*దసరా ఉత్సవం..*
కొన్ని సంవత్సరాల క్రితం దసరా రోజుల్లో జరిగిన సంఘటన ఇది..ప్రతి సంవత్సరము ఆశ్వీయుజ పాడ్యమి నాడు మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం లో భవానీ అమ్మవారి విగ్రహాన్నీ ప్రతిష్టించి..పది రోజులపాటు నిత్య నైవేద్యాలు సమర్పించి..పదకొండవరోజు అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేయడం ఒక ఆనవాయితీగా జరుగుతున్నది..ఈ పదకొండురోజుల్లో సుమారు నూరు మంది భక్తులు మందిరం వద్ద భవానీ కంకణ దీక్ష స్వీకరించి నియమ నిష్ఠలతో వుంటారు..విజయదశమి రోజున పెద్దఎత్తున ఉత్సవం జరుగుతుంది..ఆరోజు రాత్రి దీక్షాధారులందరూ పండరిభజన చేసి, ఆపై అగ్నిగుండం త్రొక్కడం కూడా ఆచారంగా పాటిస్తున్నాము..ఈ కార్యక్రమం చూడటానికి సుమారు రెండు మూడు వేలమంది శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు వస్తారు.
ఆ సంవత్సరం కూడా భవానీ కంకణ దీక్ష స్వీకరించిన భక్తులకు..ఆ దసరా రోజుల్లో శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శించే ఇతర భక్తులకూ..మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం అందివ్వాలనే సంకల్పం కలిగింది..అలాగే విజయదశమి రోజు కూడా జరిగే ఉత్సవం చూడటానికి వచ్చే భక్తులందరికీ (దాదాపుగా రెండువేలమంది పై మాటే..) ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని అనుకున్నాము.. ముందుగా మా దంపతులము ఈ విషయమై చర్చించుకున్నాము..ఆ తరువాత మా సిబ్బందితో చర్చించాము..ఒక రోజుకు ఎంత వ్యయం అవుతుందో అంచనాకు వచ్చాము..దాతల సహకారం తీసుకోవాలని అందరమూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చేసాము..అప్పటికి దసరా పండుగ ప్రారంభం కావడానికి మరో వారం రోజుల గడువు ఉన్నది..ఏదైనా ఒక కార్యక్రమం అనుకొని..దానిని ఆచరణ లో పెట్టే ముందు..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, మా కోరిక అక్కడ విన్నవించుకొని..స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని రావడం మా దంపతులకు ఒక అలవాటు..ఈసారి కూడా ఇద్దరమూ శ్రీ స్వామివారి సమాధి వద్ద స్వామివారి పాదుకులకు తల ఆనించి..ఇలా "ఒక కార్యక్రమం అనుకున్నాము..నిర్విఘ్నంగా జరిగేటట్లు చూడు స్వామీ.." అని మనస్ఫూర్తిగా మొక్కుకొని వచ్చాము..
రెండురోజులు గడిచిపోయాయి..ఆరోజు శనివారం..సింగరాయకొండ లోని మా స్వగృహంలో పని ఉండటం చేత..నేను మధ్యాహ్నం కానీ మొగలిచెర్ల స్వామివారి మందిరానికి పోలేని పరిస్థితి వచ్చింది..సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ.."ప్రసాద్ గారూ..నేను..హైదరాబాద్ లో అడ్వొకేట్ గా పని చేస్తున్నాను..స్వామివారి మందిరానికి దర్శనానికి వచ్చాను..స్వామివారి సమాధిని దర్శించుకున్నాను..ఈరోజు శనివారం కాబట్టి స్వామివారి సమాధి దగ్గరకు వెళ్లే అవకాశం లేదని పూజారి గారు చెప్పారు.ఈరోజు రాత్రికి ఇక్కడ నిద్ర చేద్దామని అనుకున్నాను..కానీ హైదరాబాద్ కు వెంటనే రమ్మనమని మా వాళ్ళు ఫోన్ చేశారు..తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి వెళుతున్నాను..నేను వెళ్ళేది సింగరాయకొండ మీదుగానే కనుక..అక్కడ మిమ్మల్ని ఒక్కసారి కలిసి వెళుతాను..మీకేమీ ఇబ్బంది లేదు కదా..?" అని ఫోన్ చేశారు.."ఏ ఇబ్బందీ లేదు..రండి.." అని చెప్పాను..మరో రెండుగంటల్లో వారు మా యింటికి వచ్చారు.."ప్రసాద్ గారూ ఏమీ అనుకోవద్దు..నాకు సమయం లేదు..స్వామివారికి ఏదైనా సేవ ఉంటే చెప్పండి..నా శక్తి మేరకు నేను చేస్తాను.." అన్నారు..భవానీ దీక్షాధారులకు ఉచిత ఆహారం గురించీ..విజయదశమి నాటి భోజన ఏర్పాట్ల గురించీ క్లుప్తంగా చెప్పి..మీ వీలును బట్టి చూడండి అన్నాను..సరే అని వెళ్లిపోయారు..ఆరోజు రాత్రికి వారు నాకు ఫోన్ చేసి.."ప్రసాద్ గారూ వస్తురూపం లో కొంత ఇస్తాను..అన్నదానానికి ఏయే సరుకులు కావాలో ఒక లిస్ట్ పంపండి.." అన్నారు..భవానీ దీక్షాధారులకు పదకొండురోజులకు..అలాగే విజయదశమి నాటి అన్నదానానికి సంబంధించి ఎంత పరిమాణం లో సరుకులు కావాలో అన్నీ ఒక లిస్ట్ వ్రాసి..వాట్సాప్ లో పంపించాను..మరో గంటకు మళ్లీ ఫోన్ చేసి.."ప్రసాద్ గారూ ఈ మొత్తం సరుకులు మరో రెండురోజుల్లో..స్వామివారి మందిరం వద్దకు చేరేవిధంగా మా వాళ్లతో మాట్లాడి ఏర్పాటు చేసాను.." అన్నారు..నాకు ఒక నిమిషం ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి..ధన్యవాదాలండీ అని మాత్రం చెప్పాను..అన్నదానానికి అన్ని ఏర్పాట్లూ స్వామివారే చూసుకుంటున్నారని అర్థమైపోయింది..ఇక మాట్లాడేముంది..మా దంపతులము మనస్సులోనే స్వామివారికి నమస్కారం చేసుకున్నాము..
దసరా ఉత్సవాలు మొదలుపెట్టే నాటికి..ఇతర ఖర్చులు భరించడానికి దాతలు సమకూరారు..మాకు ఏ విధమైన ఇబ్బందీ కలుగలేదు సరికదా..భక్తులందరూ సంతోషించారు..ఆనాటి నుంచి ఈ నాటి వరకూ ఆ అడ్వొకేట్ గారు స్వామివారి మందిరం వద్ద ఒక్క భవానీదీక్ష సమయం లోనే కాకుండా దత్తదీక్ష సందర్భం లోనూ..తన శక్తిమేరకు అన్నదానానికి సహకారం అందిస్తున్నారు..ఈ సంవత్సరం కూడా.. దసరా సందర్భంగా దీక్ష స్వీకరించే భక్తుల అన్నదానానికి తన వంతు సహకారం ఇచ్చారు..
ఈ సంవత్సరం విజయదశమి నాటి అన్నదానానికి మాత్రం దాతలను సమకూర్చుకోవాలి..ఒక లక్ష రూపాయల వ్యయం అవుతుందని ఒక అంచనా..మా వంతు ప్రయత్నాలు మేము చేయాలి..మా ప్రయత్నలోపం లేకుండా..చేసే ప్రతిపనీ అందరికీ ఉపయోగపడేలా ఉంటేనే..స్వామివారి సహకారం మాకు వుంటుంది..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి