18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

పంతులమ్మ

 ఈ రోజు *పంతులమ్మ* అను *మాదిరెడ్డి సులోచన*  గారి నవలా పరిచయం.  


72 నవలలు రాసిన మాదిరెడ్డి సులోచన చాలా గొప్ప రచయిత్రి.  ఎక్కువగా మధ్య తరగతికి సంబంధించిన సామాజిక స్థితిగతులే ఆమె రచనలకు ఆధారం.  అలాగే స్త్రీ జనాభ్యుదయం కోరి రాసిన నవలలు కూడా ఉన్నాయి.  


ఈ కోవకు చెందిన మంచి కథాంశం గల నవల  పంతులమ్మ.  స్త్రీ లో ఆత్మవిశ్వాసం పెరగాలంటే చదువు చాలా అవసరం. వ్యక్తిత్వం, సంస్కారం అలవడాలంటే చదువు ద్వారానే సాధ్యం అవుతుందని ఈ రచయిత్రి అభిప్రాయం.  అప్పుడే దేశాభ్యుదయంలో పురుషునితో పాటు సమానంగా స్త్రీ రాణించగలదని ఈమె నమ్మకం ఈ  పంతులమ్మ  నవలలో మనకు కనబడుతుంది.  


బాల్యవితంతువైన సుచరిత సంప్రదాయ బద్ధమైన జీవనశైలే ఈ నవల కథాంశం.  టీచర్ గా పనిచేస్తున్న సుచరితకు అనేక సమస్యలు, కొన్ని అవమానాలు ఎదురౌతాయి.  ఇటువంటి పరిస్థితుల్లో స్త్రీ నిలబడాలంటే చాలా కష్టం.  ఎంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉండాలి.  ఐనా ఇవన్నీ సుచరిత నిర్భయంగా ఎదుర్కొంటూ తన వృత్తికి కళంకం రానీయకుండా అటు స్టూడెంట్స్ అభిమానానికి  ఇటుపై అధికారుల మన్ననలు పొందుతూ తన వృత్తిలో రాణిస్తూ తన విశిష్ట వ్యక్తిత్వంతో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా కీర్తిశిఖరాలను అందుకుని మహిళాలోకానికి మార్గదర్శకురాలవుతుంది.  


ఉపాధ్యాయురాలి వృత్తిలో సాదకబాధలను బాగా వివరించారు.  151 పేజీల  పంతులమ్మ నవల ఏకబిగిన చదివేలా చేస్తుంది కథనం.  అందరూ ముఖ్యంగా ప్రతీ స్త్రీ తప్పక చదవాల్సిన మంచి నవల ఇది.  ఈ నవల ద్వారా ఎంతో నేర్చుకోగలం.  


రచయిత్రి దురదృష్టవశాత్తు 1983లో సరిగ్గా ఈరోజే గ్యాస్ సిలిండర్ ప్రేలుడుకు గురై మరణించారు.  అప్పటికి  సులోచన గారి వయసు 48 ఏళ్ళు మాత్రమే.  ఈ దుస్సంఘటన జరగకపోయి ఉంటే మరిన్ని మంచి నవలలు ఆమె కలం ద్వారా వచ్చుండేవి. 


రచయిత్రి  మాదిరెడ్డి సులోచన 39వ వర్ధంతి సందర్భంగా ఆవిడకు మన నివాళులు.

కామెంట్‌లు లేవు: