🌹శ్రీ రామ తీర్థం 🌹
✍️హిందువులకు ఆరాధ్య దైవం, ఆదర్శ ప్రభువు శ్రీ రామ చంద్ర స్వామి.
భారత దేశ నలుమూలలా ప్రతి ఒక్క పల్లెలో అయోధ్య రాముని ఆలయం ఉంటుందంటే అతిశయోక్తి లేదు. భదాద్రికి ( భద్రాచలం) సరి సమానమైన రామ క్షేత్ర అన్వేషణలో ప్రముఖంగా వినిపించిన రెండు క్షేత్రాలు ఒంటిమిట్ట ( కడప జిల్లా), మరియు శ్రీ రామ తీర్థం ( విజయనగరం ).
పూసపాటి రాజుల రాజధాని నగరంగా చరిత్రలో సుస్థిర స్థానం కైవసం చేసుకొని పాత కొత్త సంస్కృతులకు, పురాతన మరియు నూతన నిర్మాణాలకు కూడలిగా ఉత్తరాంధ్ర లో ఉన్నప్రసిద్ద నగరం విజియనగరం. ఈ రాజ వంశం వారు నిర్మించిన నూట ఆరు ఆలయాలలో శ్రీ రామ తీర్థం ఒకటి.
సన్నటి తారు రోడ్డుకు ఎడమ పక్కన నున్నగా, పచ్చదనం లేకుండా ఉన్న బోడి కొండలు.
కుడిపక్కన నాలుగు వందల సంవత్సరాల క్రిందట నిర్మించిన ఆలయం.
కొద్దిగా ఎత్తులో చుట్టూ ప్రహరీ గోడతో ఉన్న ఆలయ ప్రాంగణానికి ఉత్తరం పక్కన నూతనంగా అయిదు అంతస్థుల గాలి గోపురం నిర్మించారు.
పది ఎకరాల పై చిలుకు విస్తీర్ణంలో ఉన్న "భాస్కర పుష్కరణి", ఈ క్షేత్రంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న స్థలాలలో ఒకటి.
నేడు ఆలయంలో పూజలు అందుకొంటున్న మూల విరాట్టులు ఎవరి కంట పడకుండా వెయ్యి సంవత్సరాలు అజ్ఞాత వాసం చేసినది ఈ సరస్సులోనే !
అందుకే భక్తులు ఈ నీటిని గంగా జల సమానంగా పరిగణిస్తారు.
నీరు నిండిన పిడతల పైన ప్రమిదలను ఉంచి దీపం వెలిగించి ప్రార్ధిస్తే మనోభిష్టాలు నెరవేరుతాయి అన్నది భక్తుల విశ్వాసం.
ఇలా దీపాలు వెలిగించడానికి ఈశాన్యం లో శ్రీ లక్ష్మీ నారాయణ రూపాలను నెలకొల్పారు.
పచ్చగా పాచిపట్టినా, తామర పుష్పాలతో, ఆకులతో ఆకర్షణీయంగా ఉన్న కోనేరులో ముఖ పాద హస్తాలను పరిశుబ్ర పరుచుకొని ఆలయం వైపు వెళతారు భక్తులు.
ఉత్తరం వైపు రాజ గోపురం ఉన్నాప్రధాన ద్వారం మాత్రం తూర్పునే !
విరాట్ నిర్మాణాలు లేవు.
ద్వారానికి పైన గుమ్మటం లాగా ఉన్న నిర్మాణాలున్నాయి.
కళింగ ప్రాంత నిర్మాణ శైలి.
ఇలాంటివే శ్రీ కూర్మం, అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాలలో ఉంటాయి.
ద్వారం వద్ద రాతి మీద ఆలయ పురాణ చారిత్రక గాధల వివరాలను చెక్కి భక్తుల కొరకు ఉంచారు.
దాని ప్రకారం క్షేత్ర పురాణ గాధ ద్వాపర యుగం నాటిదిగా అర్ధమౌతుంది.
మాయా జూదంలో ఓడిన పాండు నందనులు అరణ్య వాసానికి తరలి వెళుతున్న సమయంలో శ్రీ కృష్ణుడు వారికి సీతా లక్ష్మణ సమేత శ్రీ రామ విగ్రహాలను ప్రసాదించి, భక్తి శ్రద్దలతో పూజిస్తే వనవాస కాలం చక్కగా గడిచి పోతుంది అని తెలిపారట.
అలానే చేస్తూ వచ్చిన పాండవులు వనవాస ఆఖరి రోజులు ఇక్కడ గడిపి, అజ్ఞాత వాసానికి వెళుతూ విగ్రహ సంరక్షణ, పూజాదికాల భాద్యత " వేద గర్భుడు" అనే బ్రాహ్మణునికి అప్పగించారట.
నాటి నుండి అనేక శతాబ్దాల పాటు ఆయన వంశం వారే ఇక్కడ నీలాచల పర్వత పై భాగాన పాండవులు నిర్మించిన ఆలయ నిర్వహణా భాద్యతలను చూసుకోనేవారట.
కానీ క్రీస్తు శకం రెండో శతాబ్ద కాలానికి ఈ ప్రాంతంలో ఒక దాని తరువాత ఒకటిగా జైనం మరియు బౌద్ధం ప్రాబల్యాన్ని సంతరించుకొన్నాయి.
వారి విగ్రహారాధనకు వ్యతిరేకులు.
నాటి జైనుల మరియు బౌద్దుల స్థూపాలను, ఆరామ, విహారాల శిధిలాలను పక్కనే ఉన్ననీలా చల , ఘని, దేవభక్తుల కొండల మీద నేటికీ చూడవచ్చును.
తూర్పు చాళుక్య రాజు విమాలదిత్యుని ( 1011 - 1022) కాలం నాటి శాసనం పర్వతం పైన ఆంగ్ల పరిశోధకులకు పంతొమ్మిదో శతాబ్దంలో లభించినది అంటారు.
వారి ప్రభావం వలన వేద గర్భుని వంశీకులు విగ్రహాలను నీటి మడుగులో దాచి ప్రాంతం విడిచి వెళ్లి పోయారట.
అలా సుమారు వెయ్యి సంవత్సరాలు అజ్ఞాతంగా నీటిలో ఉండిపోయిన శ్రీ రాముడు తిరిగి పదిహేడో శతాబ్దంలో ఆలయ ప్రవేశం చేసిన ఉదంతం కూడా విశేషమైనదే!
ఇక్కడికి సమీపంలోని "కుంభిలాపురం " ( నేటి కుమిలి) రాజధానిగా చేసుకొని పదహారో శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించే వారు పూసపాటి వంశం వారు.
నాటి ప్రజలలో చాలా మంది అటవీ సంపద మీద ఆధారపడి జీవనం సాగించేవారట.
అలాంటి వారిలో పుట్టు మూగ అయిన ముదుసలి కూడా ఒకరు.
ఒక నాడు ఆమె అడవిలోనికి వెళ్ళిన సమయంలో తీవ్ర గాలులతో పెద్ద వర్షం కురిసిందట.
ముసలమ్మ భయపడిపోయి ఒక చెట్టు క్రింద వానకు తడుస్తూ వణుకుతూ రామనామ జపం చేయసాగిందట
ఆ సమయంలో ఆమెకు శ్రీ రామచంద్రుడు దర్శనమిచ్చి భయపడవలదని, వాక్కును ప్రసాదించి, తను సమీపంలో ఉన్న కోనేరులో ఉన్న సంగతి తెలిపారట.
వాన వెలసిన తరువాత నగరానికి తిరిగి వచ్చిన పుట్టు మూగ మాట్లాడటం తెలిసి పిలిపించుకొన్న రాజు శ్రీ సీతా రామ చంద్ర గజపతి విషయం తెలుసుకొని తరలి వెళ్లి విగ్రహాలను వెలికి తీసి కొండ పైన, క్రింద ఆలయాలను నిర్మించారట.
తీర్ధం ( జాలం) లో లభించిన శ్రీ రామడు కొలువుతీరిన క్షేత్రంగా "శ్రీ రామ తీర్థం " అన్న పేరోచ్చినది.
ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే అంతర భాగంలో ప్రహరీ గోడకు ఆనుకొని నలు వైపులా మండపం నిర్మించారు.
బహుశా యాత్రీకులు సేద తీరడానికి ఉద్దేశించి కాబోలు అనిపించింది,
ఎదురుగా ధ్వజస్థంభము,బలి పీఠం. ముఖ మండపం లోనికి ప్రవేశ ద్వారం.
ప్రదక్షిణా ప్రాంగణంలో దక్షిణం వైపున పాత ఉప ఆలయాల స్థానంలో పునః నిర్మించిన శ్రీ వైకుంఠ స్వామి మరియు శ్రీ మాధవ స్వామి కొలువై ఉంటారు.
పడమర వైపున శ్రీ ఆండాళ్ పురాతన ఉపాలయం.
ఉత్తరాన శ్రీ భూ భుజంగ వరాహ లక్ష్మి నరసింహ స్వామి మరియు శ్రీ వేణుగోపాల స్వామి ఉపాలయాలు ఉన్నాయి.
రాయి సున్నమూ కలిపి నిర్మించిన మండపాలు, స్థంభాల పైన ఎలాంటి శిల్పాలు చెక్కడాలు లేవు.
అమ్మవారి ఆలయంలో స్థంభాల అమరిక ప్రత్యేకంగా కనిపించినది. దగ్గర దగ్గరగా అమర్చారు.
వాయువ్యంలో కళ్యాణ మండపం.
ఈశాన్యంలో శ్రీ రామ క్రతు స్థంభం.
ఇక్కడ మాత్రం రెండు స్తంభాలు ప్రత్యేకంగా కనిపిస్థాయి. పీఠ భాగంలో మరో రెండు స్థంభాల పైన భిన్న రూపాలలో శ్రీ ఆంజనేయుని మలచారు.దశావతార మరియు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రూపాలు కూడా కనిపించాయి.
ప్రాంగణంలో అనేక కూర్మావతార సజీవ రూపాలు తిరుగాడుతూ కనపడతాయి.
ప్రదక్షిణ పూర్తి చేసుకొని విశాలంగా ఉన్న అర్ధ మండపం దాటితే ఉన్న గర్భాలయంలోనాలుగు అడుగుల గద్దె మీద పుష్ప స్వర్ణా భరణ భూషితులై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామ స్వామి నయన మనోహరంగా దర్శనమిస్తారు.
సహజంగా మూడు విగ్రహాలకు కలిపి ఒకే మకర తోరణం ఉంటుంది అన్ని ఆలయాలలో !
కానీ ఇక్కడ గమనింప దగిన అంశం ఏమిటంటే,మూడు భాగాలుగా విభజింపబడిన పెద్ద మకర తోరణం విగ్రహాల వెనక అమర్చడం !
ఆలయ చరిత్ర లాగే పక్కన ఉన్న మూడు పర్వతాలు కూడా భిన్నమైన చరిత్రను తెలుపుతాయి.
నీలాచలం మీదనే పాండవులు నివాసముండే వారట. దానికి నిదర్శనంగా ఐదు గదులుగా ఉండే కొండ గుహలను "పాండవుల పంచలు " అని, పక్కనే గుహలో ఉన్న గుర్తును " భీముని బుర్ర" అని పిలుస్తారట.
నిరంతరం నీటితో నిండి ఉండే "పాతాల గంగ" , బుద్దుని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయట.
పక్కనే ఉన్న దుర్గ లేదా గురుభక్తుల కొండ క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుండి క్రీస్తు శకం ఆరో శతాబ్దం వరకూ ఇక్కడ నివసించిన జైనుల స్థూపాలు ఇతర నిర్మాణాలు ఉంటాయట. తదనంతర కాలంలో ప్రతిష్టించిన ఆరు అడుగుల ఎత్తు శ్రీ దుర్గా దేవి విగ్రహం అదనపు ఆకర్షణగా పేర్కొన్నారు.
చాళుక్య రాజు విమలాదిత్యుని శాసనం ఈ కొండ మీదే లభించినదట.
మూడోది అయిన ఘని లేదా బౌద్దుల కొండ మీద బుద్దుని విగ్రహాలు, శిధిలావస్థలో ఉన్న ఆరామ విహారాలు, నీటి మడుగు ఉంటాయట.
స్కాంద పురాణం నుండి అనేక గ్రంధాలలో, కీర్తనలలో శ్రీ రామ తీర్థ ప్రాశస్త్యం గురించి పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
అపర ఆదిశేషుని అంశగా పేర్కొనే శ్రీ వైష్ణవ ఆచార్యులు శ్రీ రామానుజులు శ్రీ రామ తీర్థం సందర్శించినట్లుగా ఆయన గురించి రచించిన తమిళ గ్రంధాలలో ప్రస్తావించబడినది.
ఎందరో కవులు శ్రీ రామ తీర్థం విశిష్టతను తమ రచనలలో కొనియాడారని తెలుస్తోంది.
భావకవి ఆంధ్రా షెల్లీ గా ప్రసిద్దులైన శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు తన తోలి కవిత రచించినదిక్కడే !
అభ్యుదయ కవి ఈ యుగం నాదేనని సగర్వంగా ప్రకటించుకొన్న శ్రీ శ్రీ గారి వివాహం జరిగింది కూడా శ్రీ రామ తీర్థం లోనే !!
ప్రతినిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
ధనుర్మాసంలో, పర్వదినాలలో ఈ సంఖ్యా వేల కు పెరుగుతుందని అదే శ్రీ రామనవమి మరియు శివరాత్రి సంబరాలకు లక్షకు పైగా ఉంటుందని తెలిపారు.
శివరాత్రి అత్యంత వైభవంగా జరిపే వైష్ణవ క్షేత్రం శ్రీ రామ తీర్థం.
దీనికి తగినట్లుగా క్షేత్ర పాలకుడు "శ్రీ సదా శివ స్వామి" ఆలయం పక్కనే ఉంది.
చిన్న ఆలయం .
పెద్ద లింగం .
మరోసారి క్షేత్రాన్ని సందర్శించే భాగ్యం కలిగించమని క్షేత్ర పాలకునికి వినమ్రంగా విన్నవించుకొంటే కోరిక నెరవేరుతుందని నమ్మకం.
శ్రీ రామ నవమి, బ్రహ్మోత్సవాలలో లక్షల సంఖ్యలో భక్తులు ఒడిష, ఆంధ్రా ప్రాంతాల నుండి వస్తారు.
విశేష పూజలు, అలంకరణలు, అర్చనలు మరియు ఆరగింపులు ఘనంగా జరుపుతారు.
మూడు మతాలకు కూడలిగా పేర్కొనదగిన శ్రీ రామ తీర్థం విజయ నగరం పట్టణానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
సోర్స్ :- విజయనగరం మిత్రులు రామకృష్ణ మరియు చందు గారి దగ్గర తీసుకున్న సమాచారం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి