13, మార్చి 2021, శనివారం

మన మహర్షులు- 47

 మన మహర్షులు- 47


 వ్యాఘ్రపాదుడు


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


 మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు. మన నైతికతకు, మనం నడిచే దారి చూసే మార్గదర్శకత్వానికి వారే దిక్సూచులు. 


అటువంటి మహర్షుల చరిత్ర పారాయణం, తెలుసుకోవడం పుణ్యప్రదం. 


వ్యాఘ్రపాదుడు మన మహర్షులలో ఒకరు.


 ఈయనది విచిత్రమైన రూపం. ఈయనను వ్యాఘ్రపాద లేదా వ్యాఘ్రపాదుడు అనే పేర్లతోనూ పిలుస్తారు. వ్యాఘ్రము అనగా పులి. లేదా మృగము. మృగాలు నిత్యం సంచరిస్తూనే ఉంటాయి. అందుకు తగినట్టుగా ఆయన పాదాలు పులి పాదాల వలే ఉంటాయి.


 పరమశివుడే ఒక సందర్భంలో ఈయనకు ఈ విధంగా పులి పాదాలను ప్రదానం చేశాడని అంటారు. 


వ్యాఘ్రపాదుడు కృత యుగానికి చెందిన మహర్షి.


ఈయన ధర్మ ప్రవచన దక్షుడు. వేద వేదాంగ విదుడు. పురాణాలలోనూ ఈ మహర్షి గురించి ఘనమైన ప్రస్తావనలే ఉన్నాయి.


 లభిస్తున్న ఆధా రాలను బట్టి ఈయన భారతదేశంలోని తమిళనాడుకు చెందిన వారు. అక్కడి చిదంబరం ఆలయ ప్రాంగణంలో గల నటరాజ స్వామి (శివుడు)కి వ్యాఘ్రపాదుడు పరమ భక్తుడు. 


ఆయనకు నిత్యం భక్తిశ్రద్ధలతో పూజలు ఆచరించేవాడు. ఈ క్రమంలో నటరాజును అర్చించేందుకు.. తేనె టీగలు తాకని పూలను సేకరిస్తుండే వాడు ఈ మహర్షి.


అయితే, పుష్పాలు కోసి, సేకరించే సమ యంలో వ్యాఘ్రపాదుడు ముళ్లు మరియు కఠినమైన బండరాళ్ల కారణంగా గాయాలకు గురయ్యే వాడు. 


ఈ మహర్షి తన పట్ల చూపిస్తున్న భక్తి శ్రద్ధలకు, తనను పూజించడం కోసం సేకరిస్తున్న పూల కోసం పడుతున్న కష్టాలకు చలించిన శివుడు.. ఈ మహర్షికి పులి పాదాలను ప్రదానం చేశాడు. 


దీంతో పువ్వులు కోసేటప్పుడు పాదాలు కఠినమైన పరిస్థితులకు గురయ్యే బాధ తప్పింది. శివుని వర ప్రభావంతో పులి పాదాలను పొందిన కారణంగా అప్పటి నుంచి వ్యాఘ్రపాదుడు అనే పేరు స్థిరపడింది.


తమిళనాడులోని చిదంబరం వెళ్లినపుడు, అక్కడి నటరాజ స్వామి పక్కన సర్ప పాదాలతో, పులిపాదాలతో నిల్చుని ఉన్న ఇద్దరు మహర్షులు నటరాజ స్వామిని ప్రార్థిస్తున్న చిత్రాలను చూడ వచ్చు. 


అందులో పాము పాదాలతో ఉన్న మహర్షిని పతంజలి మహర్షి అనీ, పులి పాదాలతో ఉన్న మహర్షిని వ్యాఘ్రపాదుడని అంటారు.


 వ్యాఘ్రపాదుడు సగం పులి శరీరం, మిగతా సగం మానవ శరీరం కలిగి ఉంటాడు.


వ్యాఘ్రపాదుడు ఒక ముని కన్యను వివాహం చేసికొని  ఉపమన్యుడు మరియు  ధౌమ్యుడు అనే కుమారులని పొందాడు.


 ఉపమన్యుడు శివుని యొక్క కటాక్షం పొంది మహా జ్ఞాని, మహా యోగి అయ్యాడు.. అలాగే, రెండవ కుమారుడు ధౌమ్యుడు మహర్షి అయ్యాడు. అనంతర కాలంలో పాండవు లకు పురోహితుడిగానూ వ్యవహరించాడు.


ఒకనాడు ఈయన కాశీ విశ్వేశ్వరుడిని దర్శించి, అనన్య నిరుపమానమైన భక్తితో ఈ విశ్వనాథాష్టకాన్ని స్తుతించాడని అంటారు. ‘‘గంగా తరంగ కమనీయ జటా కలాపం..’’ అంటూఎనిమిది పాదాలతో సాగే అష్టకం చివరిలో ‘‘వ్యాఘ్రోక్త మష్టక మిదం పఠతే మనుష్య:..’ అని ముగుస్తుంది


. కాశీ విశ్వేశ్వరుడు వ్యాఘ్రపాదుని భక్తిప్రపత్తులతకు సంతోషించి, అతనికి సాక్ష్యాత్కరించి కోరిన వరాలను ఇచ్చాడు.


 వ్యాఘ్రపాదుడు మహర్షులకి బోధించిన దాన్ని 'వ్యాఘ్రపాద స్మృతి', అంటారు.


వ్యాఘ్రపాద స్మృతిలో బ్రహ్మచారి, గృహస్థు, యతి, వానప్రస్థుడు మొదలైన వాళ్ళకి సంబంధించిన విషయాలు వాళ్ళు ఆచరించాల్సిన విషయాలు ఉన్నాయి..


ఇదీ వ్యాఘ్రపాద మహర్షి కథ🙏


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷

కామెంట్‌లు లేవు: