*ప ద్య సౌ ర భం !*
భళిరాయెన్నడుజారెనీభువికి,రంభారాగిణీ రత్నమే/
,ఖలయో? నిర్జరవల్లభప్రియవధూకంఠశ్రవద్దామమో?
మలయాశాలత మారుతోల్లలిత శంపావీచికాడోలికా/
చలదుత్ఫుల్ల జలేజమాలికయొ?,చెంచత్ చెంచలాతన్వియో?
భావం:
ఔరా! ఏమీసౌందర్యము!రంభా రాగీణీత్యాది దేవకాంతల నడుముల నుండి భువికి జారిపడిన రతనాల మొలనూలా? (వడ్డాణమా)
దేవేంద్రుని పట్టపురాణి శచీదేవి మెడనుండి జారిన పారిజాత సుమమాలయా? మలయానిల చంపా డోలికలలో నూయలలూగు విరసిన పద్మమాలయా!
ఆకాశమున చమక్కున మెఱయు మెఱపుతీగెయా? ఎవరీమె?
"ఇంతకీ యెవరీమె? అలనాటి యందాల తార మల్లీశ్వరి (భానుమతి) నవరస భరితమైన యీచిత్రంలో ఒక రసవద్ఘట్టంకోసం యీపద్యం రచింపబడింది. రచయిత;యెవరు?
కృష్ణశాస్త్రి యని కొందరు, కాదుకాదు, మల్లాది రామకృష్ణశాస్త్రియని కొందరూ వాదులాట!
ఇరువురిలో నెవరూకిమ్మనరు.
ఎలావివాదం తెగేది? పోనీండి. సందర్భం తెలిసికొందాం.
రాయలుపాలించేకాలంలో జరిగినకథ! మల్లీశ్వరీ, నాగరాజులు బావా, మరదళ్ళు. చిన్నపుడి నుండీ ప్రేమతో పెనవేసికొన్నది వారి బంధం.
ఒకనాడాజంట సంతకు పోయివస్తూ, వర్షం కారణంగా,
ఒకసత్రంలో ఆగిపోయారు. కుర్రజంట, వారిసరదాలు వేరు. బావకోసం ఆమె "పిలచినబిగువటరా?" అనిపాడుతూ నాట్యం చేయసాగింది. అప్పుడే మారువేషంతో వచ్చిన రాయలు,ఆ పల్లెటూరిపిల్ల పాటకూ, ఆటకూ ముగ్ధుడైపోయాడు. నాట్యానంతరం రాయల వెంట వచ్చిన నంది తిమ్మన గారు ఈపద్యాన్ని ఆశువుగా చదువుతారు. రాయలాజంటను సత్కరిస్తాడు. ఇదీ పద్య సందర్భం!
కఠినపదాలకు అర్ధం:
భళిరా? -ఆశ్చర్యార్ధకం-ఔరా!
మేఖల-వడ్డాణము.నిర్జరవల్లభప్రియ-ఇంద్రునిభార్యశచీదేవి;
కంఠశ్రవద్దామమో-మెడనుండిజారిపడినపూమాలయా?
మలయాశ-దక్షిణదిశ; మారుతము-గాలి;ఉల్లలిత-మిగులనందగించిన;
శంపావీచికాడోలికా-మెరపుతీగెలఊయలలో; చలత్-కదిలే;
ఉత్ఫుల్ల-బాగుగావిరసిన;
జలేదమాలికయొ-పద్మమాలయా? చలత్-కదలాడే; చంచలా తన్వియో- మెరపుకన్నియయా?
మహాకవుల రచనలను మరల మననం చేయాలి. అప్పుడు దాని సారం, వంటబడుతుంది.
స్వస్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి