15, ఫిబ్రవరి 2021, సోమవారం

మొగలిచెర్ల

 *మాటలకందని అనుభూతి..*


"మాలకొండ కు వచ్చేదాకా..ఇక్కడొక అవధూత మందిరం ఉన్న సంగతే మాకు తెలీదండీ..కొండ దిగి వచ్చేటప్పుడు అక్కడున్న బోర్డ్ చూసి..దగ్గరేకదా..ఒకసారి చూసి వెళదామని వచ్చాము..మాకు ఈ స్వామివారి గురించి కానీ..ఈ క్షేత్రం గురించి కానీ..ఏమీ అవగాహన లేదు..మీరు తెలియచేస్తారా..?" అని ఆ దంపతులు నన్ను అడిగారు..ఇద్దరూ వయసులో పెద్దవారు..ఇద్దరినీ కూర్చోమని చెప్పాను.. మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను క్లుప్తంగా చెప్పి..నమ్మి కొలిచిన వారి కోరికలు తీరుతాయని ఒక విశ్వాసం ఇక్కడి ప్రజలలో పాతుకుపోయి వున్నదని చెప్పాను..ఎలాగూ శనివారం నాడే వచ్చారు కనుక సాయంత్రం జరిగే పల్లకీసేవ లో పాల్గొని..ప్రక్కరోజు ఉదయాన్నే స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్ళండి అనికూడా చెప్పాను..ఒక్కక్షణం ఆలోచించారు..ఆయన తన భార్య వైపు చూసాడు..ఆవిడ.."మరి కారు డ్రైవర్ ఏమంటాడో..రాత్రికి మనల్ని నెల్లూరులో వదలి పెట్టమని కదా మనం మాట్లాడుకున్నది..తీరా ఇప్పుడు ఇలా మారిస్తే..ఒప్పుకుంటాడో..ఒప్పుకోడో..?" అన్నది ఆవిడ.."మీ వాళ్ళ ద్వారా మా డ్రైవర్ని కొద్దిగా పిలిపిస్తారా?.." అని ఆయన నన్ను అడిగాడు..అతన్ని పిలిపించాను..ఈ దంపతులు తాము రాత్రికి మొగిలిచెర్ల లో వుండదల్చుకున్నామనీ..ఉదయాన్నే స్వామివారి సమాధి దర్శించుకొని వెళతామని చెప్పారు..ఆ డ్రైవరు కూడా ఒప్పుకున్నాడు..కాకుంటే తనకు కొద్దిగా ఎక్కువ డబ్బు ఇవ్వమని అడిగాడు..సరే అన్నారా దంపతులు..వాళ్ళిద్దరికీ ఒక రూమ్ కేటాయించి..స్నానం చేసి..సాయంత్రం ఏడు గంటల కల్లా మందిరం లోకి వచ్చేయమని చెప్పాను..


ఆరోజు పల్లకీసేవ లో ఆ దంపతులు కూడా పాల్గొన్నారు..వయసులో పెద్దవారు కనుక..పల్లకీ మోయలేదు కానీ..ఇద్దరూ పల్లకీ తో సహా మందిరం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేశారు..పల్లకీసేవ అంతా అయిపోయిన తరువాత..నా దగ్గరకు వచ్చి.."చాలా బాగా జరిగింది ప్రసాద్ గారూ..అర్చక స్వాములందరూ చక్కటి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు..ఈ మారుమూల పల్లెటూరులో ఈ మాత్రం వేడుక జరుగుతుందని ఊహించలేదు..ఇంతమంది జనం వస్తారని కూడా అనుకోలేదు..ఈ కార్యక్రమం చూసిన తరువాత మనసుకు ఎంతో తృప్తిగా ఉన్నది.." అన్నారు.."ఇప్పటికే ఆలస్యం అయింది..ముందు మీరిద్దరూ అన్నదాన సత్రానికి వెళ్లి భోజనం చేసి రండి..ఉదయాన్నే ఐదున్నర గంటల కల్లా మందిరం లోకి వచ్చేయండి..స్వామివారి సమాధికి అభిషేకము, ఆపై హారతులూ ఉంటాయి..అవి కూడా కళ్లారా చూద్దురు.." అని చెప్పాను..


ఆ ప్రక్కరోజు ఉదయాన్నే..ఐదు గంటలకే ఆ దంపతులు స్వామివారి మందిరం లోకి వచ్చి, మంటపం లో కూర్చున్నారు..అత్యంత శ్రద్ధగా స్వామివారి సమాధి కి అర్చకస్వాములు చేసిన అభిషేకాన్ని..ఆపై హారతులని చూసారు..స్వామివారి సమాధి దర్శనానికి వెళ్లారు..స్వామివారి ఉత్సవ మూర్తి వద్ద నిలబడి తమ గోత్రనామాలతో అర్చన చేయించుకొని..తిరిగి ఇవతలికి వస్తూ..గర్భాలయపు మంటపం లో ఒక ప్రక్కగా కూర్చున్నారు..సుమారు అరగంట సేపు అక్కడే కూర్చుని ధ్యానం చేసుకున్నారు..స్వామివారు తపస్సు కొఱకు వాడిన పులి చర్మాన్ని తమ చేతులతో ముట్టుకొని నమస్కారం చేసుకున్నారు..ఆ తరువాత నా దగ్గరకు వచ్చి.."బాబూ..జీవితం లో ఒక గొప్ప అనుభూతిని ఇక్కడ పొందాము..ఈ క్షేత్రం ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉన్నది..మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు..మేమిద్దరమూ ఎంతో ఆనందపడుతున్నాము..ఇక్కడ ఏదైనా. కార్యక్రమాలు జరిపితే మాకు తప్పక తెలియజేయండి..మేమిద్దరమూ వచ్చి..మాకు చేతనైన సేవ చేసి వెళతాము..ముందుగా మా వంతుగా ఒక శని ఆదివారాల లో అన్నదానానికి మీరు పెట్టె ఖర్చును భరించే అవకాశం ఇవ్వండి.." అన్నారు..అలాగే అన్నాను..


ఈ సంఘటన జరిగి ఐదేళ్లు అయింది..ఈరోజుకూ ఆ దంపతులు తమకు వీలున్నప్పుడు మొగలిచెర్ల కు వచ్చి స్వామివారి పల్లకీసేవ లో పాల్గొని..ప్రక్కరోజు స్వామివారి సమాధి దర్శించుకొని వెళుతుంటారు..అంత వయసులోనూ..ఆ దంపతులు అన్నదాన సత్రం వద్ద వడ్డన లో పాల్గొంటారు..ఆ సేవ తమకు అత్యంత ఇష్టం అని చెప్పుకుంటారు..అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా కృతజ్ఞతలు చెపుతారు...రాబోయే కార్తీక మాసం లో వచ్చే కోటి సోమవారం నాడు మేము జరుపబోయే రుద్రహోమానికి అయ్యే అన్నదాన వ్యయం లో కొంత భరిస్తామని తెలియచేశారు..


మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందడానికి స్వామివారు ఆ దంపతులకు చక్కటి అవకాశాన్ని మాత్రం కల్పించారని మేము గట్టిగా విశ్వసిస్తాము..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: