5, ఆగస్టు 2022, శుక్రవారం

*ఫల ప్రదో భవేత్ కాలే....*

 ఇది కథా…నిజమా…?


          *ఫల ప్రదో భవేత్ కాలే....*


*"విశాఖపట్టణం నుండి పలాసపోవు ప్యాసింజర్ మరి కొద్ది సేపట్లో 5వ నెంబర్ ప్లాట్‌ఫాం నుండి బయలు దేరుటకు సిద్ధంగా ఉంది" అని మైకులో వినబడుతుంటే రామనాథం మాస్టారు గబగబా పరుగెత్తి వెళ్ళి రైల్లో కూర్చున్నారు.


*రామనాధంగారు రిటైర్ అయిన సంస్కృత ఉపాధ్యాయుడు. విజయనగరం మహారాజా వారి సంస్కృత కళాశాలలో పనిచేసారు; ఎందరో విద్యార్థులకు విద్య గరపారు. మంచికి మారుపేరుగా అందరూ చెప్పుకుంటారు ఆయన్ని గురించి. ఎందరో పేద విద్యార్థులకు చేయూత నందించిన వ్యక్తిత్వం ఆయనది.


*రైలు వేగం మెల్లమెల్లగా పెరుగుతుంటే ఆయన మనసు గతం లోకి పరుగులు పెడుతోంది. చాలా రోజుల తరువాత తన పుట్టినూరికి వెళ్తున్నాడు. తమ ఊరి పొలాలు, చెరువు గట్టు, శివుడి కోవెల, తను చదివిన బడి.. అన్నీ గుర్తొస్తున్నాయి. తన చిన్ననాటి తెలుగు మాస్టారు చెప్పిన "చేసిన మేలు ఊరకన్ పోదు" అనే మాట ఇప్పటికీ చెవుల్లో వినబడుతోంది. ఆ మాటే తనని ఉన్నతమైన వ్యక్తిగా సమాజంలో నిలబెట్టింది.


*రైలు విజయనగరం చేరుతోంది. ఎవరో భిక్షగాడు "జీవము నీవే కదా..దేవా" అని పాడుకుంటూ వస్తున్నాడు. రాంనాథం గారు ఒక ఐదు రూపాయల బిళ్ళ అతని చేతిలో పెట్టారు.


*రైలు విజయనగరంలో ఆగింది. రామనాథం గారు ఓమాటు రైలు దిగారు. ఆ రోజు దినపత్రిక కొని, మళ్లీ రైలెక్కారు. పేపరు చదువుతుండగా వినబడింది.. "టికెట్ టికెట్" అని! తల త్రిప్పి చూశారు. ఎదురుగా రెండు మూడు వరసల ముందునించి టికెట్‌లు తనిఖీ చేస్తూ వస్తున్న అధికారి కనబడ్డాడు. రాంనాథం గారు లేచి నిల్చున్నారు. టికెట్ తీసుకుందామని తన లాల్చీ జేబులో చెయ్యిపెట్టారు. జేబు ఖాళీగా చేతికి తగిలింది!


*మాస్టారుగారికి దిక్కు తోచలేదు. "పర్సు ఏమైంది?! తన పర్సులోనే పెట్టుకున్నాడే, డబ్బులు టికెట్ కూడానూ?! పర్సు జేబులో లేదు!" రెండు జేబులూ తడుముకొని చూసుకున్నాడు. రెండూ ఖాళీనే! దేవుడా, ఏం చేసేది?.. టికెట్ లేదు; డబ్బులు లేవు. వెళ్లేది అమ్మాయి పెండ్లికి!.


*రామనాధం గారికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. టికెట్.. టికెట్..' శబ్దం ముందు ముందుకు వస్తోంది.


*'నాకు ఎప్పుడూ ఇలాంటి పరిస్ధితిరాలేదు: ఈ వయస్సులో ఇంతమంది ముందు దోషిగా నిలబడతానే, ఏం చేసేది?" రామనాథం గారి మనసు పరిపరివిధాల పోతోంది.. "విజయనగరంలో దిగి పేపరు కొన్నాను. గాబరాగా పర్సు జేబులో పెట్టుకొని రైలెక్కేసాను.. బహుశా అప్పుడే అది బయట పడిపోయి ఉంటుంది. ఇప్పుడెలాగ?" రామనాధంగారి కళ్ళు మూసుకుపోయాయి.


*"టికెట్..టికెట్..." శబ్దం మరింత దగ్గరకు వచ్చింది.. తన ఎదురుగా ఉన్నవాళ్లని ప్రశ్నిస్తోంది. రామనాథం గారికి చెమటపడుతోంది.


*"ఇప్పుడు ఏం చేయాలి? చేతిలో నయాపైసా అయినా లేదు.. తెలిసిన వాళ్ళుకూడా ఎవరూ లేరు ఈ రైల్లో.." రాంనాథం గారు తలవంచుకుని కూర్చున్నారు. "టికెట్.. టికెట్.." శబ్దం తన పక్క వారిని ప్రశ్నిస్తోంది.......'పరీక్షలో‌ జవాబులు తెలియని ప్రశ్నలకు సమాధానాలు రాసే విద్యార్థిలాగా ఉంది రాంనాధం గారి పరిస్థితి. "జీవితంలో ప్రతివాడూ ఎల్లప్పుడూ విద్యార్థే......" తాను పిల్లలకు చెప్పిన మాటలు తనకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. "తనూ ఇప్పుడో 'అర్థే'.." రామనాధం గారు ముడుచుకు పోతున్నారు.


*"ఏమండీ.. మీ టికెట్ చూపిస్తారా?" ఆ గొంతు తననే ప్రశ్నిస్తోంది.. రాంనాథం గారు తటాలున లేచి నిల్చున్నారు. అతని వేపు చూసారు.. ఒక్క క్షణం నిశ్శబ్దం…


*ఏం చెప్పాలో పాలుపోలేదు..

"ఏమని చెప్పను?.. టికెట్ లేదనేదా?.. నన్ను జైల్లో పెట్టమనేదా?.."


*రైల్వే అధికారి ఏదో అంటున్నారు. రాంనాధం గారికి అది సగం సగమే వినబడుతున్నది.. "నమస్కారం మాస్టారూ, నేను మీ దగ్గర చదువుకున్న గోపాల్‌ని. గుర్తున్నానో లేదో.. నాకు మీరు చాలా సార్లు సాయం చేసారు. విజయనగరంలో రైలు ఎక్కబోతుంటే నాకు ఒక పర్సు దొరికింది. 'ఎవరిదా' అని చూస్తే దానిలో మీ ఫోటో ఉంది.. అక్కడినుండీ నేను మీ కోసమే వెతుక్కుంటూ వస్తున్నాను.


*ప్రస్తుతం రైల్వేలో టి.టి.యీ. గా పనిచేస్తున్నాను మాస్టారూ. ఇంతకాలం తర్వాత మిమ్మల్ని కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది....ఇదిగోండి, మీ పర్సు తీసుకోండి.. ఇందులో టికెట్ కూడా ఉంది" అని పర్సు అందించి, రాంనాథం గారికి గౌరవంగా నమస్కరించాడు గోపాల్.


*రాంనాథం గారి సంతోషానికి అవధులు లేవు. తన పర్సు దొరకడం ఒక వంతు అయితే, తన విద్యార్థి ప్రయోజకుడై తన ముందు నిలబడి ఉండటం మరొకటి. రాంనాధం గారు ఆలోచనల్లో ఉండగానే గోపాల్ చెబుతున్నాడు.. "మీరు మాకు ఎన్నో నీతి శ్లోకాలు చెప్పారు, అందులో ఒకటి ఇప్పటికీ గుర్తుంది:


*యథా బీజాంకుర: సూక్ష్మ: ప్రయత్నేన అభిరక్షిత:।

ఫలప్రదో భవేత్ కాలే-తద్యల్లోకో సురక్షిత:॥


*విత్తనం‌ నుండి వచ్చిన మొలక చాలా చిన్నది. అయినా దానిని మనం నీరుపోసి జాగ్రత్తగా రక్షిస్తే, అది పెరిగి పెద్దదై, సరైన సమయంలో మనకు ఫలాలను అందిస్తుంది. ఈ లోకం కూడా అలాంటిదే. మనం తోటి వారికి చేసిన సాయం వృధా పోదు. ఏదో ఒకనాడు అది మనకు సహాయమై తిరిగి వస్తుంది.' అని మీరు ఎన్నోసార్లు చెప్పారు. మేము మీ దగ్గర పెరిగిన పూల మొక్కల లాంటి వాళ్లమే. నమస్కారం. నేను వెళ్ళొస్తాను, అని వెళ్లి పోయాడు.


*"పుస్తక జ్ఞానాన్ని, జీవిత పాఠాలు చెప్పిన గురువులు అందరికీ శుభ నమస్సులు"

                                               

            సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

                     🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏

సేకరణ.

కామెంట్‌లు లేవు: