శ్లోకం:☝️
*స చ నిత్యం ప్రశాంతాత్మా*
*మృదు పూర్వంతు భాషతే |*
*ఉచ్య మానోపి పరుషం*
*నోత్తరం ప్రతిపద్యతే ||*
భావం: అయోధ్యాకాండ తొలి సర్గలో రాముని గుణగణాల వర్ణన. శ్రీరాముడు మానవుడుగా జన్మించి మానవులలో తప్పక ఉండవలసిన కొన్ని గుణములను ప్రదర్శించినాడు.
అతడు నిత్యమూ ప్రశాంతమగు మనసు కలవాడు. ఆతని మనసులో ఎన్నడునూ కామముగాని , క్రోధము గాని , లోభము గాని చోటు చేసుకొనవు. అందుకే నిశ్చలముగా ఉండును. మనసున ప్రశాంత స్థితి కలిగి ఉండుట మానవునకు ప్రధానముగా ఉండవలెను.
రెండవది శ్రీరాముడు ఎల్లప్పుడూ ఎదుటివారి మనసునొప్పించకుండ వినుటకు ఇంపుగా సుకుమారముగా , మధురముగా మాట్లాడేవాడు. ఎవరైనా తనను గూర్చి పరుషముగ మాటలాడినా కూడా దానికి బదులు చెప్పేవాడు కాదు. బదులు చెప్పక పోవుట సమాధానము చెప్పే శక్తి లేక కాదు. ప్రశాంతమైన మనసు కలవాడు అగుటచే ఎదుటివారు మాట్లాడిన మాటకు ఆతని మనసున కోపము కలిగేదికాదు. కోపము కలిగిన నాడు మాట పరుషముగా వచ్చును. ఆతనికి కోపమే రాకపోవుటచే పరుషమైన మాట వచ్చేదికాదు. ఎవరైనా పరుషమైన మాటలు ఆడిననూ వారితో మృదువుగా మాట్లాడేవాడు గాని పరుషముగా మాట్లాడేవాడుకాదు.
ఈస్థితిని మానవులు అలవరచుకోవలెను అని భావం.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి