13, మార్చి 2021, శనివారం

మొగిలిచెర్ల అవధూత

 *వ్యాధి..నివారణ..*


"నేను కృష్ణమూర్తిని మాట్లాడుతున్నానండీ..మేము మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధిని దర్శించుకోవాలని అనుకుంటున్నాము..ఎలా రావాలో తెలుపుతారా..?" అని నన్ను ఫోన్ లో అడిగారు..కృష్ణమూర్తి గారు వుండే ప్రదేశం నుంచి శ్రీ స్వామివారి మందిరానికి రావడానికి ఉన్న అన్ని మార్గాలూ వివరంగా తెలిపాను.."మేము మొత్తం నలుగురం వస్తామండీ..మా తల్లిదండ్రులు..నేనూ, నా భార్యా..మా అమ్మా నాన్న గార్లు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్లకొఱకు ఒక రూమ్ ఏదైనా చూడగలరా?..మేమిద్దరం స్వామివారి సన్నిధిలో ఉంటాము.." అన్నారు..వాళ్ళు ఎప్పుడు రాదల్చుకున్నదీ చెప్పారు కనుక..వాళ్ళకొఱకు ఒక గది కేటాయించి పెట్టాను..మరో రెండువారాల తరువాత ఒక శనివారం ఉదయం కృష్ణమూర్తి గారు తన భార్యా..తల్లిదండ్రుల తో కలిసి స్వామివారి మందిరానికి వచ్చారు..


"వీరు మా నాన్నగారు సత్యనారాయణరావు గారు, మా అమ్మగారు వెంకటలక్ష్మి..మా ఆవిడ సుమిత్ర " అంటూ..పేరు పేరునా పరిచయం చేశారు..వాళ్లకు కేటాయించిన గది కి వెళ్లి స్నానాదికాలు ముగించుకొని మళ్లీ మందిరం లోకి వచ్చి నా వద్ద కూర్చున్నారు..కృష్ణమూర్తి గారు నాతో ఏదో చెప్పుకోవాలని వున్నారు అని అనిపించింది...."ఏదైనా సమస్యతో వచ్చారా..? లేక..కేవలం స్వామివారి సమాధి దర్శనానికి వచ్చారా?.." అని అడిగాను..కొద్దిగా సందేహంగా నా వైపు చూసి.."ప్రసాద్ గారూ..చిన్న సమస్య కాదండీ..పెద్ద సమస్య తోనే వచ్చాము..మా ఇద్దరికీ వివాహం జరిగి పదిహేను సంవత్సరాలు అవుతోంది..మాకు ఇద్దరు సంతానం..ఇద్దరూ మొగపిల్లలే..పెద్దవాడికి పన్నెండేళ్ళు..రెండోవాడికి పదేళ్లు..రెండోవాడు పుట్టినప్పుడు..కాన్పు తరువాత ఆరు నెలలకు నా భార్యకు చర్మ సంబంధ వ్యాధి వచ్చింది..ఎన్నో రకాల మందులు వాడాము..ఎందరో డాక్టర్లకు చూపించుకున్నాము..నయం కాలేదండీ..అలానే రోజులు గడచిపోతున్నాయి..అల్లోపతి, హోమియో..ఆయుర్వేదం..ఇలా అన్నిరకాల వైద్యాలూ అయ్యాయి..మా నాన్నగారు సలహా ఇచ్చారండీ.."ఒక్కసారి మొగిలిచెర్ల వెళ్లి, ఆ దత్తాత్రేయ స్వామివారి సమాధి వద్ద మొక్కుకొని రండి..ఫలితం వుంటుంది.." అన్నారండీ..పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా..ఈమె సోదరి వద్ద వదిలిపెట్టి..మేము నలుగురమూ ఇలా వచ్చాము.." అన్నారు..


"ఈరోజు శనివారం కనుక..స్వామివారి సమాధి ని ముట్టుకొని మొక్కుకోలేరు..కేవలం ఆ గడప ఇవతలి నుంచి చూసి..నమస్కారం చేసుకోవచ్చు..మీకు వీలుంటే..ఈరోజు ఇక్కడకు దగ్గరలోనే మాలకొండ అని లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఉన్నది..వెళ్లి దర్శించుకొని రండి..రాత్రికి ఇక్కడ పల్లకీసేవ వుంటుంది..అందులో పాల్గొనండి..రేపుదయం స్వామివారి సమాధిని దర్శించుకొనవచ్చు.." అని చెప్పాను..అలాగే అన్నారు..మాలకొండ కు వెళ్ళొచ్చారు..సాయంత్రం పల్లకీసేవలో పాల్గొన్నారు..ఆ ప్రక్కరోజు ఉదయం స్వామివారి సమాధిని దర్శించుకొని..ఇవతలికి వచ్చారు..ఆరోజు మధ్యాహ్నం మూడు గంటల వేళ..కృష్ణమూర్తి గారు ఆయన భార్యా వచ్చారు.."ప్రసాద్ గారూ..ఈవిడ మరో పదకొండురోజులపాటు ఇక్కడే ఉంటుందట..మా అమ్మగారిని సహాయంగా ఉండమని అడిగింది..ఆవిడా ఒప్పుకున్నది..నాకు ఆఫీస్ పని ఉంది కాబట్టి నేను వెళతాను..వచ్చే వారం వస్తాను..వీళ్ల కొఱకు ఆ రూమ్ అట్టే పెట్టండి..ఆ ఒక్క సహాయం చేయండి.." అని అభ్యర్ధించారు..సరే అన్నాను..


ఆ ప్రక్కరోజు నుంచీ ఆవిడ రెండు పూటలా స్వామివారి మందిరం లో ప్రతి సేవలోనూ పాల్గొనేది..రోజుకు మూడు సార్లు స్వామివారి విభూతి ని తన శరీరం పై వ్యాధి ఉన్న చోట శ్రద్ధగా రాసుకునేది..ఆవిడ ను చూస్తే ఏదో దీక్ష తీసుకున్న దానిలాగా..నిరంతరం స్వామివారి ధ్యాస లోనే ఉండేది..పదకొండు రోజులు ఉంటానని చెప్పిన ఆ సుమిత్ర గారు నలభై రోజులు తన అత్తగారు మామగార్లతో కలిసి స్వామివారి మందిరం వద్దే ఉండిపోయింది..మధ్యలో కృష్ణమూర్తి గారు రెండు మూడు సార్లు వచ్చి వెళ్లారు..నలభై ఒక్క రోజు పూర్తి అయిన తరువాత..సుమిత్ర గారు నా వద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ..రేపు సాయంత్రం మేము మా ఊరెళ్లి పోతున్నాము..మా వారు రేపుదయం వస్తున్నారు..స్వామివారి దయవల్ల నా చర్మవ్యాధి పూర్తిగా తగ్గిపోయింది..ఈ నలభైరోజులు నన్ను స్వామివారే పట్టుబట్టి ఇక్కడ ఉంచారు.." అన్నారు..ఆ ప్రక్కరోజు కృష్ణమూర్తి తన పిల్లలను కూడా తీసుకొని వచ్చారు..అందరూ కలిసి స్వామివారి సమాధి ని దర్శించుకొన్నారు..


"ప్రసాద్ గారూ..మా మామగారు ఇచ్చిన సలహామేరకు ఇక్కడకు వచ్చాము..మొదటిరోజు కొద్దిగా సందేహం తోనే ఉన్నాము..ఆరోజు రాత్రి ఇక్కడ నిద్రచేసిన తరువాత..నాలో ఏదో మార్పు వచ్చింది..ఇక్కడే వుండి..ఈ వ్యాధి నయం చేసుకోవాలి అనే మొండితనం వచ్చింది..స్వామివారి విభూతి తప్ప మరేదీ వాడలేదు..స్వామివారి నామం..ఆ విభూతి..ఈ రెండే నా జబ్బును తగ్గించాయి..ఇన్నాళ్లూ..ఈ వ్యాధి మూలంగా నా బిడ్డలను కూడా దూరంగా పెట్టాను..వాళ్లకు అంటుకుంది అనే భయం ఉండేది..ఇప్పుడు ఆ బాధలేదు.." అంటూ కన్నీళ్ల తో చెప్పింది..


కృష్ణమూర్తి గారు తమ సమస్య తీరిపోయినందుకు స్వామివారికి నమస్కారం చేసుకొని..ప్రతి మూడునెలలకు ఒకసారి స్వామివారి దర్శనానికి రావడం ఒక నియమంగా పెట్టుకున్నారు..ఆ దంపతులు అదే పాటిస్తున్నారు కూడా..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: