నేటి నుండి వైశాఖ మాసం ప్రారంభం అయిన సందర్భంగా...
ఆధ్యాత్మిక సాధనకి అద్భుతమైన మాసాలలో ఒకటి వైశాఖము. వైశాఖము, మాఘము, కార్తికము - ఈ మూడింటినీ ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు. ఏవిధంగా అయితే కార్తీక పురాణం, మాఘ పురాణం ఉన్నాయో అదేవిధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు.
ఆధ్యాత్మికంగా భగవదనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్ని విధాలా అనుకూలమైనది. సాధనా మాసంగా దీనిని నిర్వచించవచ్చు. వసంతఋతువులో రెండవ మాసం. ఇది. దీనికి వైదిక నామం మాధవ నామము. మధు అని చైత్రమాసానికి, మాధవ అని వైశాఖ మాసానికి అంటారు. వైశాఖమాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది.
వైశాఖంలో రకరకాల వ్రతాలు చెప్పారు. ఈసారి వైశాఖమాసము 01-05-2022 నుండి 30-05-2022 వరకు ఉంది. వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం నారాయణుని తులసితో ఆరాధించడం చేయాలి. ఆ తులసి కూడా కృష్ణ తులసి సమర్పిస్తే శ్రేష్టం అని ధర్మశాస్త్రం చెప్తున్నది.
విష్ణుసహస్రనామ పారాయణ వైశాఖం అంతా చాలా ప్రశస్థమైనటువంటిది.
అనునిత్యం కూడా అశ్వత్థ వృక్షానికి సమృద్ధిగా జలం పోసి ప్రదక్షిణలు చేయడం, వైశాఖం అంతా చేసినట్లయితే అభీష్ట సిద్ధి లభించడమే కాక పితృదేవతలు తృప్తి చెందుతారు అని చెప్తున్నారు.
గళంతిక ఆరాధన - శివునకు ఈ మాసమంతా అభిషేకం చేస్తే చాలా ప్రసిద్ధి. అనునిత్యం శివారాధన అభిషేకంతో చేయాలి. అది ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదైవిక తాపత్రయాలను తొలగించి మనశ్శాంతినిస్తుంది. అందుకు శాంతి కోసం శివునికి అభిషేకం చేస్తారు. శివాలయాలలో శివునకు పైన గళంతికను ఏర్పాటు చేయడం కూడా చాలా మంచిది. దీనినే ధారాపాత్ర అంటారు. నిరంతరం శివుడి మీద ధార పడేటట్లుగా ఒక పాత్రను ఏర్పాటు చేయాలి. ఇలా నేలంతా శివునిపై ధార పడేటట్లు చేసినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి వేదనలు, తాపాలు, అరిష్టాలు నశిస్తాయని ధర్మశాస్త్రములు చెప్తున్న విషయం.
వైశాఖంలో ఉదకకుంభ దానము. అంటే నీటితో నింపిన పాత్రను దానం చేయడం. బాటసారులకు చలివేంద్రములు ఏర్పాటు చేసి జలాన్ని ఇవ్వడం వైశాఖంలో ప్రసిద్ధి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి