కొన్ని భోజ కాళిదాస కథలలో మహాకవిని స్త్రీ లోలుడిగా చిత్రీకరించారు.కవిగా,లలిత శృంగార రస పోషణ లో
ఆయన అందె వేసిన చెయ్యి కావటం వల్ల ఇలాంటి అపోహ కలిగిందా? లేక కాళీ ఉపాసనతో పాటు కేళీ పిపాస
కూడా ఆయన జీవితం లో భాగంగా చెప్తే ఈ కథలు మరీ ఆసక్తి కరంగా వుంటాయని యిది ఈ కథలకు జోడించ
బడిందా? లేక 'ఎంత వారలయినా కాంత దాసులే' అన్న లోకోక్తి ని కాళిదాసు కూడా పూర్తిగా అనువర్తించాడా?
చెప్పడం కష్టం.
ధారానగరం లో రమణీ మణి అనే రాజ నర్తకి వుండేది. ఆమె సౌందర్యానికి నాట్య ప్రతిభకీ దాసుడై రాజు ఆమెను తన ఉంపుడుగత్తె గా వుంచుకున్నాడు.ఆమెకు కాళిదాసు కవిత్వమంటే చాలా అభిమానం.ఆయనతోనూ ఆమెకు సంబంధాలుండేవి.ఈ రహస్యం ఆమె రాజుకు తెలియకుండా జాగ్రత్త పడింది.
అయినా కొన్నాళ్ళకు రాజుకు అనుమానం వచ్చింది. ఆయన దాన్ని తెలుసుకునేందుకు ఒక ఉపాయం చేశాడు
రాజు ఆమె భవనానికి వచ్చినప్పుడు గోడ మీద శ్లోక పాదం వ్రాశాడు.
'కుసుమే కుసుమోత్పత్తి: శ్రూయతే న తు దృశ్యతే'
అర్థము:-ఒక పువ్వులో నుంచి మరో పువ్వు పుట్టటం వినటమే గానీ ఎక్కడా కనబడదు.
ఈ శ్లోకం పూర్తిచేసిన వారికి అక్షర లక్షలు యిస్తానని భోజుడు రమణి తో చెప్పాడు.ఒక వేళ కాళిదాసు ఇక్కడికి వచ్చినట్టయితే తప్పక పూర్తి చేస్తాడు,అప్పుడు రహస్యం బట్ట బయలవుతుందని ఆయన ఉద్దేశ్యం
యింత పెద్ద బహుమతి అంటే రమణికి ఆశ పుట్టింది.
ఈసారి కాళిదాసు వచ్చినప్పుడు ఆమె గోడమీది శ్లోక పాదం చూపించి నా కోసం దీనిని పూర్తి చేయండి అని కోరింది.ఇదేమీ తెలియని కాళిదాసు చెప్తాను రాసుకో అని
'బాలే, తవ ముఖాంభోజే దృష్టం యిందీవర ద్వయం'
అర్థము:-- కానీ ఓ ముద్దరాలా యిప్పుడు నిన్ను చూడగా,నీ ముఖ మనే తామరపువ్వులో నీ కన్నులనే నీలి కలువలు పుట్టినట్టు కనిపిస్తున్నాయి సుమా!అన్నాడు మహా కవి.
అంత చక్కని పూరణ వినగానే రమణికి మతి పోయింది.ఈ పూరణ రాజుకు చూపిస్తే తనకు అక్షర లక్షలు ఖాయం.అనుకోని దురాశ తో కాళిదాసు నిద్రిస్తుండగా ఆయన తల నరికేసి శవాన్ని దాచేసింది.
రాజుగారు వ్రాసిన దానికిందే తన చేత్తో కాళిదాసు పూరణను కొంచెం మార్చి 'బాలే' అనే పదం కాక రాజును వుబ్బేద్దామని 'రాజే!'అని వ్రాసింది
కుసుమే కుసుమోత్పత్తి: శ్రూయతే న తు దృశ్యతే
రాజే,తవ ముఖాంభోజే దృష్టం యిందీవర ద్వయం
అర్థము:-- ఒక పువ్వులోనుంచి యింకొక పువ్వు పుట్టటం వినడమే గానీ ఎక్కడా కనబడదు.కానీ యిప్పుడు నిన్ను చూస్తె రాజా!నే ముఖమనే కమలం లో కన్నులనే నల్ల కలువల జంట కనబడుతున్నది.
రాజు రానే వచ్చాడు పూరణ చూసి ఎవరు పూరించారు?అని అడిగాడు యింకెవరు నేనే అని బొంకింది.
రాజు ఆమె చెంప చెళ్ళు
మనిపించాడు.దుర్మార్గురాలా నీ అబద్దం నమ్మటానికి నేను మూర్ఖుడ ననుకున్నావా?.యిది కాళిదాసు వ్రాసినదని స్పష్టంగా తెలుస్తూంది.ఎటొచ్చీ నీ బుద్ధి హీనత వల్ల 'బాలే'
అన్న మాటను మార్చి 'రాజే' అని వ్రాశావు.ఆ మాత్రం తో నేను బుట్టలో పడిపోతాననుకున్నావు.కానీ 'రాజన్'అనే సరయిన సంబోధనకు బదులు నీ సొంత తెలివి నుపయోగించి 'రాజే' అని తప్పు రాసి నీ దొంగ బుద్ధి ని నువ్వే ప్రకటించు కున్నావు.చెప్పు యింతకూ కాళిదాసు ఎక్కడ?అని నిలదీశాడు.
రమణి భయపడిపోయి తప్ప్పు ఒప్ప్పుకొని జరిగిన దంతా చెప్పింది.కాళిదాసు మరణించాడన్న వార్త రాజు నమ్మలేక పోయాడు.రమణి కాళిదాసు శవాన్ని చూపగానే రాజు మూర్ఛ పోయాడు.కాసేపటికి తేరుకొని
తన యిష్ట దేవత భువనేశ్వరీ దేవిని ప్రార్థించాడు.నా జీవితం లో మిగిలి వున్న ఆయువు లో సగం ఈ కవీశ్వ రుడికి ధార పోస్తాను.ఈయనను బ్రతికించు తల్లీ అని ప్రార్థించాడు.దేవి కరుణతో కాళిదాసు లేచి వచ్చాడు.రాజా నీ ఆయువు లో సగం ధారపోసి నన్ను బ్రతికించావు.నా శేష జీవితం నీకే అంకితం చేసి నీ ఋణం తీర్చుకుంటాను ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించు. అన్నాడు కవిరాజు.కవీశ్వరా నువ్వు లేకుండా నేను జీవించ లేను,జీవించినా అటువంటి నిస్సార మైన జీవితం నాకు వద్దు.మనం జంటగా ఒక కావ్య రాద్దాం
నీ పేరూ,నాపేరూ శాశ్వతంగా చరిత్ర లో నిలిచి పోతుంది.అన్నాడు రాజు.
తర్వాత యిద్దరూ కలిసి 'చంపూ రామాయణ కావ్యాన్ని ప్రారంభించారు.(చంపూ కావ్య మంటే శ్లోకాలూ,గద్యాలూ రెండింటి తో చెప్పబడ కావ్యం)సరళంగా సాగే ఈ చక్కని గ్రంథం 'భోజ చంపువు'గా ప్రచారం పొందింది.దీన్ని ఈనాటికీ సంస్కృత విద్యార్థులు తమ తొలి అధ్యయన గ్రంథాలలో ఒకటిగా చదువుకుంటారు.అయితే ఈ రామాయణం 'సుందరకాండ' వరకే భోజ,కాళిదాసుల రచన.అక్కడిదాకా వ్రాసి యిద్దరూ ఒకే సారి మరణించారు.మిగిలిపోయిన యుద్ధ కాండను ఆ తర్వాత 16వ శతాబ్దం లో లక్ష్మణ సూరి అనే ఆంధ్ర దేశ పండితుడు పూర్తి చేశాడట...
------------------- శుభరాత్రి ----------------------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి