22, ఫిబ్రవరి 2022, మంగళవారం

కైలాస పర్వతం

కైలాస పర్వతం - పౌరాణిక,మార్మిక,  వైజ్ఞానిక విశ్లేషణ :

--- 3 ---

హిమాలయాలలో గల కైలాస పర్వతం, భారత్-టిబెట్ ల మధ్య గల కైలాస హిమ శ్రేణులలో ఎత్తైన శిఖరం. కైలాస పర్వతం , ఈ విశ్వానికే "ఆధ్యాత్మిక మూల స్థంభంగా" పరిగణించబడుతోంది. కైలాస పర్వత శ్రేణిలో గల ఈ మహోన్నత కైలాస శిఖరం, పవిత్రమైన-మార్మికమైన శిఖరం. బహు విచిత్రంగా దీని ఆకారం ఈజిప్టు పిరమిడ్లలా ఉండడం కాకతాళీయమేనా? లేక ఇంకేదైనా మార్మిక కారణం ఉందా?

కైలాస శిఖరం , నలువైపుల నుండి సింధునది, సట్లెజ్ నది( శతధృ నది) , బ్రహ్మ పుత్రానది, కర్నాలి నదులు....పుట్టి తాము ప్రవహించినంత మేరా సస్యశ్యామలము చేస్తున్నాయి. ఇవి జీవ నదులై, అన్ని కాలాల లోనూ, ప్రజలను పోషిస్తున్నాయి.

ఎందుకీ కైలాస శిఖరానికి అంత విశిష్టత?

కైలాస శిఖరం, ఆది దేవుడైన పరమ శివుడి నివాసం. మాత పార్వతితో కలసి యున్న మహాదేవుడు ఇచటనే ఉన్నాడు. టిబెటన్లు, హిందువులు,జైనులు కైలాస ప్రదక్షిణం చేస్తారు. ఈ కైలాస శిఖరం, భౌతిక ప్రపంచానికి-ఆధ్యాత్మిక ప్రపంచానికి వారధి లాంటిదని, మర్మ యోగులు చెబుతారు.

ఆధునిక విజ్ఞాన శాస్త్రం , భూమి యొక్క అక్షం మీద ఈ కైలాస శిఖరం ఉందని (మేరు పర్వతం !!!) , ఈ భూగోళానికి చెందిన వాతావరణ పరిస్థితులను, సమతుల్యం చేస్తుందని చెబుతుంది. ప్రపంచంలోని ప్రతి భూభాగంతోనూ, భూమి యొక్క ధృవాలతోనూ ఈ పర్వతం సంబంధం కలిగి యుండి.....సమన్వయాన్ని కూడా కలిగి ఉంటుంది. అంటే ఆయా ప్రాంతాల్లో వచ్చే మార్పులు, కైలాస పర్వతం ప్రస్ఫుటీకరిస్తుంది. అలాగే, కైలాస పర్వతం నుండి వచ్చే భౌతిక,అభౌతిక మార్పులు...ఆయా ప్రాంతాలు స్వీకరిస్తాయి. ఈ కైలాస పర్వతం "స్టోన్ హెంజ్" నకు, 6714 కి.మీ. దూరంగా ఉండడం యాధృచ్చికమేనా?

ఈ కైలాస శిఖరం అధిరోహించడానికి, చాలా మంది ఔత్సాహికులైన,సాహసవంతులైన పరిశోధకులు ఎంతో ప్రయత్నించారు. కానీ ఇంతవరకూ ఎవరూ అధిరోహించలేదు. ఇది బహు విచిత్రం! ఇక్కడ విచిత్రం ఏమిటంటే, కైలాస పర్వతం (ఒక వింత సిద్ధాంతం ప్రకారం)తన స్థానం మార్చుకుంటున్న కారణంగా, ఈ పర్వతారోహకులు విజయం సాధించలేక పోతున్నారు. నిరంతరం ఈ శిఖరం తన స్థానం మార్చుకోవడం మాత్రం బహు విచిత్రం, వింతలలో కెల్లా వింత.

ప్రస్తుతం భూమి మీద చెల్లా చెదురుగా ఉండి ఏ సంబంధమూ కనిపించని Easter Island, Stone Henge, Egyptian Pyramids, Mexican pyramids, Bermuda Triangle వంటివి కైలాసశిఖరం నుండి, వాటి దూరాల్ని కొలిచి చూస్తే అవన్నీ ఒక క్రమ పద్ధతిలో ప్రణాళిక వేసుకుని కట్టిన దృశ్యం కళ్లముందు కనబడతాయి. సనాతన ధార్మిక సాహిత్యం నిర్ధారించి చెప్పిన దాని ప్రకారం అనంతకోటి విశ్వాలలో ఒకటైన మన విశ్వాండం యొక్క అక్షం భూగోళం యొక్క అక్షంతో కలిసి పైకి సాగుతూ వూర్ధ్వలోకాలకు వేసిన నిచ్చెన వలె పొడుచుకుని వచ్చిన ఆకారమే కైలాసశిఖరం! కైలాసశిఖరం ఉన్న చోటు నుంచి కిందకి meridian line గీస్తే భూమికి రెండవ వైపున Easter Island ఉంటుంది.

అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానం అక్కరలేదు,ఈ ప్రాంతాలని గుర్తు పట్టగలిగిన సైజు గ్లోబు గనక మీ దగ్గర ఉంటే ఇప్పటికిప్పుడు కొలిచి చూసుకోవచ్చు - Mount Kailash నుంచి Egyptian Pyramids వరకు ఒక సరళరేఖ గీస్తే అది Easter Island వైపు చూస్తుంది,ఆ రెంటినీ కలపండి.ఇప్పుడు కొలిస్తే Mount Kailash నుంచి Egyptian Pyramids మధ్య ఉన్న దూరం Mount Kailash నుంచి Ester Island మధ్య దూరంలో నాలుగో వంతు ఉన్నట్టు తెలుస్తుంది.అంతే కాదు, Easter Island నుంచి Mexican Pyramids వారకు ఒక సరళరేఖ గీస్తే అది Mount Kailash వైపుకు సాగుతుంది,ఆ రెండింటిని కూడా కలపండి.ఇప్పుడు Ester Island నుంచి Mexican Pyramids మధ్య దూరం కూడా Mount Kailash నుంచి Easter Island మధ్య ఉన్న దూరంలో నాలుగో వంతు ఉన్నట్టు తెలుస్తుంది.అంటే,Egyptian Pyramids నుంచి Mount kailash మధ్య ఉన్న దూరమూ Mexican Pyramids నుంచి Easter Island మధ్య ఉన్న దూరమూ సమానం అన్నమాట!

ఈ లెక్క ఇంతటితో అయిపోలేదు, Mount Kailash నుంచి Stonehenge Monument వరకు ఒక సరళరేఖ గీస్తే అది కూడా Easter Island వైపుకే సాగుతుంది.మళ్ళీ Mount Kailash నుంచి Stonehenge వరకు గల దూరం Mount Kailash నుంచి Easter Island వరకు గల భూమి వ్యాసంలో నాలుగోవంతు ఉంటుంది.ఈ Mount Kailash నుంచి Stonehenge మీదుగా Easter Island వరకు సాగుతున్న రేఖ మీద Easter Island వైపునుంచి మూడోవంతు దూరం దగ్గిర చుక్క పేడితే - అక్కడ Bermuda Triangle ఉంది!Bermuda Triangle రహస్యం గురించి పరిశోధనలు చేస్తున్నవారిలో, కొందరు అప్పుడే ఈ అమరికను బట్టి కొత్త సూత్రీకరణలు చేస్తున్నారు.వారి విశ్లేషణల ప్రకారం ఈ వలయంలోని ఆ ప్రాంతంలో ఉన్న ఒక నిర్మాణం భూమిలోనికి కుంచించుకుపోయి ఉండవచ్చు. అది శ్రీచక్రబహుభుజి వంటి నిర్మాణంలో ఉండాల్సిన చోట ఉండకపోవటం వల్ల ఐన్స్టీన్, విశ్వంలో కాంతి వంగుతుందన్నట్టు తన ప్రభావం తీవ్రంగా ఉన్నంతమేర స్థల-కాల ద్రవ్యశక్తి తత్వాలను వంచుతున్నది!

ఈ దూరాల లెక్కలో ఉన్న అసలైన విశేషాన్ని గమనించండి - Mount Kailash నుంచి Stonehenge Monument వరకు ఉన్న దూరం 6714 కిలోమీటర్లు, Stonehenge Monument నుంచి Bermuda Triangle వరకు ఉన్న దూరం 6714 కిలోమీటర్లు, Bermuda Triangle నుంచి Easter Island వరకు ఉన్న దూరం 6714 కిలోమీటర్లు, North Pole  నుంచి Mount Kailash వరకు ఉన్న దూరం 6714 కిలోమీటర్లు కాగా Mount Kailash ఎత్తు 6714 మీటర్లు!

ఒక కొలత మాత్రం మీటర్లలో ఉండి మిగిలినవి కిలోమీటర్లలో ఉండడం కూడా గణితశాస్త్రంలోని ఒక శాఖ అయిన Fractal Mathematics ప్రకారం చూస్తే అది అనుకోని పొరపాటు వల్ల జరిగినట్టు కాక ఈ నిర్మాణాలను ఇంత ప్రణాళికతో నిర్మించినవారు గణితశాస్త్రంలోని ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టలేదనేటందుకు సాక్ష్యంగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ అన్ని నిర్మాణాలను గురించి విడివిడి పరిశోధనలు చేస్తున్న వారిలో కొందరు ఇవి మానవనిర్మితాలనీ కొందరు, గ్రహాంతరవాసుల చేత నిర్మించబడినాయనీ మరికొందరు, ఇలా రెండుగా చీలిపోయి ఉన్నారు. నాకైతే ఈ రెండూ కాక పరమేశ్వరుడు భూమి మీద తన ఉనికిని సర్వులకూ చాటి చెప్పడానికి దివ్యపురుషులను నియోగించి నిర్మింపజేశాడని అనిపిస్తున్నది!ఇతర దేశాల వారికి అయితే మానవులూ లేకుంటే గ్రహాంతరవాసులూ అనటం తప్ప ఇంకేమీ తెలియదు.మనకు అలా కాదు.ప్రాచీన భారతీయ విజ్ఞానుల విశ్వనిర్మాణ సిద్ధాంతం ప్రకారం భూలోకానికి పైన ఏడు వూర్ధ్వలోకాలూ కింద ఆరు అధోజగత్తులూ ఉన్నాయి.ఈ ప్రతి లోకంలోనూ జీవజాతులు ఉంటాయి,ఉంటారు.మన భూమి ఉన్న లోకానికి ఈ పదమూడు లోకాల వారూ రాకపోకలు సాగించగలరు. అధోజగత్తు అన్నందువల్ల మనకన్న అధములు అనుకోవడం కాదు ,ఈ పదమూడు లోకాల లోనివారు అందరూ మనకన్న అధికులే . వారిలో ఎవరో ఒక లోకం వారు నిర్మించి ఉండవచ్చు! అసలు స్టోన్ హెంజ్కు- ఈష్టర్ ఐలాండ్స్ కు- కైలాస పర్వతానికి - ఈజిప్టు పిరమిడ్లకు...సంబంధం ఏమిటి? ఒకానొకప్పుడు మానవాళి సనాతన ధర్మమే (సనాతన విజ్ఞానమే) అనుసరించిందని...చెప్పేటందుకు ఈ సూచనా?.....

ఆధునిక విజ్ఞానశాస్త్రం సృష్టిలోని అనేకమైన కొలతలలో 11 కొలతలను (dimensions) మాత్రమే నిర్వచించగలిగింది. కానీ మర్మజ్ఞులు, కొన్ని వందలలో dimensions ఉన్నాయని, మనం వాటిని తెలుసుకోవలసి ఉందని, హిందూ యోగులు,మార్మికులు...ఈ డైమన్షన్స్ ను చాలా తెలుసుకున్నారని, అర్హులైన వారికి ఆ విజ్ఞానం బోధిస్తారని చెబుతారు. మనం నాల్గవ కొలతలో ఉన్నాం, అంటే పొడవు,వెడల్పు,ఎత్తు,కాలం అనే ఈ మూడు కొలతలలోనే మన ఇంద్రియాలు పని చేస్తాయి. (నిజానికి వ్యక్తావ్యక్త విశ్వం - బహుళ మితీయమైనది).మనకు కొద్ది దూరంలో ఉన్న వస్తువుని కదల్చాలంటే మనం అక్కడికి వెళ్ళి స్పర్శ ద్వారా మాత్రమే కదిలించగలం . అయితే అయిదవ కొలతలోకి వెళ్ళగలిగితే అక్కడికి వెళ్ళకుండానే ఆ వస్తువుని కదిలించగలం.అలాంటి దివ్యపురుషులు నిర్మించడం వల్లనే ఎల్లోరా కైలాసనాథ స్వామి ఆలయంలో తొలచిన రాళ్ళ జాడ కనబడటం లేదు, మానవులు తొలిస్తే గనక అన్ని టన్నుల రాళ్ళని ఆనవాళ్ళు లేకుండా మాయం చెయ్యడం కుదరదు. కొంతమంది సిద్ధాంతీకరించిన మానవుడి ఆధిక్యతను సవాలు చేస్తున్న ఈ దివ్య నిర్మాణాలను చూసి కూడా  సనాతన ధర్మమే అన్నిటికన్న ఉన్నతమైనదని ఒప్పుకోలేనివారిని కాలమే సమాధాన పరుస్తుంది - అది ఎంతో దూరం కూడా లేదు!

ఈ పరిశోధనలు చేస్తున్నవారు గానీ ఈ సూత్రీకరణలను చేస్తున్నవారు గానీ, పొరపాటున హిందువులై ఉంటే  ఈ దేశంలోని వారే వారిని కుళ్ళబొడిచి ఉండేవారు. మన అదృష్టం బాగుండి వాళ్ళు విదేశీయులు అయ్యారు!ఇన్నాళ్ళూ వైదిక సంస్కృతికి పుట్టినిల్లు అయిన హరప్పా  పాకిస్తానుకి పోయిందని బాధగా ఉండేది,ఇవ్వాళ కైలాసశిఖరం యొక్క గొప్పదనం తెలిశాక మనస్సు చల్లగాలికి చిన్న చిన్న అలల్ని పుట్టిస్తూ తుళ్ళింతలై నవ్వుతున్న సరస్సులా తయారైంది!

రష్యావారి పరిశోధన ప్రకారం, కైలాస పర్వతం , మనిషిచే చేయబడిన పిరమిడ్. దానికి తగ్గట్టు ఈ పర్వత ఆకారం...దాదాపుగా పిరమిడ్ ఆకారమే. ఇంతవరకు ఏ రకమైన విమానం,హెలీకాప్టర్ గానీ....కైలాస పర్వతం మీదుగా ఎగర లేక పోయాయి. బహుశ దీనికి కారణం, ఈ శిఖరం, మానవ మాతృడు చేరలేని "ఎత్తు" కావచ్చు. లేదా మరి ఏ ఇతర మార్మిక కారణాలు కావచ్చు ! దీని ఎత్తు సుమారు 30,000 అడుగులు. ఇక్కడ విమానాలు, తదితర వాహనాలకు అనుమతించిన ఎత్తు, 25 నుండి 35000 అడుగులు.

ఇక కైలాస పర్వత ప్రాంతాలలో గల మానస సరోవరం.... ఈ మానస సరోవరం ఎంతో సుందరమైనది. ఈ సరస్సు  స్వచ్ఛమైన నీటితో ఉండి, తీరానికి వచ్చేసరికి నీలి రంగులో ఉండి, సరస్సు మధ్యమంలో పచ్చ రంగులో ఉండి, బహు సుందరంగా ఉంటుంది. ప్రశాంత వాతావరణం కారణంగా ఈ సరస్సు నీరు బహు స్వచ్ఛంగా ఉంటుంది.

కైలాస పర్వతారోహణకు ప్రయత్నించేవారికి "కాలం చాలా వేగంగా గడుస్తున్నట్లు" అనుభవానికి వచ్చేదని, చెబుతారు. అయితే ధృవీకరించలేక పోయారు. ఏదో మిష్టరీ ఉంది!!!

మరి కొంతమంది పర్వతారోహకులు, తమ ప్రయాణం ప్రారంభించిన 12గంటల్లో తమ గోళ్ళు, జుట్టు పెరిగినట్లు రిపోర్టు ఇచ్చారు. ఎందుకిలా జరుగుతోంది? ఏమిటి ఈ మిష్టరీ?

కైలాస పర్వతం చుట్టూ, దాదాపు 100 చిన్న పిరమిడ్లు ఉంటూ, వాటి మధ్యలో కైలాస పర్వతం ప్రతిష్టించబడి ఉన్నది. ఒక కమలం లాగా!

హిందూ పురాణాలు, ఐతిహ్యాల ప్రకారం, ఈ కైలాస పర్వత ప్రాంతం స్వర్గారోహణకు ముఖద్వారం లాంటిది. "సటోపంత్ " ఈ ప్రాంతంలోనే ఉన్నది. తంత్ర శాస్త్రాలు, మార్మిక శాస్త్రాలు, పురాణాలు...ఈ కైలాస పర్వతాన్ని, స్వర్గానికి-భూమికి వారధిగా నిర్ణయించాయి. మహా భారతం నందలి , స్వర్గారోహణ పర్వంలో ఈ విశేషాలు కనిపిస్తాయి.

కైలాస పర్వతానికి చెందిన గొప్ప మిష్టరీ ఏమిటంటే, ఈ శిఖరారోహణ సమయంలో(శిఖరం ఎవరూ పూర్తిగా అధిరోహించలేదు...గమనించగలరు.), రెండు వారాల్లో మనిషి యొక్క వయస్సు ఎంత పెరుగుతుందో, ఆ పెరుగుదల, ఈ శిఖర అధిరోహణ కాలంలో.... 12గంటల్లోనే పెరగడం, మనలను ఆశ్చర్య చకితులను చేస్తుంది.

ఓంకార పర్వతం :

భగవంతుడున్నాడని, మనం ఈ పర్వతాన్ని చూస్తే ఖచ్చితంగా నమ్మాలి. ఈ పర్వత శిఖరాలపై మంచు "ఓం" కార రూపంలో కురుస్తుంది. ఇది బహు విచిత్రము. విశ్వ చలనా యంత్రపు మర్మర ధ్వనియే ఓంకారము కదా!.....

అలాగే,  ప్రతి సాయంకాలం, సూర్యాస్తమయ సమయానికి , కైలాస పర్వతంపై పడే నీడ "స్వస్తిక్" ఆకారంలో ఉండడం కాకతాళీయమా?

టిబెట్ యోగి మిలారేపా, మాత్రమే ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించాడని, టిబెట్ పురాణ సాహిత్యం చెబుతోంది. యోగి మిలారేపా గొప్ప తాంత్రికుడు, యోగి, కవి కూడా. బుద్ధ భగవానుని బోధనలు, జనం పాడుకునే పాటల రూపంలో అందించాడు.

కైలాస పర్వతం చేరే సామాన్య మనుజులు గానీ, యోగులు గానీ,తాత్వికులు గానీ...ఈ  ప్రాంతంలోని గహన గాంభీర్యానికి, ప్రకృతి రమణీయకతకు లోనై ధ్యాన ముద్రలో ఉండి పోతారు. వారి ఇంద్రియ వ్యాపారాలు అడుగంటి, వారిలోని పరమేశ్వర చైతన్యం ఊర్ధ్వగమిత్వం చెందే ప్రయత్నం చేస్తుంది.

ఓం నమఃశివాయ

భట్టాచార్య

(సశేషం)

కామెంట్‌లు లేవు: