28, ఆగస్టు 2021, శనివారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*కొన్ని జ్ఞాపకాలు..*


మొగలిచెర్ల గ్రామానికి సమీపంలో ఉన్న ఫకీరు మాన్యం వద్ద శ్రీ స్వామివారు తమ ఆశ్రమాన్ని నిర్మిచుకోవాలని సంకల్పించారు..మా తల్లిదండ్రులు శ్రీ శ్రీధరరావు నిర్మల ప్రభావతి గార్లు, శ్రీ స్వామివారు కోరిన విధంగా ఐదు ఎకరాల భూమిని ఆశ్రమానికి ఇచ్చేసారు..ఆశ్రమ నిర్మాణానికి శ్రీ బొగ్గవరపు చిన మీరాశెట్టి గారు ముందుకువచ్చి..నిర్మాణాన్ని ప్రారంభించారు..ఇదంతా 1972 - 73 నాటి ముచ్చట..శ్రీ స్వామివారు తన తపస్సు కొనసాగిస్తూనే..ఆశ్రమ నిర్మాణాన్ని కూడా పర్యవేక్షిస్తూ వుండేవారు..మీరాశెట్టి గారి దంపతులు వారం లో రెండు మూడు సార్లు వచ్చి వెళ్లేవారు..శ్రీ స్వామివారు తాను కోరుకున్న విధంగా ఆశ్రమాన్ని కట్టించుకున్నారు..


ఒక మంచిరోజు చూసి ఆశ్రమం లోకి శ్రీ స్వామివారు ప్రవేశించారు..తన సాధన, తన తపస్సు తప్ప ఇతర లౌకిక విషయాలపట్ల శ్రీ స్వామివారు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు..ఎవరైనా వచ్చి తమ భవిష్యత్ గురించి అడగబోతే.."నీ ప్రారబ్ధాన్ని బట్టి ఉంటుంది..దానిని నేను మార్చలేను కదా..నువ్వు ఏ దేవుడిని కొలుస్తున్నావో..ఆ దైవాన్నే గట్టిగా నమ్ము..మార్గం చూపుతాడు.." అని సున్నితంగా చెప్పి పంపేవారు..ఎందుకనో శ్రీ స్వామివారు జాతకాలు చెప్పడం లాంటివి చేసేవారు కాదు..ఎంతసేపు దైవాన్ని భక్తితో ప్రార్ధించమని చెప్పేవారు.."నీవు ఎంత భక్తితో..ఆర్తితో..దైవాన్ని కొలుస్తావో..అంతే ఉత్సాహంతో దైవం నీకు అండగా ఉంటాడు..దైవకృప పొందాలంటే..అంతఃశుద్ధి చాలా ముఖ్యం..నీలో దైవం పట్ల తపన ఉండాలి..అది నిరంతరమూ నీలో వృద్ధి చెందాలి..అంతరంగం నిర్మలంగా వుండాలి..అప్పుడే దేవుడు నీ మొర ఆలకిస్తాడు.." అని చెప్పేవారు..


ఒకరోజు సాయంత్రం ఐదు గంటల వేళ, నేను మా పొలం నుంచి తిరిగివస్తూ..శ్రీ స్వామివారి ఆశ్రమం దగ్గర ఆగాను..ఒకవేళ శ్రీ స్వామివారు ధ్యానం ముగించుకొని బైటకు వచ్చి వుంటే..కలిసి వెళదామని లోపలికి వెళ్ళాను..శ్రీ స్వామివారు బావి వద్ద నిలబడి వున్నారు..నన్ను చూసి..నవ్వి..దగ్గరకు రమ్మని సైగ చేశారు..వెళ్ళాను..


బావిలోంచి బక్కెట్ తో నీళ్లు తోడి..ఆ బక్కెట్ తీసుకొని ఆ దగ్గరలోనే నాటబడి ఉన్న మొక్క పాదులో పోశారు..ఇలా రెండు మూడు బక్కెట్ల నీళ్లు తోడి..ఆ మొక్కకు పోశారు..ఆ మొక్క చుట్టూ..ఉన్న పాదునే.. మరి కొంచెం పెద్దదిగా తన చేతులతో చేశారు..నేను సహాయం చేద్దామని ముందుకు వచ్చాను..వద్దని వారించారు..శ్రీ స్వామివారి చేతులకు పై భాగం దాకా ఆ తడిమట్టి తాలూకు బురద అంటుకున్నది..నా వైపు చూసి.."బావిలోంచి కొంచెం నీళ్లు తోడు..నేను చేతులు శుభ్రం చేసుకుంటాను.." అన్నారు..నేను నీళ్లు తోడి, శ్రీ స్వామివారి చేతులమీద పోశాను.. శుభ్రం చేసుకున్నారు..


(సాక్షాత్తూ దత్తావతారమైన ఒక దిగంబర అవధూత నన్ను తన చేతులు శుభ్రం చేసుకోవడానికి సహాయం అడుగుతున్నాడనే స్పృహ నాకు ఆనాడు కలుగలేదు..ఒక మహిమాన్వితుడి శరీరాన్ని స్పృశిస్తున్నాననే జ్ఞానం నాకు ఆనాడు మదిలో మెదలలేదు..ఒక సాధారణ మానవుడికి చేసిన సహాయం లాగా భావించాను..ఇప్పుడు తలుచుకుంటేనే శరీరం పులకరిస్తుంది..)


 ఆ తరువాత అక్కడనుంచి లేచి ఇవతలికి వచ్చి..

"ఇది పారిజాతం మొక్క!..మొన్న మీ అమ్మానాన్న ఇక్కడికి వస్తూ తీసుకొచ్చారు..మీ అమ్మగారు దీనిని నాటారు..ఆమె నాకూ తల్లిలాంటిది..అందుకని ఈ మొక్కను జాగ్రత్తగా చూసుకోవాలి కదా.." అన్నారు.."ఈ స్థలం లో బాగా చెట్లు పెంచుకోవాలి..నిన్న ఆ మూల ఒక వేప మొక్క నాటాను.." అని నాకు చూపించారు..


(శ్రీ స్వామివారి మందిరం లో ఈనాటికీ ఆ పారిజాతం చెట్టు, వేపచెట్టు..అలానే ఉన్నాయి..మందిర ప్రాంగణంలో ఎన్ని మార్పులు చేసినా..వాటిని మాత్రం తొలగించకుండా కాపాడుకుంటున్నాము..)


శ్రీ స్వామివారు ఆశ్రమం వద్ద తన ఖాళీ సమయాల్లో చాలానే మొక్కలను నాటారు..ప్రస్తుతం ఉన్న మందిరానికి ఉత్తరం వైపు ఉన్న వేప, రావి చెట్లు శ్రీ స్వామివారు స్వయంగా నాటినవే..వాటికి ప్రదక్షిణాలు చేయడం భక్తులకు ఒక అలవాటు..ఆ రెండుచెట్లకూ కలిపి క్రింద వైపు విశాలమైన అరుగును భక్తుల సహకారం తో నిర్మించాము.. అలానే ప్రస్తుతం శివాలయం ఉన్న ప్రాంతమంతా చెట్ల నీడలో చల్లగా ఉందంటే కారణం..ఆనాడు శ్రీ స్వామివారు తీసుకొన్న శ్రద్ధే!..

సత్పురుషులకూ..సాధువులకూ..అవధూతలకూ.. భక్తుల మీద ప్రేమతో పాటు..పర్యావరణం మీద కూడా ఎనలేని ప్రేమ ఉంటుంది..


మొగలిచెర్ల లో పుట్టి పెరిగిన మేము, ఫకీరు మాన్యం గా పిలవబడ్డ ఆ బీడు భూమి ఒక దత్త క్షేత్రంగా మారుతుందని ఆనాడు ఊహించలేదు..ఈనాడు మొగలిచెర్ల గ్రామానికి ఆ క్షేత్రం వల్లనే ఎనలేని గుర్తింపు వస్తోంది..కేవలం ఒక దిగంబర అవధూత చేసిన తపో సాధన ఫలితమే ఇది..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: