31, ఆగస్టు 2022, బుధవారం

నేను లేకపోతే

 *నేను లేకపోతే?*


అశోక వనంలో రావణుడు సీతమ్మ వారి మీదకి కోపంతో కత్తి దూసి ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడు అనుకున్నాడు 'ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని  రావణాసురుని తలను ఖండించాలి' అని


కానీ మరుక్షణంలోనే హనుమంతుడు  మండోదరి రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు! 


హనుమంతుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. 'నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతను ఎవరు రక్షించే వాళ్ళు అని భ్రమలో నేను ఉండేవాడిని' అనుకున్నాడు హనుమంతుడు! 


బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం,  'నేను లేకపోతే ఎలా?' అని. 

అయితే ఇక్కడ ఏం జరిగింది చూద్దాం... 


సీతామాతను రక్షించే పనిని, ప్రభువు రావణుని యొక్క భార్యకు అప్పగించాడు. 


అప్పుడు హనుమంతుడు కి అర్థమైంది  'ఎవరి ద్వారా ఏ కార్యాన్ని  చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు' అని. 

**

మరింత ముందుకు వెళితే త్రిజట 'తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుంది. అది లంకను కాల్చివేస్తుంది..దాన్ని నేను చూశాను.' అని చెప్పింది. 

అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. 


అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు తను ఇప్పుడు ఏం చేయాలి ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకున్నాడు. 

*

హనుమంతుని చంపడానికి రావణుని సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమి చేయలేదు. అలా నిలబడ్డాడు. 

అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి 'అన్నా! దూతను చంపటం నీతి కాదు' అన్నాడు. 

అప్పుడు హనుమంతునికి తెలిసింది తనను రక్షించే భారం ప్రభువు విభీషణుని  పై ఉంచాడు అని. 


ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే  విభీషణుడు ఆ మాట చెప్పినప్పుడు రావణుడు వెంటనే ఒప్పుకుని 'కోతిని చంపొద్దు. అయితే కోతులకు తోకంటే మహా ఇష్టం కాబట్టి తోకకు నిప్పు పెట్ట' మని చెప్పాడు. 


అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. లేకపోతే నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి! 


కానీ గమనించండి...పరమాశ్చర్యం ఏంటంటే వాటన్నిటి ఏర్పాటు రావణుడే స్వయంగా చేయించాడు. 

అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు తన నుండి తనకు కావలసిన పనిని చేయించుకోవడంలో ఆశ్చర్యం ఏముంది! 

**

అందుకే ప్రియ భక్తులారా! ఒకటి గుర్తుంచుకోండి ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతోంది అని అనుకోండి. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం అని గుర్తు పెట్టుకుని మసలండి. 

అందువల్ల *ఎప్పుడు కూడా నేను లేకపోతే ఏమవుతుందో?* అన్న భ్రమలో ఎప్పుడు పడవద్దు 

'నేనే గొప్పవాడి'నని అనుకోవద్దు. *భగవంతుని కోటాను కోట్ల దాసులలో అతి చిన్నవాడను* అని ఎఱుక కలిగి ఉందాం.

జై శ్రీరామ🙏

☘️🍂


(హిందీ రచనకు స్వేచ్ఛానుసరణ)

కామెంట్‌లు లేవు: