9, జూన్ 2021, బుధవారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*జీవ సమాధి..ఒక వివరణ.*


*(యాభై మూడవ రోజు)*


శ్రీ స్వామివారి నిర్ణయంలో ఎటువంటి మార్పూ రాలేదు..ప్రాణత్యాగం చేయాల్సిందేనని నిశ్చయించుకున్నారు..ఎప్పుడు?..ఎలా?..అన్నది కాలమే నిర్ణయిస్తుందన్నట్లుగా నిశ్చింతగా వున్నారు..


శ్రీధరరావు దంపతులకు ఈలోపల మరో సమస్య వచ్చిపడింది..శ్రీధరరావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారి ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది..ఆవిడ మునుపటి లాగా తిరుగలేకపోతున్నారు..తన పనులు కూడా మెల్లిగా చేసుకుంటున్నారు..దంపతులిద్దరూ ఆవిడను జాగ్రత్తగానే చూసుకుంటున్నారు..ఆ సమయంలోనే వీలు చూసుకొని శ్రీ స్వామివారి వద్దకు వెళ్లి వస్తున్నారు..తాము శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళే సమయంలో సత్యనారాయణమ్మ గారి వద్ద ఒక మనిషిని ఏర్పాటు చేసి వెళ్లేవారు..ఓ వారం గడిచిపోయింది..దూరపు బంధువు ఒకావిడ సత్యనారాయణమ్మ గారిని చూడాలని మొగలిచెర్ల కు వచ్చింది..ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటూ వున్నారు..ఈలోపల శ్రీ స్వామివారి నుంచి శ్రీధరరావు దంపతులను ఒకసారి ఆశ్రమానికి వచ్చి పొమ్మని కబురు వచ్చింది..ఎలాగూ ఈవిడగారు వున్నారు కదా..అనుకొని..


"పిన్ని గారూ..మీరు అత్తయ్య గారివద్ద వుండి చూసుకుంటారా?..మేమిద్దరం శ్రీ స్వామివారి వద్దకు వెళ్లి ఓ మూడు గంటల లోపు వచేస్తాము.." అన్నారు ప్రభావతి గారు..


"అదేం మాటమ్మా..లక్షణంగా చూసుకోనూ..మీరిద్దరూ వెళ్ళిరండి..మేము మాట్లాడుకుంటూ ఉంటాము.." అని భరోసా ఇచ్చారావిడ..శ్రీధరరావు ప్రభావతి గార్లు సరే అని చెప్పి..గూడు బండి సిద్ధం చేయించుకొని శ్రీ స్వామివారిని కలవడానికి ఫకీరు మాన్యం లోని ఆశ్రమానికి వెళ్లారు..


శ్రీ స్వామివారు వీరికోసమే ఎదురుచూస్తున్నట్లు గా వున్నారు..వీళ్ళను చూడగానే ..నవ్వుతూ.."నా సజీవ సమాధి విషయం ఆలోచించారా?..ఏమనుకుంటున్నారు?.." అన్నారు..


"నాయనా..మిమ్మల్ని మా చేతులతో సమాధి లో పెట్టి పైన మూత వేయడం మా వల్ల కానీ పని..అది హత్య అవుతుంది..మిమ్మల్ని మా బిడ్డగా చూసుకున్నాము..బ్రతికిఉన్న బిడ్డని సమాధి చేయడం ఏ తల్లిదండ్రులూ చేయరు..చేయలేరు..మీరు పదే పదే ఆ  విషయం మా వద్ద ప్రస్తావన చేయొద్దు..ఇది చాలా మనస్తాపం కలిగిస్తోంది మా ఇద్దరికీ.." అన్నారు ప్రభావతి గారు కటువుగా..


శ్రీధరరావు గారైతే వాదనకే దిగారు.." ఇంత తపస్సు చేసి..ఇంత పాండిత్యమూ..వేదాంతమూ బాగా తెలుసుకొని..లోకానికి ఎటువంటి సందేశమూ ఇవ్వకుండా..మీరిలా అర్ధాంతరంగా శరీరం విడిచి వెళ్ళిపోతే..అది మీకు మోక్షాన్ని ఇస్తుందేమో గానీ..ప్రపంచానికి ఎటువంటి ఉపయోగమూ ఉండదు..కొంతకాలం బోధ చేయండి.." అంటూ ఇంకా చెప్పబోతున్న శ్రీధరరావు గారిని చేయెత్తి వారించారు శ్రీ స్వామివారు..


ఆయన ముఖంలో ఎక్కడా అసహనం లేదు..ప్రశాంతంగా వున్నారు..పైపెచ్చు నవ్వుతూ..

"శరీరం తోనే సందేశాలు ఇవ్వాలని నియమమేమీ లేదు..అలా అనుకొని వుంటే..వ్యాసాశ్రమం లోనే పీఠాధిపత్యం తీసుకొని..ముందుగా ఆశ్రమ వాసులకు..ఆపై ప్రజలకు బోధ చేసేవాడిని..నా పంథా వేరు..అది మీకు ఇప్పుడు అర్ధం కాదు..ఒక్క విషయం చెప్పండి.. శిరిడీ సాయిబాబా ఇప్పుడున్నాడా?..ఆయన శరీరం విడిచిపెట్టి దాదాపు అరవై సంవత్సరాలు కావొస్తోంది..ఆయన ఆత్మ ఎంతమందికో మార్గదర్శనం చేయటం లేదా?..(శ్రీ శిరిడీ సాయినాథుడు అవధూత అని శ్రీ స్వామివారు గట్టిగా చెప్పేవారు..) సందేశం ఇవ్వడానికి శరీరమే అక్కరలేదు..నా సమాధి కూడా అనేక సందేహాలను నివృత్తి చేస్తుంది..మీరు ముందుగా ఒక నిశ్చయానికి రావాలి..అందుకు సమయం పడుతుంది..నాకూ కొద్దినెలల ఆయుష్షు ఉంది..ఈలోపల మీరు సిద్ధపడితే సరే..లేదా నా మార్గం లో నేను ప్రాణత్యాగం చేస్తాను..ఎంత తపస్సు చేసినా..శరీరాన్ని విడిచి వెళ్లే సమయాన్ని పొడిగించలేము..అది భగవత్ నిర్ణయం..జీవ సమాధి చెందడమనేది సాధకుల మోక్ష పధానికి ఒక ఆలంబన వంటిది..ఎలా జరగాలని వ్రాసి వుంటే అలా జరుగుతుంది.." అంటూ ఒక్కనిముషం ఆగి.." మీరిద్దరూ చప్పున బైలుదేరండి.." అన్నారు..


సాయంత్రం చీకటి పడే వేళయిందని కాబోలు శ్రీ స్వామివారు బైలుదేరమన్నారని భావించి..శ్రీధరరావు దంపతులు ఆశ్రమం నుండి మొగలిచెర్ల లోని తమ ఇంటికి చేరారు..అక్కడ పరిస్థితి చూసి అవాక్కయ్యారు..


అనారోగ్యం.అసహనం..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: