జరత్కారుడు
సూర్యభగవానుడు కూడా ఎవరి అనుమతి లేకపోతే ఉదయించడో, అస్తమించడో ఆ మహర్షి పేరు జరత్కారుడు. ఆయన తపోశక్తి, సాధనా విధానాలు అనితర సాధ్యాలు. శరీరాన్ని తపస్సు చేత కృశింపచేసుకున్న కారణం చేత ఆయన్ను జరత్కారుడు అంటారు. కేవలం ఎముకలు, నరాలు మాత్రమే ఉండే మహర్షి నిరంతరం భూప్రదక్షిణ చేస్తూ సూర్యాస్తమయం నాటికి ఏ గ్రామం చేరితే అక్కడ ఆగి ఉదయాన్నే మరలా ఆప్రదేశం విడిచిపెట్టేవాడు. అలా పరివ్రాజక జీవితాన్ని అనుసరిస్తున్నాయన ఒకరోజు విచిత్రమైన వ్యక్తులను చూశాడు.
అంతులేని లోతైన గొయ్యి ఒక చెట్టు ప్రక్క ఉంది. ఆ చెట్టు నుంచీ ఒక బలమైన వేరు గొయ్యికి అడ్డంగా ఉంది. ఆ వేరుకు తలకిందులుగా గొయ్యిలోకి వేళాడుతూ కొందరు తపస్సు చేసుకుంటూ కనిపించారు. ఇదే వింత అనుకుంటే ఆ వేరును ఒక ఎలుక కొరికేస్తూ ఉండడం మరో వింత. ఇప్పటికే చాలా మటుకు వేరును ఎలుక కొరికేసింది. మరికొంత భాగం కొరికేస్తే త్వరలోనే వారంతా అంతు కనిపించని గొయ్యిలో పడిపోతారు. అది భయంకరమైన చీకటిగా ఉంది.
ఇదంతా చూసిన జరత్కారుడు మహాశ్చర్యంతో అది ఏ విధమైన తపస్సో తెలుసుకోవాలని వారిని ‘‘మీరెవరు? ఈ మహాప్రమాదమైన తపస్సు ఎందుకు చేస్తున్నారు?‘‘ అని ప్రశ్నించాడు.
దానికి వారు సమాధానంగా ‘‘మేమంతా పితృదేవతలం. మా వంశంలో ఒకడు పెళ్ళీ పెటాకులూ లేకుండా దేశదిమ్మరిగా తిరుగుతున్నాడు. వాడు సంతానం లేకుండా చనిపోతే మేమంతా ఈ తామసనరకంలో పడిపోతాము. ఈ చీకటి గొయ్యే నరకం. ఆ చెట్టువేరు మా వంశంలోని పనికిమాలిన వాడి ఆయుస్సు. దాన్ని కొరుకుతున్నవాడు యమధర్మరాజు‘‘ అని చెప్పారు.
అది విని గతుక్కుమన్న మహర్షి ‘‘వివాహం సంతానం లేకుండా ఉన్న ఆ వ్యక్తి పేరు ఏమిటి?‘‘అని అడిగాడు.
దానికి వారు‘‘ఆ ... ఉన్నాడులే మా వంశంలో ఒక పనికిమాలిన వాడు జరత్కారుడు అనే పేరుతో‘‘అని అన్నారు.
వారి సమాధానం విని మహాదుఃఖం పొంది జరత్కారుడు ‘‘పితృదేవతల్లారా! నా తాత ముత్తాతల్లారా! మీ దుర్గతి పోగొట్టాలంటే నేను ఏం చేయాలో చెప్పండి‘‘ అని వేడుకొన్నాడు.
‘‘నాయనా! నువ్వే జరత్కారుడని మాకు తెలుసు. నీవు ప్రాపంచిక వైరాగ్యం వల్ల చేస్తున్న మహాతపస్సు మాకు సంతోషదాయకమే అయినా, నీవు పితృఋణం తీర్చుకోలేదు. పెళ్ళి చేసుకొని పిల్లలను కనకపోతే మేము తిలోదకాలు లేకుండా శాశ్వతనరకంలో పడిపోతాము. కనుక వెంటనే పెళ్ళి చేసుకొని వంశతంతువు(తీగ) కొనసాగించు‘‘ అని చెప్పారు.
వ్యక్తిగతంగా బ్రహ్మచారిగా ఉండి ఎంత ఉన్నతి ఏ రంగంలో సాధించాము అనేది ప్రధానం కాదు. జన్మనిచ్చిన తల్లి తండ్రులకు నువ్వులూ నీళ్ళూ ఇచ్చే మనుమలను ఇవ్వని జన్మ వృథా. అటువంటి వారికి మురిక్కాలువలోని పురుగులకూ తేడాలేదు. సూర్యగతిని కూడా శాసించగలిగే తపో సంపన్నుడైన జరత్కారుడికి కూడా పితృఋణవిముక్తి తప్పలేదు. ఆయనతో పోలిస్తే సామాన్య మానవులకు ప్రత్యేకంగా చెప్పేది ఏముందీ?
ప్రపంచం మీద కోపం కలిగినా, ద్వేషం కలిగినా, వైరాగ్యం కలిగినా వివాహం చేసుకొని సంసారతీగను కొనసాగించి, వారికి తమ కాళ్ళ మీద నిలిచే శక్తి వచ్చే వరకూ గృహస్థాశ్రమ జీవితంలో ఉండి తీరాలి. కుటుంబ జీవనంలోని ప్రేమ ఆప్యాయతలు మనో హృదయబాంధవ్యాల వలన మనకు కలిగిన ప్రపంచ ద్వేషం, కోపం, వైరాగ్యం తగ్గి సామాన్యులం అయ్యే అవకాశం రావడం మాత్రమే కాక నిజమైన వైరాగ్యం త్వరగా పరిణతి చెంది మోక్షకారణం అవుతుంది.
అయితే వేదవేదాంత అధ్యయనం చేసి సామాన్య సంసారం మీద ఏహ్యభావం పొంది గృహస్థాశ్రమం స్వీకరించని శిష్యుడిని కూడా గురువులు ‘‘ ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీహి‘‘ అని హెచ్చరిస్తారు. కానీ ఈ జీవితానికి భూ మండలం మీద ఉన్న సమస్త స్త్రీలూ నాకు అమ్మలే అనే ప్రమాణం చేసి సన్యాసం స్వీకరించి తన గురువునే సేవిస్తూ ఉండే వారికి మాత్రమే సశాస్త్రీయంగా మోక్షం లభిస్తుంది. ఈ విధంగా సన్యాసం స్వీకరించకుండా బ్రహ్మచర్యం వహించడం శాస్త్ర విధి రహితం. మహాపాపాత్మకమైన జీవితం.
వివాహం ఎందుకు? అనే ప్రశ్నకు అత్యత్భుతమైన వివరణే ఈ జరత్కారుని జీవితం అని వ్యాసమహర్షి తన మహాభారత ప్రారంభంలో వ్రాశారు.
సకల సాధనలకూ గృహస్థాశ్రమమే మహాశ్రేయోమార్గమని రమణమహర్షి వంటి వారు కూడా చెప్పారు.
🕉🕉🕉
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి