1, జనవరి 2023, ఆదివారం

గతానికి వీడ్కోలు

: *గతానికి వీడ్కోలు  - స్వగతంలో వేడికోలు*



గడిచినదంతా గతం    ఇకపై అసంగతం 

గడుస్తున్నది వర్తమానం    రేపటికిది గతం 

గడువబోయేదంతా వర్తమానం  అంగీకృతం 

ఆశల తీరాలలో పూబాటల సమాహితం 


నిన్నటి పొరపాట్లు పునరుక్తైతే అలవాట్లు 

పొరపాట్లను సవరిస్తే జీవితానికి దిద్దుబాట్లు 

దిద్ధుబాట్లే చక్కని నడతకు కట్టుబాట్లు 

కట్టుబాట్లే లేకపోతే అందరిచేతా చీవాట్లు 


మనది కానిచోట అవసరమైతే అర్థించటం 

మనదైనచోట అర్థవంతంగా ఉండటం 

ఘనచరిత్రకోసం సమర్థవంతంగా ఉండటం 

మమతల తోటలలో అనర్థాలను త్రుంచటం 


మారిన సంవత్సరంతో మారాలి మనసులు 

మనసులలో తొలగాలి నాటుకొన్న లొసుగులు 

నూతనత్వపరిమళంతో విరబూయాలి సొగసులు 

అనుభవాలు హరివిల్లై విరిస్తే ఆనందపు సొబగులు 

*~శ్రీశర్మద* 

1-1-2023.

 *నా భారతీయుల్ ఘనుల్*


శార్దూలము:

ప్రాచ్యాచారము గల్గి హైందవసుధాపానమ్ముతో దీప్తమై 

వాచ్యాహార్యములందు శుద్ధమతులై వాల్లభ్యము న్వెల్గుచున్ 

రోచ్యప్రాభవసద్గుణానుభవచిద్రూపోజ్జ్వలాత్మీయతన్ 

నైచ్యాఽప్రాచ్యమనోజదూరగుణులౌ నా భారతీయుల్ ఘనుల్ 

మత్తేభము:

ఘనులై విద్వదపారసారమతులై కారుణ్యకాసారులై 

మునులై విద్యలకాలవాలమణులై మోహారులై ధీరులై 

అనిలో తగ్గని వీరశూరగుణులై అర్యాహసంహర్త్రలై 

కనగా సౌమ్యత వెల్గు భారతజనుల్ కైమోడ్పు కర్హుల్ సుమా! 

*~శ్రీశర్మద* 

1-1-2023.

కామెంట్‌లు లేవు: