21, జనవరి 2021, గురువారం

అన్నమాచార్య చరితము

 🌹 అన్నమాచార్య చరితము 🌹


అన్నమయ్యత్యంత యాత్మ తృప్తిని పొంద 

             సంసార సహచర సతుల తోడ 

శ్రీ యహోబల దివ్య క్షేత్రరాజంబున 

            వాసముండెను కొన్ని వాసరములు 

యనుదినంబున వార లా యహోబలు గాంచి 

            తరియించు చుండిరి తన్మయమున 

నగములందున్నట్టి నవనారసింహుల 

            దర్శించి వారలు ధన్యు లైరి 

భవ్యమగు క్షేత్ర మహిమకు పరవశించి 

నారసింహుని దలచియు నమ్రతగను 

దివ్య హరి కీర్తనంబు లా తీర్థమందు 

యాలాపించియు జెప్పెను యన్నమయ్య 



ధర యహోబల మఠ స్థాపనాచార్యుడౌ 

            ఆదిపణ్ శఠకోపయతుల వద్ద 

వైష్ణవాగమ దివ్య వాజ్ఞ్మయ మంతయు 

            నధ్యయనము జేసె నన్నమయ్య 

యాచార్యు బోధన లవగతం బైనంత 

            పరబ్రహ్మ రూపమున్ ప్రస్తుతించె 

హరి సర్వమయుడను యద్వైత భావంబు 

            యంతరంగమునందు నలము కొనియె 

కుల విచక్షణ గోడలుం గూలదోసి 

సర్వమును విష్ణుమయమని సన్మతొంది 

సర్వ జగతిలొ హరిబోధ స్పల్ప నెంచి

మదిని పరమాత్మ యందున మగ్న పరచె 


అన్నమయ్య పిదప నటనుండి కదలియు 

దక్షిణాది నున్న దైవ గుడుల 

దర్శనంబు పొంది తరుణుల తోడను 

చేరె తాళ్లపాక స్థిమితముగను 


             రాజాశ్రయము 


నర వరుడగు సాళ్వ నరసింహరాయలు 

క్షితిని టంగుటూరు కేంద్రముగను 

దండనాధునిగను ధరపాలనము జేసె 

విజయనగర ప్రభుత యేలుబడిలొ 


దండనాథుని పదవిలో ధరను వెలిగి 

" మూరు రాయర గండ " ను పేరు పొంది 

సాళ్వ నరసింహరాయలు సరస ముగను 

టంగుటూరును పాలించె పొంగ ప్రజలు 


విజయనగర రాజ్య విభవంబు చాటెడి 

దండనాయకునిగ ధరను నేలు 

సరసుడైన సాళ్వ నరసింహరాయలు 

యాంధ్రభోజునకును యగును తాత 


సాళ్వ నరసింహరాయలు సఖుల వలన 

యన్నమాచార్య కీర్తనల్ కొన్ని వినియు 

పాట లందున్న భక్తికి పరవశించి 

తాళ్లపాకకు వెళ్లెను తనను గలువ 


అన్నమాచార్యు దర్శించి సన్నుతించి 

యాతడుడివిన కీర్తన లాలకించి 

భక్తి భావంబు దలచియు పరవశించి 

సాన్నిహిత్యంబు పొందెను సాళ్వ నృపతి 


కాలగర్భంబు నందేండ్లు గడచిపోగ 

దండనాథుని నుండియు తదుప రతడు 

పాలకుండయ్యె పెనుగొండ ప్రాంతమునకు 

దైవ లీలలు శక్యమే తలచ నరుకు !


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

కామెంట్‌లు లేవు: