రెండు విషయాలు
మనకు ఈ జగత్తులో రెండు విషయాలు అనుభవంలోకి వస్తున్నాయి. ఒకటి మన కంటికి కనపడే జగత్తు అది అందరు గమనిస్తారు. ఇక రెండోవిషయం ఏమిటంటే కనపడే ప్రతిదాని వెనుక ఏదో శక్తి వున్నది. సామాన్యు దృష్టిలో మనం ఈ విషయాన్నీ కొన్ని వస్తువుల్లోనే చూస్తాము కానీ సూక్ష్మంగా వెళ్లి పరిశీలిస్తే మనకు కనపడే ప్రతి వస్తువులో నిగుడంగా ఒక శక్తి ఆ వస్తువు పరిమాణంకు, స్వభావానికి అనుగుణంగా నిక్షిప్తమై ఉన్నది. ఆ శక్తిని మన మహర్షులు వారి వారి జ్ఞనంతో దర్శించారు.
సముద్రం మన కంటికి కనపడుతున్నది. అది మొత్తం నీరు అంటే నీరు అనే వస్తువు. మరి దానిలో మనం అలలను కూడా చూస్తున్నాము. ఈ అలలు ఎక్కడినుంచి వస్తున్నాయి. దీనికి కారణం ఏమిటి అంటే భౌతిక శాస్త్రం ఏదో ఒక సూత్రాన్ని చెప్పవచ్చు, కానీ ఆ సూత్రప్రకరమే జరగాలని ఎవరు నిర్ణయిస్తున్నారు. సముద్రంలో వరుసగా అలలు నిర్విరామంగా వస్తువున్నాయి. మరి నీవు ఒక చిన్న పాత్రలో ఆ సముద్రపు నీటిని తీసుకొని పక్కన పెట్టిచూడు. అందులో అలలు లేవు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అలలకు కారణం నీరా కాదా నీరు అంటే అదే నీరు పాత్రలోకూడా వున్నాయికదా మరి అందులో కూడా అలలు రావలికదా కానీ రావటంలేదు.
ఒక చిన్న గ్లాసులో నీటిని తీసుకొని మనం టేబులు మీద ఉంచామనుకోండి. ఆ గ్లాసులో నీరు ఏ చలనం లేకుండా స్థిరంగా ఉంటాయి. అంటే నీటికి ఏ శక్తి లేదనుకోవాలా అదే ఆ గ్లాసుకు ఒక చిన్న రంద్రం వున్నదనుకోండి. అందులోంచి నీరు కొంచం కొంచంగా కారుతూ గ్లాసులోని నీరు మొత్తం అయి పోతాయి. ఇప్పుడు నీటికి శక్తి ఉందనుకోవాలా లేదా.
నీవు వీధిలో వెళుతున్నావు. అనేక రాళ్ళూ కదలకుండా అక్కడ వున్నాయి. నీ వెంట ఒక కుక్క పడిందనుకో దానిమీద నీవు ఒక రాయి తీసుకొని విసిరావనుకో అది దానికి తాకి గాయాన్ని చేసింది. ఇప్పుడు మనం ఆలోచించాలసింది ఏమిటంటే కదలకుండ వున్నరాయి యెట్లా దానికి గాయాన్ని చేసింది. నీవు విసిరావు కాబట్టి. మరి నీవు రాయిలేకుండా కేవలం చేతిని ఊపితే కుక్కకు గాయం కాదె. నీ చేతి శక్తితో రాయి వేగంగా వెళ్లి దానికి తగిలిందంటే నీ శక్తిని తీసుకొని వెళ్లే శక్తి రాయికి ఎక్కడిది.
గింజలు ఇంట్లోనో గోదాములోనో ఉంటే మొలకెత్తవు మరి భూమిలో వేసి తగినంత నీటిని అందిస్తే ఎలా మొలకెత్తుతున్నాయి. ఇలా మనం అనేక విషయాలు చూస్తున్నాము. కానీ వాటిగూర్చిన విషయాలను అర్ధం చేసుకోలేక పోతున్నాము. సైన్సు మీకు యేవో థీరీలు చెప్పవచ్చు కానీ ఆ థీరీ ఎలా పనిచేస్తున్నది అంటే మాత్రం సైన్సు జవాబు చెప్పదు .
ఈ సృష్టిలో వున్న శక్తినే మన మహర్షులు ప్రాణశక్తిగా పేర్కొన్నారు. ఆ ప్రాణశక్తే అనేక ప్రేదేశాలల్లో అనేక విధాలుగా గోచరిస్తుంది. జడంగా వున్న పెట్రోలు నీ మోటారుసైకిలుని వేగంగా పరుగెత్తించే విధంగా శక్తిని ఇస్తున్నది. అదే పెట్రోలు కారులో పోసితే దానిని చలింపచేస్తున్నది. అంటే పెట్రోలుకు వాహనంతో పనిలేదు. అంతేకాక దానిని అంటిస్తే మంటగా దాని శక్తిని చూపెడుతున్నది.
జగత్తులో వస్తువులు అనేకంగా ఎలా మనకు కనపడుతున్నాయో అదేవిధంగా శక్తికూడా అనేకరూపాలతో మనకు అనుభవంలోకి వస్తున్నది. ఈ శక్తే మనకు కనపడే జగత్తుని చేతన్యవంతం చేస్తున్నది. జీవులలో వుంది జీవుల మనుగడకు కారణం అవుతున్నది. నిర్జీవులలో ఉండి వాటిలో అప్పుడప్పుడు అనేక విధ శక్తిరూపంగా బహిర్గతం అవుతున్నది.
దీనిని బట్టి మనకు ఒక విషయం జ్యోతకమౌతున్నది అదేమంటే శక్తీ మన కంటికి కనపడటంలేదు కానీ అది జడపదార్ధమైన భౌతిక పదార్ధాలను సహితం చెతన్యవంతంగా చేస్తున్నది. ఆ శక్తే భగవంతుడు.
భౌతిక మైన జగత్తు తన తన రూపాలను మార్చుకొంటున్నది. నిన్న విత్తుగా వున్నది నేడు మొలకగా వున్నది రేపు మ్రానుగా మారుతుంది తరువాత కాలగర్భంలో రూపాలన్నీ నశించి ప్రకృతిలో లయం అయిపోతుంది. ఈ నిఘాడ రహస్యాన్ని మన మహర్షులు వారి అపారజ్ఞ్యనంతో ఆవిష్కరించారు. ఒక్కవిషయం మనకు స్పష్టంగా కనపడుతున్నది. మనం చూస్తూవున్నది ఏది కూడా స్థిరంగా ఉండటంలేదు కాలానుగుణంగా మార్పుచెందుతున్నది తరువాత కాలంలో లయం అవుతున్నది.
వేదాలు కర్మజ్ఞనాన్ని తెలియచేస్తాయి. అంటే ఏ ఏ కర్మలు చేస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయి అని చెపుతాయి. వేదాంతం జ్ఞ్యానమార్గాన్ని ప్రభోదిస్తున్నది.
మన కళ్ళముందు వున్న జగత్తుకి సంబందించిన విషయాలు తెలుసుకోవటం కొంత సులువు ఎందుకంటె మనం చూడగలుగుతున్నాం. కానీ జ్ఞ్యాన మార్గం బహు దుర్లభం ఎందుకంటె ఇక్కడ ఎవరి అనుభవం వారిది. అరటిపండు నీవు తిన్నావు నేను తిన్నాను తియ్యగా ఉందని నీవు అన్నావు అప్పుడు నాకు దాని రుచిని తీపి అంటారని తెలిసింది. నిజానికి తియ్యదనానికి సంబందించిన అనుభూతి నీది వేరు నాది వేరు. అదే విధంగా వేదాంతానికి సంబందించిన అనుభూతులు ఎవరికి వారికి వారి వారి స్థాయిని బట్టి యోగ్యతను బట్టి ప్రత్యేకంగా ఉంటాయి. కంటికి కనపడే విషయానికి సంబందించిన జ్ఞ్యానం పొందటం తేలిక ఎందుకంటె అక్కడ నీకు నిరూపణగా ప్రత్యక్ష విషయం వుంది. కానీ ఆత్మజ్ఞానాన్ని సంబందించినది తెలుసుకోవటానికి నీ కళ్ళముందు ఏ రకమైన భౌతిక విషయం లేదు, కేవలం అనుభవాన్ని సాదించాలి. కొన్ని సందర్భాలలో ఇది నిజామా కాదా అనే సందేహంకూడా సాధకునికి రావచ్చు.
వేదాంతం కేవలం మోక్ష మార్గదర్శనం చేస్తుంది. మార్గంలో పయనించాల్సిన భాద్యత కేవలం సాధకునిదే. సాధకుడు అకుంఠిత దీక్షతో, నిరంతర కృషితో, ఏకాగ్రతతో, మనస్సుని పూర్తిగా స్వాధీనపరచుకొని చిత్త వృత్తులను నిరోధించి తనను తానూ అనుభూతి పొందటమే ఆత్మ సాక్షాత్కారం. ఎవరి అనుభూతి, అనుభవము వారిది. దానికి బాహ్యంగా ప్రకటించే శక్తి ఎవ్వరికీ లేదు. ఇటీవల కొందరు తమకు తాము దివ్యపురుషులమని చెప్పుకొంటూ వారికి ఆత్మ సాక్షాత్కారం అయినట్లు చెప్పటం నేను ఒక వీడియోలో చూసాను. సాధకులారా ఆత్మసాక్షాత్కారం చెందినవారు ఈ సభ్యసమాజంలో వుండరు. ఎవ్వరితోటి వారికి నిమిత్తం లేదు. వారికి ధన,కీర్తి వ్యామోహాలు వుండవు. నేను ఆత్మసాక్షాత్కారం పొందాను అని ఎవరైనా అంటే కేవలం అది వారి మూర్ఖత్వంగానే భావించాలి. ఇటీవలి కాలాలలో సత్పురుషులు అనదగిన వారు నాకు తెలిసి శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ రామనామహర్షులు అయి ఉండవచ్చు ఎందుకంటె వారు ఎరకమైన ఐహిక ప్రలోభాలకు లోనుకాకుండా కేవలం కైవల్య ప్రాప్తికై జీవించినట్లు మనకు చరిత్ర చెపుతున్నది.
ఎటువంటి ఐహిక ఆపేక్ష లేకుండా బోధించేవారే అసలైన సద్గురువులు. అరిషడ్వార్గాలను పూర్తిగా విడనాడి కేవలం జీవించటానికి మాత్రమే తింటూ, ఇతరులకు ఇబ్బందికాకుండా మాత్రమే వస్త్రధారణ చేస్తూ వుండే సర్వ సంగ పరిత్యాగులు మాత్రమే నిజమైన గురువులు. మనం ఈ నియమాలను పాటిస్తున్నవారిని ఎక్కడ చూస్తున్నాము అన్నది ప్రశ్న.
ప్రస్తుతం మనం సమాజాల్లో అనైక బాబాలను, మహానుభావులుగా చెప్పుకునే వారిని చూస్తున్నాము. వారు సాధారణ సంసారులకన్నా అనేకవిధాలుగా భోగాలను అనుభవిస్తూ మనకు కనపడుతున్నారు. వారిని యోగులుగా ఎలా పరిగణలోకి తీసుకోవాలి. జుట్టుకు, మీసాలకు, గడ్డాలకు రంగులు వేసుకొని ప్రవచనాలు చేసే వారుకూడా లేకపోలేదు.
రోడ్డు మీద ప్రయాణం చేస్త్తున్న నీకు రెండు రోడ్లుగా చీలినప్పుడు అక్కడి సైను బోర్డు నీకు దోవ యిక్కడి పోతుందో మాత్రమే చెపుతుంది. కానీ ప్రయాణం చేయాలసింది మాత్రం నీవే. మన శాస్త్రాలు, గురువులు ఆధ్యాత్మిక మార్గదర్శకులు మాత్రమే. గమ్యాన్ని చేరుకోవటం కేవలం మన కృషి.
ఓం తత్సత్
శాంతి శాంతి శాంతిః
బుధజనవిధేయుడు
భార్గవ శర్మ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి