18, నవంబర్ 2022, శుక్రవారం

సర్వజ్ఞత్వం....2

 సర్వజ్ఞత్వం....2

ఒకసారి ఒక దంపతులు పరమాచార్యవారి దర్శనార్ధం కంచి బస్సు ఎక్కారు. బస్సు బయలుదేరడానికి కొద్ది సమయం ఉండటంతో భర్త స్వామి వారికీ కొండ అరటిపండ్లు అంటే ఇష్టమని, కొనటానికి బస్సు దిగాడు. సమయం అయినా భర్త రాలేదు. కండక్టర్ "అమ్మా ఇంక నీ భర్త కోసం ఆగటం కుదరదు. బస్సు బయలుదేరుతుంది."అనటం తో ఆమె కంగారు పడింది. ఇంతలో అరటి పండ్లు తీసికొని భర్త రావటం తో ఆమె ఆయన పై చిర్రబుర్రులాడటం మొదలుపెట్టింది."స్వామి మీరు తెచ్చిన కొండ అరటి పండ్లు తింటారా. ఏవి దొరికితే అవి తేవచ్చుగా. కొంచెం లో బస్సు పోయేది."అంటూ నస పెట్టింది. భర్త "మంచి పండ్లకని వెతికాను. అందువల్ల ఆలస్యం అయింది."అని సర్దిచెప్పాడు.

మఠానికి వెళ్లేసరికి భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండటం తో వారు తెచ్చిన పండ్లను స్వామి వద్దకు తీసుకొని వెళ్ళటం కూడా కష్టమైంది. దంపతులు వరుసలో నిలుచున్నారు.

స్వామి తమ శిష్యునితో

వేలు చూపుతూ "అతనిని పిలుచుకురా "అని భర్త కేసి చూపాడు.

దంపతులు ఇరువురు స్వామి ముందుకొచ్చారు.

స్వామి "నాకోసం తెచ్చిన కొండ అరటి పండ్లు ఏవి "అని అడిగారు.

భర్త ఆనందంతో వాటిని తీసి స్వామి ముందు ఉంచాడు. స్వామి ఒక పండు ను ఒలిచి తిని, మరొక పండు ను నవ్వుతూ భార్య కి ప్రసాదంగా ఇచ్చారు.ఆమె తాను అన్న మాటలకి తలవొంచుకుంది.

***ఇక్కడ స్వామి, భర్త భక్తితో ఇచ్చిన పండు అడిగి తీసుకోవడం ద్వారా ఆయనను, భార్య కు ప్రసాదం గా పండు ఇవ్వటం ద్వారా ఆమె ను కూడ ఆశీర్వదించి నారు.

కామెంట్‌లు లేవు: