_*మాఘమాసం*_
🌹 _*శుక్రవారం*_🌹
🎋 _*ఫిబ్రవరి 18వ తేది 2022*_🎋
_*🚩మాఘ పురాణం🚩*_
🌴 _*17 వ అధ్యాయము*_🌴
🕉🎋🌹🌹🌹🌹🎋🕉️
*ఇంద్రునికి కలిగిన శాపము*
☘☘☘☘☘☘☘☘
వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల ఇట్లనెను. రాజా ! మాఘమాస మహిమను వివరించు మరియొక కథను చెప్పెదను వినుము. పూర్వము గృత్నృమదుడను మహర్షి గంగాతీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాదికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహా విష్ణువు మహత్మ్యమును వివరించుచుండెను. జహ్నువనుమహాముని మాఘమాసస్నాన మహిమను వివరింప కోరగా గృత్నృమదమహర్షి యిట్లు పలికెను. సూర్యుడు మకరరాశిలో నున్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును. అట్టి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశము కూడ అగుచున్నది. మాఘమాసమున ప్రాతఃకాలమున నదీస్నానము చేసిన వారు ఇంద్రుడు మహా పాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు ఆ విషయమును వినుడు.
పూర్వము తుంగభద్రా నదీతీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని యొకడు ఆశ్రమమును నిర్మించుకొని యుండెను. మిత్రవిందుని భార్య అతిలోకసుందరి , ఆమె యొకనాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడిబట్టలు కట్టుకొని కేశములనారబెట్టు కొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో గలసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడామెను చూచి మోహపరవశుడయ్యెను. అమెనెట్లైన పొందవలయునని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగివచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమముపై భాగమున నుండి మిత్రవిందముని భార్య అందమును , ఆమె చేష్టలను గమనించుచుండెను.
మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేదపఠనము చేయింపవలయునని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్లెను. ఇంద్రుడును ఆశ్రమములోనికి రహస్యముగ ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను , విడిపించుకొని పోవుచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామ పరవశయై ఇంద్రునిపొందు అంగీకరించెను , కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్ల యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవెవడవని యడిగెను. నేనింద్రుడనని సమాధానమిచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవై స్వర్గమునకుపోలేక భూలోకముననే యుండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయిపై పడియుండుమని శపించెను. ఆ చోటును విడిచి గంగాతీరమును చేరి అచట తపమాచరించి యోగశక్తిచే దేహమునువిడిచి పరమాత్మలో లీనమయ్యెను.
ముని శాపమువలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద మిగిలిన శరీరము మామూలుగనేయుండును. అచటనుండుటకు సిగ్గుపడి పద్మగిరియను పర్వతమును చేరి అచటి గుహలోనుండి అచటనున్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు పన్నెండు సంవత్సరములు గడిపెను. రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెదుకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరల వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెదకుచు నదీతీరములయందు సముద్రతీరము నందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసమగుటచే మాఘమాసమున నదీస్నానము చేసి తీరిగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి, మునులు వారిట్లనిరి.
దేవతలారా వినుడు మేము చేయువ్రతము మాఘమాసవ్రతము సూర్యుడు మకర రాశి యందుండగా ప్రాతఃకాలమున తటాకాదులందు స్నానము చేయుట శ్రీమహావిష్ణుపూజ , పురాణ పఠనము , యధాశక్తి దానము. దీనివలన దుర్లభమైన మోక్షము కూడ సులభమగును. మాఘమాసమున చేసిన మాధవస్మరణ సర్వపాపములను నశింపచేయును. మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయు వారి అదృష్టమనంతము. మాఘశుద్ధ చతుర్దశియందు గోదానము , వృషోత్పర్జనము , తిలదానము ఆవూప దానము , పాయసదానము , వస్త్రకంబళములదానము , విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీమహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములైయుండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలును దివ్యమునులు మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీమహ విష్ణువు నర్చించిరి. వారికి శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీమహా విష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగియుండెను. శంఖుచక్ర గదాపద్మములను నాలుగు చేతులయందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగ నుండెను. కంకణములు వారములు వైజయంతీమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీమహావిష్ణువును డేవతలిట్లు స్తుతించిరి.
*స్వామీ:* నీవు జగములకే గురువువు వేదవేద్యుడవు నీయనుగ్రహము లేనిదే యెవరును నిన్నెంతటి వారైనను యెరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాస మహర్షిని పాదముల మహిమను స్తుతించి కృతార్థులైరి. అట్టి నీకు మా నమస్కారములు స్వామీ ! నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు సమస్తమును నీవే వ్యాప్తమైయున్నది. నీవు సచ్చిద్రూపుడవు సత్యవాక్కువు స్వామీ ! యిట్టి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితిలయముల నిర్వహించుచున్నావు. సర్వసృష్టి నశించి జలమయ మైనప్పుడు మఱ్ఱి ఆకుపై పరుండి చిదానంద స్వరూపడువైయుందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్పమరెవరును యెరుగజాలరు. కర్మప్రకృతి గుణభేదముల ననుసరించి సృష్టించి వాని యాందాసక్తుడవై యున్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయరూపమున నున్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడవైన నిన్నెవరును యెరుగజాలరు. బ్రహ్మ , ఇంద్రుడు మొదలైన దేవతలు , పంచభూతములు అన్నింటిని సృష్టించిన వాడవు నీవే ధ్రువుడు , నారదుడు , ప్రహ్లాదుడు , ఉర్దవుడు మొదలగు ఉత్తమపురుషులు మాత్రమే నన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములును నీవే మాట మనస్సు మున్నగువానికి అందని నీరూపమును నిన్ను స్తుతించుట తప్పయేమియు చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని గోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము. అని దేవతలు పలు రీతుల శ్రీమహావిష్ణువును స్తుతించిరి.
దేవతలయందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై యిట్లనెను. దేవతలారా ఇంద్రుడు ముని శాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద మొగము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగియున్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెననుభవించి దోషము చేసి మునిశాపమునొందెను. పద్మగిరి దోకర్ణ సమీపముననున్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్దభ ముఖుడైన ఇంద్రునిచే నదీస్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖముకలవాడై , పూర్వమువలె దివ్య శక్తులను పొంది మమ్ము రక్షింపగలడు , కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయపుణ్యకాలమున నదీస్నానము చేయింపుడని చెప్పెను.
దేవతలు శ్రీమహావిష్ణువు మాటలనువిని విస్మితులైరి. స్వామి ముని శాపపీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘస్నానముచే స్వగ్ధుడగునా ? విచిత్రముగ నున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు , దేవతలారా ! మాఘమాసస్నాన మహిమను మీరెరుగకపోవుటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యధా పూర్వరూపమును పొందుటలో ఆశ్చర్యము , సందేహము అక్కరలేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షి ఇంద్రుని వలె పాపమును చేసి కపిముఖుడై మాఘస్నానము చేసి పూర్వ స్థితి నొందెనని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణువిట్లు పలికెను. వినుడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగాతీరమునకు వచ్చెను. మాఘమాసకాలమగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి. అట్లు వచ్చిన దంపతులులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీస్నానము చేయుచు భార్యను కూడ నదీస్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగాతీరమును చేరిన ఆమె ఈ చలిలో నాకీచన్నీటి స్నానము బాదాకరము నేను స్నానము చేయజాలను. మీకు ఆశక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడెంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు. స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలసి స్నానము చేసెను. గంధర్వును భార్య మాఘస్నానమును ధూషించి నిరాకరించుటచే ఆమె దివ్య శక్తులను కోల్పోయెను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్లుసందడిలో గంధర్వుని భార్యను మిగిలినవారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగాతీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను.
ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి , యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలలో తెలియాడుచుండగా , మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా , విశ్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృస్యమును చూచి మండిపడుచు తపస్వివై యుండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున , నీకు కోతి ముఖము కలుగుగాకయని విశ్వామిత్రుని , పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి , *" విశ్వామిత్రా ! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి , నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము",* అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి , విష్ణువును ధ్యానించి , కమండలముతో నీరు తెచ్చి , పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది , గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.
దేవతలారా ! మాఘస్నానము మహిమ మాటలకు అందదు చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో నున్న ఇంద్రునిచే మాఘస్నానమును చేయింపుడు. అప్పుడు అతనికి శాపవిముక్తి యగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాపవిముక్తికి ఉపాయమును సూచించెను.
🌷🌷 *సేకరణ*🌷🌷
🌴 *న్యాయపతి*🌴
🌿 *నరసింహారావు*🌿
🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴
🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి