16, సెప్టెంబర్ 2021, గురువారం

ఓజోను పొర రక్షణ"

 అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం (అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం) 


    ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. 

    జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్‌ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది.  


వివరాలు    

.

    సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలను దిగువ స్ట్రాటోస్ఫియరులో ఉండే ఓజోన్ వాయువు శోషించుకుని (పీల్చుకుని) భూమిని రక్షిస్తుంది. 

    ఓజోన్ సాంద్రత అధిక మోతాదులో ఉండే ఈ ప్రాంతాన్ని ఓజోన్ పొర అని, ఓజోన్ కవచం అనీ అంటారు. 

    ఈ ఓజోన్ పొరలో ఓజోన్ సాంద్రత తగ్గడాన్ని ఓజోన్ క్షీణత అని అంటారు. 

    ఓజోన్ క్షీణతకు సంబంధించి 1970 ల చివరి నుండి గమనించిన రెండు సంఘటనలున్నాయి: 

1. భూ వాతావరణంలోని మొత్తం ఓజోన్‌లో (ఓజోన్ పొర) నాలుగు శాతం క్రమంగా తగ్గడం,  

2. వసంతకాలంలో భూమి ధ్రువ ప్రాంతాల చుట్టూ స్ట్రాటోస్ఫియరు లోని ఓజోన్‌లో పెద్దయెత్తున తగ్గుదల.            

    ఈ రెండో దృగ్విషయాన్ని ఓజోన్ రంధ్రం అంటారు. ఈ స్ట్రాటోస్ఫియరు సంఘటనలతో పాటు వసంతకాలంలో ధ్రువీయ ట్రోపోస్పిరిక్ ఓజోన్ క్షీణించిన సంఘటనలు కూడా ఉన్నాయి.


    "ఓజోన్ రంధ్రం" 1982 లో మొట్టమొదటిసారిగా కనుగొన్నప్పటి నుండి, 2019 లోనే అత్యంత చిన్న పరిమాణంలో ఉందని నాసా ప్రకటించింది. 


    ఓజోన్ క్షీణతకు, ఓజోన్ రంధ్రం ఏర్పడడానికీ ప్రధాన కారణం కృత్రిమ రసాయనాలు - ముఖ్యంగా హేలోకార్బన్ రిఫ్రిజెరంట్లు, ద్రావకాలు, చాలకాలు, క్లోరోఫ్లూరోకార్బన్‌లు (CFC లు), హేలోన్‌లు HCFC లు. 

    వీటిని ఓజోన్ హారక పదార్థాలు (ODS) అని అంటారు. ఈ సమ్మేళనాలు ఉపరితలం నుండి విడుదలైన తరువాత టర్బ్యులెంట్ మిక్సింగు ద్వారా అణువులు స్థిరత్వం పొందే వేగం కంటే చాలా వేగంగా కలసి పోయి, స్ట్రాటోస్ఫియరు లోకి రవాణా అవుతాయి.  

    స్ట్రాటోస్ఫియరు లోకి చేరాక, కాంతివిశ్లేషణం (ఫోటో డిస్సోసియేషను) ప్రక్రియ ద్వారా అవి హేలోజన్ అణువులను విడుదల చేస్తాయి. 

    ఇవి ఉత్ప్రేరకంగా పనిచేసి, ఓజోన్ (O3) ను ఆక్సిజన్ (O2) గా మారుస్తాయి.


    ఓజోన్ క్షీణత కారణంగా క్యాన్సరు వాటిల్లే ప్రమాదం పెరగడం పట్ల, ఇతర ప్రతికూల ప్రభావాల పట్లా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన తలెత్తింది. 


అతినీలలోహిత కిరణాలు (Ultra Violet Rays) - ఓజోను 


    ఓజోన్ పొర అతినీలలోహిత కిరణాలను భూ వాతావరణం గుండా చొచ్చుకుని రాకుండా నిరోధిస్తుంది. 

    ఈ కిరణాలు చర్మ క్యాన్సరుకు, వడదెబ్బకు, కంటిశుక్లానికీ కారణమవుతాయి. అలాగే మొక్కలు. జంతువులకు హాని కలిగిస్తాయి. 

    ఓజోన్ పొర పల్చబడటం వలన ఈ కిరణాలు నాటకీయంగా పెరుగుతాయి. 

    ఈ ఆందోళనల నేపథ్యంలో 1987 లో ప్రపంచదేశాలన్నీ మాంట్రియల్ ప్రోటోకోల్‌ను అమలు చెయ్యాలని తీర్మానించాయి. ఈ ప్రోటోకోల్ CFC లు, హేలోన్లు, ఇతర ఓజోన్-హారక రసాయనాల ఉత్పత్తిని నిషేధించింది.

    ఈ నిషేధం 1989 లో అమల్లోకి వచ్చింది. 1990 ల మధ్యలో ఓజోన్ స్థాయి తగ్గకుండా నిలబడిపోయింది. 2000 లలో ఓజోన్ పొర పుంజుకోవడం మొదలైంది. ఈ పుంజుకోవడం 21 వ శతాబ్ది లోనూ కొనసాగి, 2075 నాటికి ఓజోన్ రంధ్రం 1980 పూర్వం నాటి స్థాయికి చేరుకుంటుందని అంచనా. 


    మాంట్రియల్ ప్రోటోకోల్‌ను ఇప్పటి వరకు అత్యంత విజయవంతమైన అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందంగా భావిస్తారు.   


భారతీయత   


1. మందేహులు అనే రాక్షసులు సంధ్యాకాలంలో అర్ఘ్యప్రదానం ద్వారా బ్రహ్మతేజస్సుతో కొట్టబడి, పడిపోయి, మళ్ళీమళ్ళీ లేస్తూ ఉంటారు. 


    ఓజోను పొరలు కరిగిపోయి, అతి నీలలోహిత కిరణాలు భూమిని సోకకుండా, 

    అర్ఘ్యప్రదానమనే నిరంతర ప్రక్రియతో, 

    నీటి విడుదల ద్వారా, మంత్ర శబ్దతరంగాలు కాపాడుతాయని విజ్ఞానశాస్త్ర పరంగా ఒకవైపు వివరణ.  


2. శివునికి వ్యోమకేశి అని పేరు. 

    అంటే, అంతరిక్షంలో వ్యాపించబడిన కేశములు గలవాడు. 

    నీలకంఠుడు అని కూడా ఆయనకి పేరు ఉంది. 

    అనగా కంఠమందు కాలకూడ విషమును కలిగి నీలకంఠుడైనాడు.  


    అంటే, కంఠభాగానికి పైన శరీరం అంతరిక్షంలో ఉండి, అక్కడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల క్రిందికి రాకుండా ఆపుచేయువాడు.         


    ఈ రెంటివలన, మన దేశ సంస్కృతిలో 

   "అతినీలలోహిత కిరణాల ప్రమాదాన్ని అరికట్టడమూ, ఓజోను పొర రక్షణ" 

     మనకు మన ఋషులు దైవీభావనతో, దైనందిన జీవితంలో, క్రియల ద్వారా అందిచ్చారని తెలుస్తోంది కదా!

కామెంట్‌లు లేవు: