21, జనవరి 2021, గురువారం

అరుణగిరి ప్రదక్షిణ

 *🙏🌺అరుణగిరి ప్రదక్షిణా మహాత్మ్యం🌺🙏*


    🌺 అరుణాచల ప్రదక్షిణం నిజానికి శివశివానీలకు చేసే సాక్షాత్ ప్రదక్షిణే! 

 ప్ర - అంటే పాపసంహారం . 

 ద - కామ్యసిద్ధి 

 క్షి - జన్మరాహిత్యం 

 ణ - జ్ఞానమార్గంలో ముక్తి 🌺

      🌺పురాణ సంస్కృతి అరుణాచలం ఒక గొప్ప స్మృతి. 

      అరుణాచలం, జీవుడికి దేవుడికి ఉన్న దివ్య ప్రబంధం. కనబడే పూల, కనబడని దారం కలిసి ఉన్నట్లు! శివ కుటుంబమంతా, కొలువుదీరిన కైలాసమే, అరుణాచలం.

         వెన్నెలలో అరుణాచల దర్శనం ఒక అపురూప ఆధ్యాత్మిక అనుభవం. మనసు నిశ్చలం చేసుకొని, నెమ్మదిగా నడుస్తూ, గిరిని చూస్తూ, వెన్నెలలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు పరమశివ భంగిమలు, ఆకృతులు, అవిష్కృతమవుతూ లోచూపును విశాలం చేస్తూ, అంతరంగ స్పర్శను అనుగ్రహిస్తాయి. క్రమ వైరాగ్యాన్ని, క్రమ సన్యాసాన్ని అనుగ్రహించి, మనసును పరమేశ్వరాయత్తం చేయగల శక్తి, గిరి ప్రదక్షిణలలో ఉన్నది. 🌺

     🌺 అయిదు ముఖాలుగా గోచరించే సదాశివ స్వరూపం సాధకుణ్ణి అంతర్ముఖుణ్ణి చేసి, జ్యోతిర్మయమైన లో వెలుగును ఆత్మగా దర్శనీయం జేసి ఆత్మనిష్ఠలో నిలకడ చెందించే పరమాద్భుత సాధన, గిరి ప్రదక్షిణ! గిరి, గురువు, గురి ఏకమై నిలిచిన అరుణాచలదర్శనం ఆత్మదర్శనం కంటే భిన్నం కాదు.

      అరుణాచల స్మరణమే ముక్తి! ప్రదక్షిణ అనుగ్రహించే శాంతి, శక్తి , వైరాగ్యం , జ్ఞానం , పరమానందం అనిర్వచనీయం . అది అనుభవైక వేద్యం . హృదయంగమం. జీవాత్మ, పరమాత్మల నిత్య సంగమం! 

      ప్రయత్నమంతా కనబడుతున్నది. కనుక అది జీవ ప్రజ్ఞ. 

       ప్రేరణ కనబడటం లేదు. కానీ అంతటికీ అదే కారణమౌతున్నది. అది దైవ ప్రజ్ఞ . 

ఈ సన్నివేశంలో ఈషణ త్రయాలు నశించి ఉంటాయి. పిల్లలు, ఇల్లు, ఇల్లాలు మూడు బంధాలుగా ఉన్నా, బంధన స్థానం మాత్రం ప్రాపంచికమే .🌺   


*🌺అరుణాచల శివ! అరుణాచల శివ!🌺*

కామెంట్‌లు లేవు: