*శాస్త్రంలో ప్రతి మనిషికి ఒక నియమం చెప్పారు*
*न्यायोपार्जित वित्तेन कर्तव्यं ह्यत्म रक्षणम् -*
ప్రతి వాడికీ డబ్బు సంపాదించాలనే వాంఛ ఉండకే ఉంటుంది. ఆ వాంఛ ఉండకూడదని చెప్పటానికి వీలుటేదు.
*सर्वे गुणाः कांचन माश्रयंते*
అన్నారు. డబ్బు లేనివాడికి ఏమీ మర్యాద లేదండీ, అందువల్ల డబ్బు సంపాదించాలండీ అనంటారు. దాన్ని మనం కాదనం. కాని దానికొక విధానము ఉన్నది.
న్యాయమైన మార్గంలో నీవు ఎంతైనా సంపాయించు. దానితో నీ కుటుంబాన్ని పోషించుకో. ఇంకా మిగిలినదానిని దానధర్మాలు చెయ్యి అని చెప్పింది శాస్త్రం. కాని మనిషికి అది రుచించడం లేదు. డబ్బు సంపాయించడం అనేది మాత్రం ప్రధానం గాని, ఈ న్యాయమైన మార్గం ఎందుకు అని అంటాడు మనిషి, డబ్బు సంపాదించడమనేది ఒకటే మాకు లక్ష్యం గానీ, ఈ న్యాయము అనేది మాత్రం మాకు చెప్పకండి అంటున్నాడు.
నువ్వు అన్యాయమైన మార్గంలో విపరీతంగా సంపాదిస్తాను అంటున్నావే దానివల్ల నువ్వు అనుభవించేది ఎంతవరకు. నీవు న్యాయమైన మార్గంతో వెయ్యి రూపాయలు సంపాదించినా, అన్యాయమైన మార్గంతో లక్ష రూపాయలు సంపాదించినా నీవు తినేది ఎంత ? అన్యాయమైన మార్గంతో సంపాదించినందువల్ల బంగారం నోట్లో వేసుకుంటానంటావా? న్యాయమైన మార్గంతో సంపాదించడం వల్ల నాకసలు అన్నం జీర్ణం కాదంటావా ? రెండూ లేదు. నీవు ఎంత సంపాదించినా నీవు తినేది మాత్రం ఇంతే. కాని ఆ అన్యాయమైన మార్గంలో సంపాదించినందువల్ల నీకు అధికంగా వచ్చేది అన్యాయం చేసిన పాపఫలం ఒక్కటే.
అదేమిటండీ, అలా అంటారు నేనిప్పుడు ఇంకో మార్గాన్ని అవలంబించినందువల్ల కొన్ని లక్షలకు అధిపతి అయినాను. లేకపోతే ఎలా అవుతాను? అని అడగవచ్చు. ఇన్ని లక్షలకు అధిపతి అయినప్పటికీ సంతోషం తప్ప నీకు ఇంకేమీ లేదు. ఎందుకంటే మనమషి లక్షలు సంపాదిస్తున్నాడు కాని దాన్ని ఖర్చు పెడుతున్నాడా అంటే అవునని చెప్పడం కష్టం. మనిషికి డబ్బు ఖర్చుకు కొన్ని మార్గాలు వున్నాయి. ఏమిటా మార్గాలు?
తాను చక్కగా భోగములు అనుభవించడం అనేది ఒకటి. లేదా దానధర్మాలు చేయడం అనేది మరోటి అని రెండు మార్గాలు. డబ్బు అధికంగా ఉన్న మనిషి నిజంగా యోగ్యుడైేతే, శాస్త్రంలో విశ్వాసం కలవాడైతే దానధర్మములు చేసి వినియోగించాలి. మనం ఇవాళ్టి రోజున చేసిన దానఫలమే మనం ఈ శరీరం విడిచిన తర్వాత మనతోపాటు వచ్చేది. మనం వచ్చే జన్మలో కొద్దిగానైనా సుఖాన్ని అనుభవించాలి అంటే ఇవాళ మనం చేసే దానం ప్రభావమే. ఈ జన్మలో సుఖం అనుభవిస్తున్నామంటే అది క్రిందటి జన్మలో చేసిన దాన ప్రభావమే.
దానాన్ని గురించి ప్రాచీనులు ఒక మాటన్నారు -
*भवंति नरकाः पापात्, पापं दारिद्र्य संभवम् |*
*दारिद्र्यमप्रदानेन, तस्मात् दानपरो भवेत् ||*
పాపపు పనులు చేసినవాడికి నరకం ప్రాప్తిస్తుంది అన్నారు. పాపపు పనులు ఎందుకు చెయ్యవలసి వస్తున్నది అంటే దారిద్య్రం వల్ల. ఈ దారిద్య్రం వల్ల ఏమీ చేయడానికి తోచడం లేదు. ఏదైనా ఒక పాపపు పని చేసి డబ్బు సంపాయించుకు రావాలి. అసలీ దారిద్ర్యం ఇవాళ వీడికెందుకొచ్చింది? క్రితం జన్మలో ఏవిధమైన దానం చేయనందువల్ల అందువల్ల ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, దానం చేసేటటువంటి స్వభావాన్ని అలవరచు కోవాలి. అలా చేశామంటే వచ్చే జన్మలో మనకు దారిద్ర్రం రాదు. దారిద్ర్రం రానందువక పాపం చెయ్యాల్సిన పని లేదు. పాపం చెయ్యం కాబట్టి నరకాన్ని అనుభవించాల్సిన పనీ లేదు. కాబట్టి మనిషి ఈ వివేకంతో తన ఐశ్వర్యాన్ని దానధర్మాలకు వినియోగించాలి.
*-- జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థ మహస్వామివారు* .
-
*ॐ नमः पार्वती पतये हरहरमहदेव*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి