18, నవంబర్ 2022, శుక్రవారం

తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే

 తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే 


ఒకనాడు కాంచీపురంలో మహాస్వామి వారి అధ్యక్షతన శివాచార్యుల సదస్సు జరుగుతున్నది, ద్రవిడ దేశంలో ఈశ్వర ఆలయాలలో కైంకర్యం చేసే అర్చకులను శివాచార్యులు అని సంబోధిస్తారు.


ఆ సదస్సు జరుగుతుండగా స్వామివారు అక్కడ ఉన్న శివాచార్యులను ఉద్దేశించి *"మీ చేతితో విబూధి ప్రసాదంగా తీసుకుంటే మంచి జరుగుతుంది అని జనం నమ్ముతారు కదా దానికి ఏమైనా ప్రమాణం ఉన్నదా"* అని ప్రశ్నించారు...


ఆ ప్రశ్నను విన్నవారు అందరూ ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు.


ఉదయం  సదస్సు పూర్తి అయ్యి మధ్యాహ్న సదస్సు ప్రారంభం అయ్యాకా స్వామివారు వచ్చి నేను ఉదయం అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమైనా దొరికినదా అని అడుగగా అక్కడ ఉన్నవారు అందరూ మౌనం వహించారు...


అప్పుడు స్వామివారు ఇలా చెప్పసాగారు... మీకు అందరికీ *శ్రీ రుద్రం* తెలుసు కదా! అందులో  *అ॒యం మే॒ హస్తో॒ భగ॑వాన॒యం మే॒ భగ॑వత్తరః । అ॒యం మే᳚ వి॒శ్వభే᳚షజో॒ఽయగ్ం శి॒వాభి॑మర్శన:* అని ఉంది కదా దాని అర్థం నిత్యం ఈశ్వర కైంకర్యంలో నిమగ్నమైయ్యే ఆ చెయ్యి ఆ ఈశ్వర లింగాన్ని తడిమి తడిమి కైంకర్యం చేసి ఈ విశ్వంలోని సమస్త రోగాలను నయం చేసే వైద్యునిగా మారుతోంది అందువల్ల మీ చేతితో తీసుకునే ఈశ్వర ప్రసాదం అంతటి మహత్తరమైనది అని ప్రజల విశ్వాసం మరియు ఈశ్వర శాసనం..


ఈ విధంగా శివాచార్యుల యొక్క చేతితో తీసుకునే ప్రసాదం యొక్క మహత్తును స్వామివారు ఈ జగత్తుకు తెలియచేశారు


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

కామెంట్‌లు లేవు: