10, జూన్ 2021, గురువారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర..


*అనారోగ్యం..అసహనం..*


*(యాభై నాలుగవ రోజు)*


శ్రీ స్వామివారు అడిగినట్లుగా జీవసమాధి చేయడం తమవల్ల కాదని ఖరాఖండిగా తేల్చేసిన శ్రీధరరావు దంపతులు తిరిగి తమ ఇంటికొచ్చేసరికి.. సత్యనారాయణమ్మ గారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు..ఆయాసం ఎక్కువగా ఉండి.. ఊపిరి తీసుకోవడమే కష్టంగా వుందావిడగారికి..


సత్యనారాయణమ్మ గారిని చూసుకుంటాను అని చెప్పిన బంధువులావిడ..ఈ దంపతులను చూడగానే ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి..

"మీరసలు మనుషులేనా?..పెద్దావిడ కు ఆరోగ్యం బాగాలేదని తెలిసికూడా స్వాములు..పూజలు అంటూ తిరుగుతారా?..మీరు ఈవిడను నిర్లక్ష్యం చేయబట్టే..ఈరోజు ఈ ఉపద్రవం వచ్చిపడింది..ఇక ఒక్కనిమిషం కూడా ఈవిడను ఈ ఊళ్ళో ఉంచొద్దు..కనిగిరి కి తీసుకెళ్లి మెరుగైన వైద్యం చేయించండి.." అంటూ చిందులు తొక్కసాగారు..


"అది కాదమ్మా..మేము వెళ్లేముందు మిమ్మల్ని అడిగే కదా మేము స్వామివారి దగ్గరకు వెళ్ళింది..మీరు కూడా సమ్మతించారు..ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు..ఇంతకాలం మేము జాగ్రత్తగానే వున్నాము.." అంటూ సర్దిచెప్పబోయారు శ్రీధరరావు గారు..కానీ ఆ వచ్చిన బంధువులావిడ వింటేనా?..తన ధోరణిలో ఈ దంపతులిద్దరికీ శాపనార్ధాలు పెట్టి..సత్యనారాయణమ్మ గారిని కూడా కనిగిరి వెళ్ళడానికి సమాయత్తం చేయసాగారు..


ప్రభావతి గారికి దుఃఖం ముంచుకొచ్చింది..దాదాపు పాతికేళ్ల పాటు అత్తగారు తానూ కలిసి వున్నారు..సంసారమన్నాక చిన్న చిన్న కోపాలు మాటలు సహజం..అవి ఎప్పుడన్నా తలెత్తినా ఎవరో ఒకళ్ళు సర్దుకుని పోయేవాళ్ళు....ఇద్దరూ కలిసి మెలిసే వున్నారు..ఈరోజు ఎందుకిలా జరిగిందో అర్ధం కాక బాగా బాధపడ్డారు..పైగా అంత బాధలోనూ సత్యనారాయణమ్మ గారు కూడా తాను కనిగిరి కి వెళ్లి అక్కడ ఉంటానని చెప్పడం ఇంకా హృదయాన్ని కలచివేసింది..ఆ వచ్చిన బంధువు తానెంత గొప్పగా అత్తగారికి సేవ చేసిందీ చెపుతూ..స్వాములను నమ్ముకుంటే చివరకు దక్కేది మన్నే అని చులకనగా మాట్లాడటం మొదలుపెట్టింది..శ్రీధరరావు ప్రభావతి గార్లు తిరిగి ఒక్క ముక్క అనలేదు..


"అమ్మా..ఇంతకాలం మాతోనే ఉన్నావు..నీకంతగా కష్టంగా వుంటే..ప్రభావతి నీ దగ్గరే ఉంటుంది..స్వామివారి వద్దకు నేనొక్కడినే వెళ్ళొస్తాను.." అని శ్రీధరరావు గారు ఎంతో దూరం నచ్చచెప్పబోయారు..సత్యనారాయణమ్మ గారు అంతా విని .."శ్రీధరా రేపుదయం కారు తెప్పించు..నేను కనిగిరి వెళ్లి అక్కడ వుంటాను.." అన్నారు..


"మీరు చప్పున ఇంటికి వెళ్ళండి" అని స్వామివారు ఎందుకు చెప్పారో అప్పుడు బోధపడిందా దంపతులకు..ఇక చేసేదేమీలేక ప్రక్కరోజు ఉదయాన్నే కందుకూరు నుంచి కారు తెప్పించి..శ్రీధరరావు గారే దగ్గరుండి తన తల్లిగారిని కనిగిరి లో వదిలిపెట్టి బరువెక్కిన గుండెతో తిరిగి రాత్రికి మొగలిచెర్ల చేరారు..అప్పటి దాకా ప్రభావతి గారు భోజనం చేయకుండా ఎదురుచూస్తున్నారు..ఆవిడ మనసులో ఒక మూల అత్తగారు మనసు మార్చుకొని తిరిగి వస్తారని ఒక ఆశ!..కానీ అలా జరగలేదు..ఆరాత్రి ఆ దంపతులిద్దరూ నిద్రపోలేదు..ఏదో బలమైన దుష్టశక్తి ఆ బంధువు రూపంలో వచ్చి సత్యనారాయణమ్మ గారి మనసు మార్చి..తమకు ఆమెను దూరం చేసిందని అనుకున్నారు..


తెల్లవారగానే..శ్రీ స్వామివారి ఆశ్రమానికి బండి కట్టుకొని వెళ్లారు..చిత్రంగా శ్రీ స్వామివారు ఆశ్రమం బైట నిలబడి వున్నారు..వీళ్ళను చూడగానే..పెద్దగా నవ్వుతూ.."రండి!..రండి!..మీ కోసమే ఇక్కడ వున్నాను..మీరొస్తారని ముందే తెలుసు!.." అన్నారు..ఆశ్చర్యపోవడం ఈ దంపతుల వంతు అయింది..


ప్రభావతి గారు పూసగుచ్చినట్టు అంతా వివరంగా చెప్పి.."నాయనా!..మనసంతా బాధగా ఉంది..మా బంధువులావిడ రాకున్నా బాగుండు..అత్తగారు మా దగ్గరే వుండేవారు.." అన్నారు ముగింపుగా..


శ్రీ స్వామివారు మళ్లీ పెద్దగా నవ్వి.."అమ్మా..మీకొక విషయం చెప్పాలి..రండి లోపల కూర్చుని మాట్లాడుకుందాము.." అంటూ ఆశ్రమం లోపలికి దారి తీసారు..


శ్రీ స్వామివారి బోధ..ఊరట చెందటం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699.)

కామెంట్‌లు లేవు: