారతాంబ నో శివా!
29. కవీశ్వరుల్ గ్రహించునట్లు కానిపించుమా హరా!
నివేదనంబు లందుమా! వినీతులన్ గ్రహింపుమా!
సువేద్యమై, మనోజ్ఞమైన సుందరాకృతిన్ కృపన్
కవిత్వ తత్వ రూప మొంది కాంచఁ జేయుమా! శివా!
30. గుణత్రయంబు నీవయై, ప్రకోప దుష్ట సంహతిన్
వినాశమొందఁ జేయవేమి? విశ్వ రూపుఁడా! హరా!
వినీతులెల్ల బాధలొంద ప్రీతి తోడఁ గాంతువా?
అనాది దుష్ట తత్వమెన్ని యార్పుమా! మహా శివా!
🙏
ఓం నమశ్శివాయ.🙏
శ్రీకాశీవిశ్వనాథార్పణమస్తు.
🙏
చింతా రామకృష్ణారావు.
🙏
ఈ పద్యములను గానం చేసి ప్రాణం పోసిన శ్రీమతి బి.సుశీలాదేవి బాగవతారిణి గారికి నా ధన్యవాధహదములు.🙏
👇
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి