ఆంధ్రప్రదేశ్ : పశ్చిమ గోదావరి :
*ఏలూరు శాంపిల్స్ భయానకం- విస్తుపోతున్న డాక్టర్లు- బయటపడుతున్న నిజాలు*
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుపట్టని వ్యాధికి గల కారణాలు క్రమంగా బయటికి వస్తున్నాయి. వింతవ్యాధికి గల కారణాలను తేల్చేందుకు పంపుతున్న శాంపిల్స్‌ను పరీక్షిస్తున్న డాక్టర్లు విస్తుపోతున్నారు. అసలు ఇలాంటి పరిస్ధితుల్లో జనం అక్కడ ఎలా బతుకుకున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అంతా ఊహించినట్లుగానే నీటి కాలుష్యమే ఈ వింతవ్యాధికి కారణమని నిర్దారణ అవుతుండగా... ఇందులో క్రిమిసంహారకాల శాతం కొన్ని వేల రెట్లు అధికంగా ఉన్నట్లు తేలడం విభ్రాంతికి గురిచేస్తోంది. వ్యవసాయం పేరుతో స్ధానికంగా విచ్చలవిడిగా సాగుతున్న *పురుగుమందుల వాడకమే దీని వెనుక ఉన్నట్లు స్పష్టమవుతోంది*.
ఏలూరు వింతవ్యాధి శాంపిల్స్ భయానకం
ఏలూరులో తాజాగా బయటపడిన వింతవ్యాధికి గల కారణాలను వెలికితీసేందుకు ఎయిమ్స్, డబ్లూహెచ్‌వో, సీసీఎంబీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముందుగా రోగుల శరీరాల నుంచి సేకరించిన శాంపిల్స్ పరీక్షించినప్పుడు వాటిలో సీసం, నికెల్ ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు, ఇప్పుడు నీటి నమూనాలను పరీక్షిస్తే మరిన్ని విభ్రాంతికర వాస్తవాలు బయటికొచ్చాయి.
నీరు ఎన్నడూ లేనంత దారుణంగా కలుషితమైందని, వైరస్ ఆనవాళ్లు లేకపోయినా పురుగుమందుల అవశేషాలు మాత్రం వేల రెట్లు అధికంగా ఉన్నాయని నిర్ధారణ అవుతోంది. దీంతో వీటిని మరింత లోతుగా పరీక్షించేందుకు డాక్టర్లు సిద్ధమవుతున్నారు.
దారుణంగా కృష్ణా, గోదావరి నీరు..
ఏలూరుకు కృష్ణా, గోదావరి నదుల నుంచి నీళ్లు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకు కృష్ణా కాలువ నీరు, మరికొన్ని ప్రాంతాలకు గోదావరి నీళ్లను తాగునీరుగా మార్చి అందిస్తున్నారు. ఈ రెండు నదుల నీళ్ల నుంచి సేకరించిన శాంపిల్స్‌లోనూ క్రిమిసంహారకాలు వేల రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. వీటిలో కలుపుమొక్కల నివారణకు వాడే మందులతో పాటు దోమలు, ఈగలు, బొద్దింకల నివారణకు వాడేవి, పంటల్లో చీడపీడల నివారణకు వాడే అలాక్లోర్, ఓపీ-డీడీటీ, పీపీ-డీడీఈ వంటి ప్రమాదకర రసాయనాలు ఈ నీళ్లలో ఉన్నట్లు తేలింది.
కృష్ణా, గోదావరి కాలువల్లో అలాక్లార్ లీటర్‌కు సగటున 10 మిల్లీ గ్రాములకు పైగా ఉండగా.. పెన్షన్ లైన్ నీళ్లలో అలాక్లోర్ 14 మి.గ్రాములు, ఓపీ-డీడీటీ 15 మిల్లీగ్రాములు, జేపీ కాలనీలో పీపీ-డీడీఈ 14 మిల్లీగ్రాములు, ఓపీ-డీడీటీ 15 మిల్లీ గ్రాములు, గాంధీ కాలనీలో ఓపీ-డీడీడీ 14 మిల్లీగ్రాములు, పీపీ-డీడీడీ 15 మిల్లీగ్రాములు, రామచంద్రరావుపేటలో అలాక్లోర్ 10 మిల్లీగ్రాములు, ఓపీ-డీడీఈ 13.37 మిల్లీగ్రాములున్నట్లు తేలింది.
*17 వేల రెట్లు ఎక్కువగా రసాయనాలు*..
ఏలూరు కృష్ణా కాలువ నుంచి సేకరించిన నీటి నమూనాల్లో మెథాక్లీక్లోర్ ఏకంగా 17 వేల640 రెట్లు ఎక్కువగా ఉందని డాక్టర్లు తేల్చారు. తాగునీటిలో ఈ రసాయనం అసలు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కేవలం 0.001 మిల్లీ గ్రాములకు మించకూడదు. కానీ తాజా శాంపిల్స్ పరీక్షల్లో ఇది 17.64 మిల్లీ గ్రాములున్నట్లు తేలడం డాక్టర్లను సైతం కలవరపెడుతోంది.
ఏలూరులో దాదాపు ఆరు ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించి పరీక్షించగా.. అన్ని చోట్లా దాదాపు ఒకే ఫలితాలు రావడంతో జనాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్లుగా నగరానికి సరఫరా అవుతున్న కృష్ణా, గోదావరి జలాలు విషతుల్యం కావడం వల్లే రోగుల శరీరాల్లో సీసం, నికెల్ చేరినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వాల నిర్లక్ష్యం, రైతుల విచ్చలవిడితనం బయటికొస్తున్నాయి.
*శాంపిల్స్ చూసి విస్తుపోతున్న డాక్టర్లు*..
ఏలూరు నుంచి పలు ల్యాబ్‌లకు వెళ్తున్న శాంపిల్స్ పరీక్షిస్తున్న డాక్టర్లు నిర్ఘాంతపోతున్నారు. ఏలూరులో ఎన్నేళ్లుగా ఇలాంటి నీటిని జనం వాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇంతటి హానికర రసాయనాలు నీటిలో ఉండేందుకే వీల్లేదని, అలాంటిది వేల రెట్లు ఎక్కువగా ఉండటం, దాన్ని కొన్నేళ్లుగా అలాగే వాడేస్తుండటంతో జనం శరీరాల్లో భారీగా సీసం, నికెల్ అవశేషాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రోగులుగా మారిన వారితో పాటు ఇతరులను కూడా పరీక్షించాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. మరి ప్రభుత్వం అందుకు సిద్ధమవుతుందా లేక తీవ్రత బయటపడితే అభాసుపాలు కావాల్సి వస్తుందని వదిలేస్తుందా చూడాల్సి ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి