23, ఫిబ్రవరి 2022, బుధవారం

ఒకరి గొప్పతనాన్ని చెప్పడానికి

 దీని సమాధానానికి పెద్ద తర్కం అవసరంలేదు. కాసింత ఇంగిత జ్ఞానం చాలు. వయస్సులు, ఆయుష్షులు సత్యాన్ని నిర్ణయించలేవు. తపస్సులే సత్యప్రతిపాదన చేయగలవు.

ప్రహ్లాదుని వయస్సు, హిరణ్యకశిపుని వయస్సు పరిశీలించండి. ఎక్కువ ఆయువు, వయస్సు ఉన్న హిరణ్యకశిపుని నాస్తికత్వం సత్యమా? అయిదేళ్ళ ప్రహ్లాదుని ఆస్తికత్వం సత్యమా? సనకాదులు, ధ్రువుడు, మార్కండేయుడు, ఉపమన్యువు... వీళ్ళందరి వయస్సులెంత? 'నఖలు వయస్తేజసాం హేతుః' - తేజస్సుకి వయస్సు హేతువు కాదు - అని భర్తృహరి సుభాషితం కూడా ఆ స్వామివారు చదువుకోలేదా?

ఎనిమిదేళ్ళ ప్రాయానికే వేదవేదాంగాల నధ్యయనం చేసిన అవతారమూర్తి ఆది శంకరులు. సిద్ధపురుషులు. నేడు విశ్వమంతా అంగీకరించిన తత్వాన్ని అందించిన జగద్గురువు. విజ్ఞానశాస్త్రం, వివేకం, - ఈ రెండూ చేసే విచారణకి నిలబడగలిగే పరిపూర్ణ సత్యాన్ని ఆవిష్కరించి, సర్వధర్మ సమన్వయం ద్వారా సంస్కృతిని పటిష్టపరచిన ఏకైక మహాత్ముడు. ఆ కారణజన్ముని సత్య ప్రతిపాదనను సుప్రతిష్ఠితం చేసిన విద్యారణ్యస్వామి, చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి దీర్ఘాయుష్మంతులు మనకు బాసటగా నిలుస్తారు.

అయితే ఆ స్వామివారు చెప్పిన ఆచార్యులు కూడా సామాన్యులు కారు. వారూ కారణజన్ములు. మహాత్ములు. సత్య ప్రాప్తికి వీరు మరో దర్శనాన్ని అనుగ్రహించారు. సాధకులకు అది ఆమోదమే. తత్పూర్వమే శంకరులు దానిని ఆమోదించారు. ఆదిశంకరులు అన్నిటినీ స్వీకరించి సమన్వయపరచి అంతిమ లక్ష్యాన్ని స్పష్టపరచిన లోకశంకరులు.

ఒకరి గొప్పతనాన్ని చెప్పడానికి ఇంకొకరిని కించపరచవలసిన అగత్యం లేదు. నిజంగా తమ సిద్ధాంతంలో బలముంటే ఎవరినీ కించపరచకుండానే ప్రతిపాదించవచ్చు. వయస్సుల్నీ, ఆయుష్షుల్నీ సత్యప్రతిపాదనకు ప్రాతిపదికగా తీసుకొనే వారి తెలివి ఏపాటిదో, కాస్త ఆలోచిస్తే మనకే అర్థమౌతుంది. అది హాస్యాస్పదం - పేలవమైన సమర్ధన.

భారతీయ ధర్మానికి పట్టుకొమ్మలైన ఆచార్యులను సిద్ధాంతాల రాద్ధాంతాలతో అవమానపరచడం ధర్మగ్లానికి హేతువౌతుంది. వాటిని గ్రహించవద్దు, గాయపడవద్దు, ఆదరించవద్దు. అదే మన కర్తవ్యం.

కామెంట్‌లు లేవు: