15, జులై 2021, గురువారం

కళామాలా

 794. 🔱🙏  కళామాలా ​🙏🔱

నాలుగు అక్షరాల  నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు *కళామాలాయైనమః* అని చెప్పాలి.

కళ = కళలను, 

మాలా = మాలగా ధరించినది.

కళ' అంటే అంశము, లేదా - 'విభాగము' అని సాధారణ అర్ధం. ఈ 'కళ, అనే పదం చంద్రుని విషయంలోను, లలితకళల విషయంలోను వాడుతూ ఉంటాము. అమ్మవారు చంద్ర సంబంధమైనది కాబట్టి 'కళ' అనే పదాన్ని చంద్రసంబంధమైనదిగా అర్థం చెప్పకుంటే - చంద్రునికి ఉన్న పదహారు కళలను మాలగా ధరించినది అని అర్ధం చెప్పుకోవాలి. అంటే అమ్మవారు షోడశ కళాప్రపూర్ణ.

'కళ' అనే పదాన్ని లలిత కళల పరంగా అర్థం చెప్పుకుంటే లలిత కళలు 64 ఉంటాయి. కాబట్టి - 64 లలితకళలను మాలగా ధరించునది' అనే అర్థం చెప్పుకోవాలి.

“కళ' అంటే విభాగం అన్నారు కదా అని 'కళ'కు శకలం' అనే పదం అర్ధం చెప్పుకోకూడదు. కుండబద్ధలయితే ఏర్పడే ముక్కలు కుండ యొక్క విభాగాలే అయినా అవి సమాన పరిమాణాల్లో ఉండవు. వాటి మధ్య ఒక సౌష్టవమైన సంబంధం కూడా ఉండదు. అందుచేత ఈ కుండ పెంకుల్ని 'శకలాలు' అనాలి.

పళ్ళెంలో మైసూరు పాకును కత్తితో ముక్కలుగా కోసినపుడు ఏర్పడే భాగాలు గూడా విభాగాలే కాని - ఇవి కుండ బ్రద్దలైతే ఏర్పడే పెంకుల్లాంటివి కావు. ఈ ముక్కలు అన్నీ సమానపరిమాణాల్లో ఒక నిర్దిష్టమైన ఆకారాల్లో, ఒక సౌష్టవ పద్ధతిలో కోయబడి ఉంటాయి. కాబట్టి, వీటిని 'శకలాలు' అని కాకుండా - 'కళలు' అని అనవచ్చును. 15 తిథులలోని చంద్రుని వెన్నెలకు సంబంధించిన విభాగాలు కూడా ఇలాగే ఒక నిర్దిష్ట పద్ధతిలో ఉంటాయి కాబట్టి వాటిని 'కళలు' అన్నారు. 16 తిథులకు చెందిన 16 నిత్యాదేవతలుంటారు. . ఈ పదహారు నిల్యాదేవతలచే నిత్యమూ  ఆరాధింపబడే ది కాబట్టి - అమ్మవారు వాటిని మాలగా ధరించినట్లుగా ఈ నామంలో ఉత్ప్రేక్షించబడింది.

64 విద్యాకళలు, 64 వృత్తికళలు, సూర్యకళలు, అగ్నికళలు, మొదలైన వన్నిటినీ అమ్మవారు మాలగా ధరించినట్లుగా ఉత్ప్రేక్షించబడినట్లు ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి.

వివిధ కళలను మాలగా ధరించినది - అని ఈ నామానికి అర్థం.


🙏ఓం ఐం హ్రీం శ్రీం కళామాలాయైనమః 🙏

🌷శ్రీ  మాత్రే  నమః 🌷

కామెంట్‌లు లేవు: