10, జులై 2022, ఆదివారం

వైద్యో నారాయణ

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

వైద్యో నారాయణ: 


సుధా నర్సింగ్ హోమ్ లో అడుగు పెట్టారు గుర్నాధం గారు.

రెండు రోజుల నుండి కొంచెం బాధ గా  ఉంది..డాక్టర్ ని కలిస్తే మంచిదని వచ్చాడాయన.. డాక్టర్ పరాంకుశం పేరున్న డాక్టర్..కానీ జనాల్ని పీడించుకు తింటాడని మహా చెడ్డ పేరు...


వైద్యం మటుకు  చాలా బాగా చేస్తాడు..మంచి పేరుంది ఆ విషయం లో...


డాక్టర్ గారి రూం లోనికి అడుగుపెట్టారు గుర్నాధం గారు.


"నమస్తే ..రండి.. ఇక్కడ కూర్చోండి.. ఇప్పుడు చెప్పండి ఏమిటి మీ సమస్య..? "


"నాకేం కాలేదు .బాగానే ఉన్నాను.. కానీ ఎందుకో బాధ గా ఉంది.."


"ఎక్కడ నొప్పి ??"


"చెప్పలేను సరిగ్గా ..."


"అలా అయితే ఐదారు టెస్టులు చేయిద్దాం.. అప్పుడు తెలుస్తుంది..."


"నా సమస్య  నాకు వచ్చింది కాదు.."


"మరి ?? "


"సమాజం లో ఇలా అవినీతి పేరుకు పోవడం చూసి బాధ గా ఉంది.. సమాజానికి ఏమైనా టెస్టులు  చేయించండి .. "


"మీకేమైనా మతి పోయిందా ? మీరు రావలసిన చోటు ఇది కాదు..  ప్రజా సమస్యలను పరిష్కరించ డానికి ముఖ్య మంత్రిని , లేదా ఇతర మంత్రులను కలవండి.. మీరు వెళ్ళండి.. నాకు చాలా పేషంట్స్ ఉన్నారు.. వాళ్ళను చూడాలి.."


"అలాగే.. వెళ్ళే ముందు ఒక్క మాట.. నేను , నువ్వు కూడా ఈ సమాజం లో భాగమే.. నేను ఉపాధ్యాయుడిగా పని చేసి పదవీ విరమణ చేశాను.. నువ్వు..అదే మీరు..."


"భలే వారే.. మీరు నా కంటే చాలా పెద్ద వారు.. నువ్వని పిలవండి పరవాలేదు.."


"మంచిది నాయనా..  ఇప్పుడు నేను వెళ్లి పోతాను.. అందరూ నీలాంటి అదృష్టవంతులు కారు..చాలా మంది శాపగ్రస్తులు..వాళ్ళను దేవుడిలా కాపాడే బాధ్యత నీదే..

... ఇప్పుడు నువ్వు చూడబోయే పేషంట్స్ లో ఉన్న పేద వాళ్ళను రోజుకు ఇద్దర్ని ఏం ఫీజు లేకుండా, నువ్వే అన్నీ ఖర్చులు భరించి టెస్టులు చేయించి ట్రీట్మెంట్ చేయించు.. ఇలా వారం రోజులు చెయ్యి.. నేను వారం తరువాత మళ్లీ వస్తాను.. అప్పుడు మాట్లాడుదాం..నీకు నచ్చితేనే.. మంచిది అనిపిస్తేనే చెయ్యి.. బలవంతం ఏం లేదు... నువ్వు ఫీజు తీసుకో నంత మాత్రాన పేద వాళ్ళ జీవితాలు మారవు.

కానీ వాళ్లకు అంధకారంలో ఆశాకిరణం కాగలవని మాత్రం చెప్ప గలను.."ప్రతి రోజూ చావుని దగ్గర గా చూసే  డాక్టర్లు ..మీరే ఆస్తులు పోగేసుకుంటుంటే నాకు విచిత్రం గా ఉంది.. మీ డాక్టర్లకే  వైద్యం చేయించాలి బాబూ.. ఏమనుకోకు .. "


వెళ్లి పోయారు గుర్నాధం గారు.


డాక్టర్ పరాంకుశం ఆలోచనలో పడ్డాడు అయిదు నిముషాల పాటు.. 


ఎవరీ ముసలాయన ?? పిచ్చి వాడు కాదు గదా..

 సమాజం, అవినీతి, ఆశాకిరణం , ఆస్తులు .. పోగేసు కోవటం ..అంటూ  పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు... 

ఆయనను చూస్తే కోపం రావటం లేదు .

గౌరవం కలుగు తోంది.. తను బోలెడు సంపాదించాడు.. నర్సింగ్ హోమ్ కట్టుకున్నాడు... రెండు మేడలున్నాయి.. హైదరాబాద్ శివార్లో నాలుగెకరాల భూమి ఉంది.. బ్యాంక్ బ్యాలన్స్ 4-5 కోట్లు పైనే ఉంటుంది..

ఇప్పుడు తన వయసు 50 యేళ్లు.. ఉన్న ఒక్క అబ్బాయి కూడా ఎండీ చేశాడు.. అమెరికా లో ఉన్నాడు .. తను, భార్య పంకజం ...మాత్రమే ఇక్కడ... 


కొడుకు , కోడలు అమెరికా లోనే సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ.. తాము బ్రతికి ఉండగా ఇండియా వస్తాడో రాడో తెలియదు... నిజంగానే  తనకు జబ్బు చేసిందా ?? 

వైద్యం చేయించుకోవాలా  ?? 


ఏమిటీ ఆలోచనలు.. ?


బెల్ నొక్కాడు.. తరువాతి పేషంట్ కోసం..


ఒకావిడ చిన్న పాపని తీసుకు వచ్చింది.. నిన్నటి నుండి జ్వరం డాక్టర్ గారు... కంగారుగా ఉంది..


"ఏం పరవాలేదు ..తగ్గి పోతుంది.. ఊళ్ళో వైరల్ జ్వరాలు ఉన్నాయి.."


"ఇవిగో ఈ మందులు ఇదే క్లినిక్ లో ఉన్న మందుల షాపు లో తీసుకోమ్మా.. మళ్లీ మూడు రోజుల తరువాత వచ్చి చూపించు.. తగ్గిన తరువాత బలమైన ఆహారం పెట్టు..తొందరగా కోలుకుంటుంది అమ్మాయి...."


"కూలీ నాలీ చేసుకునే వాళ్ళం బాబు.. తిండి దొరకడమే గగనం.. మంచి తిండి తినే భాగ్యం మాకు లేదు.."బాధ తో చెప్పింది..


డాక్టర్ బెల్ కొట్టాడు.. బోయ్ రాగానే చెప్పాడు.. "ఈవిడ దగ్గర తీసుకున్న 300 రూపాయల ఫీజు తిరిగి ఇచ్చేయండి.. అలాగే మన మందుల షాపులో మందులు కూడా డబ్బులు తీసుకోకుండా ఇవ్వమని గంగాధర్ కి చెప్పు..నాతో ఫోన్లో మాట్లాడ మని చెప్పు..నేను చెప్తాను.."


"అలాగే సర్.. " నమస్కారం చేసి.. "మీరు రండమ్మా నాతోబాటు. ..".వచ్చినావిడ వంగి వంగి దండం పెడుతూ  బయటకు వెళ్ళింది..


డాక్టర్ పరాంకుశం ఆశ్చర్య పోయాడు.. తనలో వచ్చిన మార్పుకు.. ఏదో తెలియని ఆనందం... రూం బయట ఉండే బాయ్ నమస్కారం చేయడం చిత్రంగా అనిపించింది...  వాడెప్పుడూ ఉదయం వచ్చినప్పుడు మాత్రమే అలా పెడతాడు.. 


బెల్ నొక్కాడు..మరో పేషంట్..


ఖరీదయిన పేషంట్ లా ఉన్నాడు.. వేళ్లకు రవ్వల ఉంగరాలు ఉన్నాయి... చెప్పండి..


"డాక్టర్ గారూ.. నాకు కొంచెం అజీర్తి గా ఉంది..రెండు రోజుల నుండి..తిన్నది అరిగినట్లు లేదు.. కాస్త మంచి మందు ఇవ్వండి.అలాగే తగ్గిన తరువాత మళ్లీ బాగా ఆకలి వేయటానికి .. ""


"అలాగే.. ఇక్కడ ఈ బెడ్ మీద పడుకోండి.. కాస్త చూస్తాను.."


"ఈ మాత్రలు మూడు రోజులు వేసుకోండి ..రెండు పూటలా..తగ్గిపోతుంది ..మళ్ళీ రానక్కర లేదు..."


అలాగే డాక్టర్ గారు.. వెళ్ళిపోయాడు అజీర్తి పేషంట్ ..


ఆకలి మంటలు ఒక వైపు..

అన్నపు రాశులు ఒక వైపు..  


ఒక మంచి కవి రాసిన మంచి పలుకులు గుర్తొచ్చాయి డాక్టర్ కి..


ఆ పూట ఇంకో పది మంది పేషంట్స్ ని చూసాడు డాక్టర్..అందరూ  కాస్తో కూస్తో డబ్బున్న వాళ్లే.. ఫీజు ఇస్తున్నాం కదా ఎవరి కోసం చేస్తాడీ డాక్టర్ అనే భావన తో ఉన్నట్లు అనిపించింది... మొదటి సారి బాధనిపించింది...


సాయంత్రం 5 గంటలకు మళ్ళీ నర్సింగ్ హోమ్ కి వచ్చాడు డాక్టర్..

పది మంది  పేషంట్స్ ఉన్నారు.. అందర్నీ చూసాడు.. దాదాపు అందరూ పేద వాళ్లే... ఏ రోజుకారోజు కూలి డబ్బులు సంపాదించే వాళ్లే.. ముసలాయన మాటలు గుర్తుకు వచ్చాయి... వాళ్ళెవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదు.. మామూలు మందులు కూడా ఫ్రీ... మరీ ఖరీదు అయినవి అయితే  మూడొంతులు తగ్గించి ఇవ్వగలిగిన వాళ్ల దగ్గర తీసుకున్నాడు.. 


అందరూ వెళ్లిన తరువాత మెడికల్ స్టోర్ గంగాధర్ వచ్చి చెప్పాడు..ఈ రోజు 12 వేల రూపాయల మందులు ఫ్రీ గా ఇవ్వాల్సి వచ్చింది...


"పరవాలేదులే .. లెక్కలు అన్నీ సరిగ్గా రాసి ఉంచు..తరువాత చూస్తాను.. "చెప్పాడు డాక్టర్...


బయట రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి వచ్చింది.. "ఉదయం నుండి ఇప్పటికి 18 మంది దగ్గర డబ్బులు తీసుకున్నాం.. 12 మంది దగ్గర అసలు తీసుకోలేదు.. డాక్టర్  ""


"పరవాలేదు... రోజూ నేను చెప్పినట్లే చేయండి..."


"అలాగే డాక్టర్ గారూ .."వెళిపోయింది..


ఆ రోజు చాలా సంతోషంగా ఉంది..  రాత్రి 8 గంటలకు తను, పంకజం కారులో బయటకు వెళ్లారు..  ముందు హిమాయత్ నగర్ లోనున్న వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.. మొదటి సారి స్వామి వారు తనకు కొత్తగా కనబడ్డారు..ఎందుకో..


గుడి బయట ఉన్న ముష్టి వాళ్లకు డబ్బులిచ్చి  మరీ చెప్పాడు.. ఒరేయ్.. మీకు వైద్యం కావాలంటే మా నర్సింగ్ హోమ్ కి రండి..ఊరికే చూస్తాను.. 


అలాగే బాబూ.. ధర్మ ప్రభువులు..


భార్య పంకజానికి మాత్రం భర్త లో వచ్చిన మార్పు బాగుంది..  


గుడి నుండి దగ్గరలో మినర్వా హోటల్ కి వెళ్ళారు..

రెండు కాఫీ మాత్రమే తాగారు.. సర్వర్ కి టిప్ మాత్రం 50 రూపాయలు ఇచ్చాడు.. ఎప్పుడూ భర్త టిప్ ఇవ్వడం చూడలేదు పంకజం..


ఆ రాత్రి డాక్టర్ కి బాగా నిద్ర పట్టింది ... కలలో దేవుడు ఏదో అంటున్నాడు.. సరిగ్గా అర్థం కాలేదు..

మరుసటి రోజు ఉదయం నర్సింగ్ హోమ్ కి వెళ్ళాడు.. తిరునాళ్ల లా ఉంది నర్సింగ్ హోమ్.

 చాలా మంది పేద వాళ్ళు వచ్చారు.. ఆ రోజు రాబడి ఇంచు మించు సున్న..

ఆలోచించాడు.. ఇలా కాదు.. ఏదో చెయ్యాలి..


రోజుకు యాభై మందికి టోకెన్లు ఇవ్వడం మొదలు పెట్టాడు.. ఫ్రీ గా వైద్యానికి..మందులకు.. 


సుధా నర్సింగ్ హోమ్ పేరు మారు మోగి పోయింది.. డాక్టర్ ని ఆకాశానికి ఎత్తేశారు పత్రికల వాళ్ళు.. టీవీ వాళ్ళు ఇంటర్వ్యూలు.. మార్పుకు కారణం అడిగారు...ఏం చెప్పాలో తెలియలేదు..మా అబ్బాయి వలన నేను ఇలా మారాను.. చెప్పాడు చటుక్కున..


అమెరికా లో ఉన్న కొడుకు చూసాడు ఆ టీవీ ఇంటర్వ్యూ.. తల్లే కొడుక్కి చెప్పింది చూడమని..


ఆ రాత్రి ఫోన్ చేశాడు తండ్రికి.. 

డాక్టర్ చెప్పాడు.. "నువ్వెలాగూ  ఇక్కడకు రావు..మేము అక్కడకు రాలేము.. మా బ్రతుకులు ఇక్కడే .. ఈ ఆస్తులు ఎవరి కోసం.. సంపాదించింది చాలు.. ఇంకా వద్దనుకుంటున్నాను.. మాకు ఉన్నది చాలు... నీకు కావాలంటే చెప్పు,.. మళ్లీ సంపాదిస్తాను .."


"వద్దు నాన్నా... నువ్విలా పేరు తెచ్చుకుంటే నాకు గర్వంగా ఉంది.. నీ పక్కనే ఉండాలని ఉంది.. "


"సరే లే.. జాగ్రత్త.. కోడల్ని అడిగినట్లు చెప్పు.. పిల్లల్ని చూడాలని ఉంది..దసరా పండక్కి రావటానికి ప్రయత్నం చెయ్యి..." చెప్పాడు కొడుక్కి..

కొడుకు సమాధానం చెప్పలేదు..


ఆ రాత్రి తల్లీ కొడుకులు చాలా సేపు మాట్లాడు కున్నారు.. నాన్న యజ్ఞం చేస్తున్నారు రా... ఒక్కరే... 


వారం రోజులు గడిచాయి.. 


అంతకు ముందు వచ్చిన ముసలాయన మళ్లీ వచ్చాడు నర్సింగ్ హోమ్ కి..  అక్కడ ఉన్న స్టాఫ్ కి తెలుసు ఆయన వచ్చిన తరువాత డాక్టర్ గారు మారారని.. అలాగే తమందరకీ మంచి పేరు వచ్చిందని.. ఆయన రాగానే అందరూ లేచి నుంచుని గౌరవం వ్యక్తం చేశారు.. డాక్టర్ రూం లోనికి ముందు పంపారు...


ఆయన రాగానే గుర్తు పట్టాడు డాక్టర్ పరాంకుశం ..వెంటనే లేచి నమస్కారం చేశాడు .. మీ వలన నేను మారాను .. మీరెవరో నాకు తెలియదు.. నన్ను మళ్ళీ మనిషిని చేసినందుకు ధన్యవాదాలు... వంగి దండం పెట్టాడు..


ముసలాయన .. నూరేళ్ళు వర్ధిల్లు నాయనా.. నాకు ఇప్పుడు చాలా సంతోషం గా ఉంది.. వెళ్ళొస్తాను.. డాక్టర్ మాట్లాడే లోపల వెళ్లి పోయాడు.. 


ఆయన వెళ్తూ వెళ్తూ రిసెప్షన్ లో ఏదో కాగితం ఇచ్చాడు.. డాక్టర్ కి ఇవ్వమని చెప్పి.. 

అప్పుడే డాక్టర్ దగ్గర నుండి వచ్చినాయన ఈ కాగితం అక్కడే ఇవ్వచ్చు కదా... అర్థం కాలేదు వాళ్లకు..


డాక్టర్ ఆ కాగితం చదివాడు..


 "ఒరేయ్ గుర్నాధం.. ఎలా ఉన్నావు ?"నేను బాగానే ఉన్నాను పైపైన.. లోపల ఏం బాగో లేదు.. ఉన్న ఒక్క కొడుకుని డాక్టర్ చేశాను..నీకు తెలుసు... మా ఆనందానికి అంతు లేదు వాడు డాక్టర్ అయినప్పుడు.


ఇప్పుడు నర్సింగ్ హోమ్ కూడా కట్టాడు.. వాళ్ళ అమ్మ పేరు పెట్టాడు.. సుధా నర్సింగ్ హోం... కానీ తల్లి మంచి తనం రాలేదు.

డబ్బు సంపాదన లో పడ్డాడు.. పేద వాళ్ళను కూడా వదలటం లేదు.. వాడు చేస్తున్న పని దేవుడికి కూడా నచ్చ లేదు..సుధని తీసుకు వెళ్లి పోయాడు..వాడికి  ఉన్న ఒక్క కొడుకు.. అదే నా మనవడు అమెరికా వెళ్లి పోయాడు.. వాడితో నేను కూడా ఉండలేక మా ఊరు.. ఉండ్రాజ వరం వచ్చేశా..సొంత ఇంట్లో నే ఉంటున్నా ఒక్కడినే..నేను.. నీ చెల్లెలు  సుధ మూడేళ్ల క్రితం వెళ్లి పోయింది.. నేను ఒంటరిని.. నా కొడుకు ఒంటరి.. మనవడు ఒంటరి... కొడుక్కి చెప్పినా వింటాడని నాకు నమ్మకం లేదు.

 ఉన్న తేలికయిన బంధం కూడా తెగి పోతుందేమో నన్న భయం నన్ను మాట్లాడ నివ్వ లేదు.. చిన్న నాటి స్నేహితుడవు నీకయినా నా బాధ చెప్పుకోలేక పోతే ఎలా.. అందుకే ఇలా ఉత్తరం రాస్తున్నాను.. ఫోన్ చేసి నీతో మాట్లడ లేను.. పొలాలు చూసుకోవాలనే నెపం తో కొడుకు దగ్గర నుండి వచ్చేసాను.. నీ చెల్లెలి పిలుపు వచ్చే లోపల మా వాడు మారితే బాగుండును..

మీరంతా క్షేమమని తలుస్తాను..


ఉంటాను..

నీ బాల్య మిత్రుడు


సుబ్బరామయ్య.


 

డాక్టర్ పరాంకుశం చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు..కళ్ళు తుడుచు కోవటం కూడా మరచి పోయాడు.. చూస్తున్న  స్టాఫ్ ఏం మాట్లాడలేక పోయారు..


రాత్రి భార్య పంకాజానికి అంతా చెప్పాడు వివరంగా ...ఉదయమే నాన్న దగ్గరకు వెళ్ళాలని..

ఉదయమే లేచి బయలు దేరారు.. కారెక్కబోతుంటే ఇంకో కారు వచ్చి ఆగింది. అందులో నుండి కొడుకు , కోడలు, మనవరాళ్లు దిగారు.. సంతోషం పట్టలేక పోయారు.. మిమ్మల్ని చూడాలని అనిపించింది నాన్నా.. దసరా వరకూ ఆగ లేక పోయాను.. 


అప్పుడే ఇంకో పాత కారు వచ్చి ఆగింది... దాంట్లో నుండి తండ్రి, ఆ ముసలాయన దిగారు..


పరాంకుశం , అతని భార్య పంకజం ఆ ఇద్దరి కాళ్ళకు దండం పెట్టారు..


లేరా.. లే.. నువ్వు మారుతావను కోలేదు.. వీడు నా స్నేహితుడు.. గుర్నాధం... స్కూలు మాస్టరు గా చేసి రిటైర్ అయ్యాడు.. పిల్లలను బాగు చేయటమే వీడి పని.. అంటూ ఆ ముసలాయన జబ్బ మీద ఒకటిచ్చాడు చిన్నగా..


పిల్లల్ని కాదు.. ఈ తాతయ్య మమ్మలని కూడా మార్చాడు..  ఫోన్ లో ఆయన మాట్లాడిన విషయాలన్నీ చెప్పాడు  పరాంకుశం కొడుకు.. మేము తిరిగి వచ్చేశాం నాన్నా.. అమ్మమ్మ తోటే ఉంటాం.. అదే సుధా నర్సింగ్ హోమ్ లో డాక్టర్లు గా..

 అమ్మ కూడా చెప్పింది నువ్వు యజ్ఞం చేస్తున్నావని..వీలుంటే అన్నీ సర్దుకుని వచ్చేయండి.. లేకపోతే మేం పోయిన తరువాతనే రండని చెప్పింది అమ్మ..

 అమ్మ ఎప్పుడూ ఏమి అడగలేదు.

 అందుకే  అమ్మ మాట మీద గౌరవం ఉండి వచ్చేశాం.. ఇండియాకి.. పూర్తిగా...


ఆ రోజు నుండి సుధా నర్సింగ్ హోం తెలియని వాళ్ళు లేరు....


ప్రతి డాక్టర్ తలచుకుంటే ఒక సుధా నర్సింగ్ హోమ్ ప్రతి వీధి లో ఉండి తీరుతుంది.. 


ముసలాయన మాత్రం తనకు వస్తున్న పెన్షన్ డబ్బులను ప్రతి నెలా డాక్టర్ పరాంకుశానికి ఇస్తూనే ఉన్నాడు.... దేవుడి తలంబ్రాలలో కలిపే ముత్యాల్లా.. ఆ డబ్బులను తన డబ్బులతో కలిపి ప్రజా సేవ చేస్తూనే ఉన్నాడు కొడుకుతో కలిసి డాక్టరు పరాంకుశం ... 

మునుపెన్నడూ అంత ఆనందం కలగ లేదు .

వెతుక్కుంటే ఆనందం కూడా మన పక్కనే ఉంటుందని తెలిసింది పరాంకుశానికి మొదటి సారిగా..

 


- కోసూరి లక్ష్మణ రావు

సేకరణ:  శర్మద గారి వాట్సాప్ పోస్ట్ 


💐💐🌺🌺🌸🌸

కామెంట్‌లు లేవు: