🌺సేకరణ🌺
ఇది ఆర్. శేషగిరిరావు గారి సందేశం.
మరణించిన వారి ఆత్మకు శాన్తి చేకూరాలని ఎందుకు అంటారు?
ముందుగా ఆత్మకు శాన్తి చేకూరడం అంటే ఏమిటి?
నిజానికి వాసనా రహితమైన ఆత్మ పరమాత్మతో సమానమైనది. ఈ రెండింటికీ మధ్య భేదం లేదు. అట్టి స్థితిలో ఉన్న ఆత్మ సదా ఆనందమయ స్థితిలో ఉంటుంది. మరి దానికి శాన్తి చేకూరడం ఏమిటి? అనే సందేహం వస్తుంది. ఆత్మ వాసనా రహితమై యున్న నాడు మాత్రమే అది ఆనందమయ స్థితిలో పరమాత్మకు సమానమై ఉంటుంది. అయితే, ఆత్మను పలు విధాలైన వాసనలు, కామ వాంఛలు ఒక పొరవలె కప్పి ఉంచుతాయి.
ధూమేనావ్రియతే వహ్నిర్యథాఽఽదర్శో మలేన చ ।
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ।। భగీ 03-38।।
పొగ చేత అగ్నియు, మురికి చేత అద్దమున్ను, మావిచేత గర్భ మందలి శిశువున్ను ఏవిధంగా కప్పబడి యుండునో, అదే విధంగా కామము చేత ఆత్మజ్ఞానము కూడా కప్పబడి యుండును.
ఈ విధంగా కామము ద్వారా కప్పబడి యున్న ఆత్మ యొక్క సహజమైన ఉనికి ఏనాడు బహిర్గతం కాదు.
ధ్యాయతో విషయాన్ పుంసః సజ్ఞ్గస్తేషూపజాయతే ।
సజ్ఞ్గాత్సంజాయతే కామః కామాత్క్రోధోఽభిజాయతే ।।భగీ 02-62।।
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః ।
స్మృతిభ్రంశా ద్బుద్ధినాశో బుద్ధినాశా త్ప్రణశ్యతి ।।భగీ 02-63।।
శబ్దస్పర్శాది విషయ వాంఛల పట్ల సదా చింతించు మనుజుడు, అట్టి విషయములందు ఆసక్తి కలుగుట అధికమగు చున్నది. ఇట్టి ఆసక్తి వలన కోరిక పుట్టు చున్నది. ఇట్టి కోరిక వలన క్రోధము ఉత్పన్నమగు చున్నది. క్రోధము వలన మనుజుడు తన వివేకమును కోల్పోవు చున్నాడు. ఈ విధముగా వివేకము లేదా జ్ఞాపక శక్తి నశించుట వలన బుద్ధి నాశనము జరుగును. బుద్ధి నాశనము జరిగిన మనుజుడు పూర్తిగా నశించి పోవుట లేదా అధోగతి పాలగు చున్నాడు.
భగవద్గీతలో సూచించిన ఈ తత్త్వమును అనుసరించి, మనిషికి మరణానంతరం కూడా తన పూర్వ జన్మ వాసనలు ఆత్మను కప్పి ఉంచుతాయి. అట్టి వాసనలకు అనుగుణంగా ఉండే విధంగా గల దేహంలో అది ప్రవేశిస్తుంది, తదనుగుణంగా జీవిస్తుంది. ‘ఆత్మకు శాన్తి చేకూరాలి’ అనగా ఆత్మను కప్పిపెట్టి ఉంచిన ఈ పొరలు తొలగిపోవాలి. అప్పుడే అది శుద్ధ తత్త్వము గా మారుతుంది. అట్టి ఆత్మకు మరియు పరమాత్మకు భేదం ఉండదు. ఈ పొరలు తొలగిపోయిన నాడు దానికి సద్గతి లభిస్తుంది. ఉత్తమ లోకాలు లభిస్తాయి. ఇంకా జ్ఞాన సాధన చేసిన ఆత్మకు పరమపద సోపానము కూడా లభిస్తుంది. అట్టి ఆత్మ సంపూర్ణ ఆనందమయ స్థితిలో ఉంటుంది. ఈ స్థితి ఆ ఆత్మకు లభించాలని ప్రతి ఒక్కరూ భగవంతుడిని ప్రార్థిస్తూ శ్రద్ధాంజలి ఘటించుట.
మన హిందూ సంస్కృతిని అనుసరించి దాదాపుగా 90% మరణించిన పిమ్మట శవానికి అగ్ని సంస్కారం చేస్తారు, అనగా మంత్రాగ్నితో ఆ శవాన్ని దహనం చేస్తారు. దహనం చేసిన పిమ్మట 2వ రోజు ఆస్తిక సంచయనం చేసి అట్టి అస్తికలతో అపర కర్మకాండ జరిపిస్తారు. ఇట్టి కర్మ కాండ ఎందుకు చేస్తారంటే, మరణించిన పిమ్మట కర్మకాండ సంపూర్ణంగా జరిపే వరకు ఆ జీవుడు ప్రేత రూపంలో ఉంటాడు. అట్టి ప్రేతకు విముక్తి కలిగి అది మరొక శరీరంలోకి ప్రవేశించాలి. అందుకే అపర కర్మకాండ విధిగా జరపాలి. మన శాస్త్రాలను అనుసరించి సరియైన విధంగా కర్మకాండ జరపని ఎడల అట్టి జీవుడు ప్రేత రూపంలోనే ఉండిపోతాడు. కాని ఖననం చేసిన వారికి ఈ విధమైన కర్మకాండ ఉండదు.
స్వస్తి
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం –
న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం –
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి