27, ఫిబ్రవరి 2023, సోమవారం

జ్వరం హరించు ఆయుర్వేద యోగం

 


 జ్వరం హరించు సులభ ఆయుర్వేద యోగం - 


   6 నిమ్మకాయల రసం , 300 గ్రాముల గోరువెచ్చని నీటిలో కలిపి 3 స్పూనుల పటిక బెల్లం చూర్ణం లేదా పంచదార కలిపి ఆ రసాన్ని రోజు మొత్తం మీద కొంచం కొంచం మోతాదులో జ్వరంతో బాధపడుతున్న వారికి ఇచ్చుచున్న జ్వరం , వాంతులు , అతిసారం , విరేచనాలు నివారణ అగును . 


  తగ్గేవరకు నిత్యం చేయవలెను .  


           మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  : అష్టసిద్ధులు  - కుండలినీ శక్తి జాగరణ .


        హిమాలయ పర్వతాలలో రహస్య గుహలు చాలా ఉన్నాయి. వాటి గురించి సామాన్య మానవులైన మనం ఎంతమాత్రమూ తెలుసుకోలేము. ఆ గుహలలో అత్యంత కఠిన సాధన చేస్తూ ధ్యానంలో ఉండు మహాయోగులు ఎంతో మంది ఉన్నారు . వీరు సామాన్యంగా జనబాహుళ్యంలోకి రారు. రావలసి వస్తే అదృశ్యరూపములో వచ్చి తమ కార్యం నిర్వర్తించుకొని పోగల గొప్ప శక్తి కలిగి ఉంటారు . వీరిలో వందల సంవత్సరాల వయస్సు కలిగినవారు కూడా ఉన్నారు . మరి వీరు ఇన్ని వందల సంవత్సరాలు ఎలా బ్రతికి ఉన్నారు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం . ఈ విషయం పైన అనేకమంది పాశ్చత్య పరిశోధకులు పరిశోధనలు కూడా చేశారు . దీని గురించి నేను కొన్ని పురాతన గ్రంథాలు పరిశీలించినపుడు కొంత వివరణ నాకు దొరికింది. దానిలో ఈ విధముగా ఉన్నది. ప్రతి మనిషి యొక్క ఆయష్షు అనేది బ్రహ్మ సంవత్సరాల పరంగా రాయడు. పుట్టిన ప్రతి జీవి ఇన్ని లక్షల ఉచ్చ్వాస , నిశ్చ్వాసాలు తీసుకుంటాడు అని మాత్రమే రాస్తాడు. మనిషి తన ఆయష్షు పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది తన శ్వాస మీద అధారపడి ఉంటుంది . ఆ ఉచ్చ్వాస , నిశ్చ్వాసాలు సమాప్తి అయ్యాక జీవి తన శరీరాన్ని వదిలి పరమాత్మని చేరుతుంది.


               ఈ సిద్ధాంతం ఖచ్చితంగా యోగుల విషయంలో పనిచేస్తుంది అని నేను నమ్ముతున్నాను.  ఎలా అంటే ఒక యోగి ధ్యానం చేస్తూ సమాధి స్థితిలో ఉన్నప్పుడు అతని యొక్క శ్వాస అనేది క్రమక్రమంగా తగ్గుతూ చివరికి పూర్తిగా ఆగిపోతుంది. అతని శరీరంలోని అవయవాల పనితీరు ఏ మాత్రం చెడిపోదు. శ్వాస ఆగుతుంది చుట్టూ ఉన్న కాలం ఆగదు.అతని ఉస్చ్వాస , నిశ్చ్వాసాలు యొక్క సంఖ్య తరగదు. ఈ విధముగా ఎంతకాలం గడిచినను అతను జీవించే ఉంటాడు. యోగం చేయువారు ప్రధానముగా తన శ్వాసని అదుపులో పెట్టుకొనే శక్తిని కలిగి ఉండాలి .


                        పైన చెప్పిన విధానంలో యోగుల ఆయష్షు పెరుగును . వీరిలో చాలా మంది కుండలీ శక్తిని మేల్కొలిపినవారై ఉంటారు . ఈ దశలో వీరికి అష్టసిద్ధులు సంప్రాప్తిస్తాయి . ముందు మీకు కుండలినీ శక్తి గురించి వివరిస్తాను. ఆ తరువాత కుండలిని శక్తి గురించి చెప్తాను .


        సిద్ధులను పొందినవాడు సిద్దుడు అవుతాడు. కొంతమంది కొన్నిరకాల సిద్ధులతో సంతృప్తి పడి ఆగిపోతారు. కాని కొందరు మాత్రమే అన్నిరకాల సిద్ధులను సాధించే వరకు విశ్రమించరు . ఈ సిద్ధులలో బేధాలు కలవు. ఇవి మొత్తం 8 రకాలు .అందుకే వీటిని "అష్టసిద్దులు " అని పిలుస్తారు .  ఇవి వరుసగా  


 *  అణిమ .


 *  మహిమా .


 *  చైవ .


 *  గరిమ .


 *  లఘిమ .


 *  తథా .


 *  ప్రాప్తిహి . 


 *  ప్రాకామ్య  .


 *  మీశిత్వం .


 *  వశిత్వం .


 *  చాష్ట భూతయః .


 అష్టసిద్దులు యొక్క వివరణ  -


   శరీరమును చాలా చిన్నదిగా చేసుకొను ప్రక్రియయే "అణిమ " .


 తన స్వరూపమును చాలా పెద్దగా చేసుకొను ప్రక్రియను " మహిమ" అని పిలుస్తారు .


  తన శరీరంను చాలా బరువుగా చేసుకొను ప్రక్రియను " గరిమ" అని పిలుస్తారు .


  తన యొక్క శరీరంను అత్యంత తేలికగా చేసుకొను ప్రకియనే " లఘిమ" అని పిలుస్తారు .


  తన యొక్క జ్ఞానేంద్రియాలు , కర్మేంద్రియాలు సహయముతో ఎంత దూరం ఉన్న విషయములనైను గ్రహించుటయే "ప్రాప్తి" .


  తను కోరిన కోరికలు అన్నింటిని పొందుటనే  "ప్రాకామ్యము" .


  తనశక్తిని ఇంకొకరి యందు ప్రసరింపచేయు సిద్ధిని "ఈశిత్వము " అందురు.


  సర్వ భూతములు అన్నియు తనకు వశం అగుటను "వశిత్వము" అందురు.


          ఈ 8 రకాల సిద్ధులను "అష్టసిద్దులు" అందురు. ఈ అష్టసిద్ధులు ను సాధించినవాడు మహాయోగి అగును.  ఇవియే గాక సూక్ష్మ శరీరముతో లోకలోకాంతరములు అన్నింటిని దర్శించుట, దూరశ్రవణము , దూరదర్శనము , ఆకలిదప్పికలు లేకపోవుట , ధ్యానావస్థలో కొత్తకొత్త విఙ్ఞాన విషయాలు తెలుసుకొనుట, మరొక లోకములలో నివశించుతున్న మహాపురుషులను సందర్శించి వారితో సంభాషించటం , తన సంశయములకు సమాధానములు వారి నుంచి పొందుట , ఎక్కువ సమయములో అనుభవించదగిన ప్రారబ్ద కర్మను తక్కువ సమయములోనే అనుభవించి ముగింపచేయుట , అనేక మంది దుఃఖితుల యొక్క దుఃఖాన్ని దూరం చేయుట , పూర్వజన్మ , రాబోవు జన్మ గురించి తెలుసుకొనుట , త్రికాల జ్ఞానము మొదలగునవి ఉపసిద్దుల కిందికి వచ్చును. అష్టసిద్దులు సాధించు సమయంలో తన యొక్క ప్రయత్న స్థితిని బట్టి ఈ ఉపసిద్దులు కూడా యోగికి వచ్చును.


  


           మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  : కుండలినీ శక్తి జాగరణ  - సంపూర్ణ వివరణ .


        కుండలిని అంటే యోగవిద్య నేర్చుకునే వారికి అత్యంత పరిచయం అయిన పేరు . కుండలిని అనే శక్తి వెంట్రుక కంటే సన్నని రూపంలో చుట్టలు చుట్టుకుని వెన్నుపాము కిందిభాగంలో ఉంటుంది అని కొంతమంది చెబుతారు.  ఇది నిద్రావస్థలో ఉంటుంది. ఎప్పుడైతే నిద్రావస్థలో ఉన్న కుండలి సరైన గురుప్రసాదం వలన మేలుకొని సకల పద్మాలు అనగా చక్రాలను చీల్చుకొని పోవుతుందో అప్పుడు కుండలిని నిద్రావస్థ నుంచి జాగరణావస్థ లోనికి వచ్చింది అని తెలుసుకొనవలెను.


             ఈ కుండలినికి అనేక నామములు కలవు. కుటిలాంగి , భుజంగి, శక్తి, ఈశ్వరి, కుండలిని , అరుంధతి , కుండలి అను పేర్లతో వివిధ యోగ గ్రంథాలలో పిలుస్తారు . కుండలిని శక్తి మేల్కొనని యెడల సర్వయోగ సాధనలు వ్యర్ధములు అగును. ఈ కుండలిని అనేది వెన్నుపాము కిందభాగములో సర్పాకృతిని పొంది నిద్రావస్థలో ఉన్న ఒక సూక్ష్మ నాడి . ఇది సమస్త శక్తి మహిమలకు , సమస్త జ్ఞాన , విజ్ఞానములకు ఆధారభూతం అయిన కేంద్రస్థానం . ఈ కుండలినీశక్తి మేల్కొననంత వరకు మానవుడు అజ్ఞానిగానే ఉంటాడు. కుండలిని జాగరణ అయిన కొద్దికాలంలోనే పూర్ణమైన ఙ్ఞానమును , సమస్త మహిమలు కలుగును.


                  కుండలిని శక్తిని ప్రాణాపానైక్యము అను సాధన ద్వారా మేల్కొనపవచ్చు . ఈ సాధన సద్గురువు యొక్క శక్తిపాతము వలన కలిగే ధ్యానావస్థ యందు సహజముగా కలిగే భస్త్రికా ప్రాణాయామం వలన కలుగును. ఈ సాధన యోగమార్గ రహస్యాలు తెలిసిన సద్గురువు వలన నేర్చుకుని చేయవలెనే కాని సొంతప్రయత్నముతో చేయరాదు . అలా చేసినచో చాలా అపాయకరమైన పరిస్థితులను కలిగించును. నాజీవితములో అలా ప్రయత్నించి కుండలిని శక్తి మేల్కొనిన తరువాత దానిని అదుపు చేయలేక పిచ్చివారు అయిన వారిని మరియు తీవ్రంగా మలబద్దకం సమస్య పొందిన వారిని చూశాను .


               కుండలిని జాగరణ సరైన పద్దతిలో జరిగినవాడు గొప్ప లాభమును , శక్తిని ఎలా పొందునో అలానే కుండలిని జాగరణ సవ్యముగా జరగక ఏమైనా విషమ సమస్య కలిగినచో మనోమయ , విజ్ఞానమయ కోశములు ఈ జన్మలోనే కాకుండా ఇంకా కొన్ని జన్మల వరకు సాధన చేయుటకు నిరుపయోగము అగుటయే కాకుండా సాంసారిక కార్యక్రమాలకు కూడా పనికిరాకుండా అనేక విధములు అయిన మానసిక  , భౌతిక దోషముల చేత ఉన్మాదాది రోగములచేత పీడితుడు అగును. కావున పూర్ణపురుషుడు అయి సరైన సద్గురువు దొరికినప్పుడే కుండలిని జాగరణ సాధనలు చేయవలెను . మంత్రజపముల వలన కూడా కొన్ని ఙ్ఞాన నాడుల మీద ప్రత్యేకమైన ప్రభావము కలిగి తద్వారా కుండలిని జాగరణ కలిగినప్పుడే మంత్రసిద్ది , ఇష్ట దేవతా సాక్షాత్కారము కలుగును. ఇటువంటి సాధనలు చేయుటకు ఆరోగ్యముగా ఉండటం కూడా అత్యంత ప్రధానం


           కుండలిని శక్తి గురించి చెప్పేటప్పుడు శక్తిచాలనము గురించి కూడా తెలుసుకోవాలి . పరిపూర్ణుడు అయినటువంటి మనుష్యుడు యోగసాధన ద్వారా ఈ కుండలిని శక్తిని మేల్కొలపాలి. ఈ విధానం గురించి యోగులు ఈ విధంగా చెబుతారు . నిద్రచేయునట్టి సర్పమైన కుండలిని యొక్క తోకను పట్టి దానిని మేలుకొలపవలెను . కుండలిని శక్తి నిద్రను విడిచి హఠము చేత మీదికి లేచుచున్నది. ఈ కుండలిని శక్తి పాము వలే వంకరగా చుట్టుకుని ఉండుననియు కందము మీద బ్రహ్మ ద్వారము నందు ముఖమును ఉంచి ద్వారమును మూసుకొని నిద్రించుచుండునని యోగులు చెప్పుదురు.


                   లింగమునకు మీదుగాను , నాభికి క్రిందగాను , గుదస్థానమునకు పన్నెండు అంగుళముల పైన , నాలుగు అంగుళముల వెడల్పును , అదే పొడుగును కలదై గుడ్డు వంటి కందము ఉండును. ఈ కంద స్థానం నుండియే 72000 వేల నాడులు బయలుదేరుతున్నవి . వజ్రాసనమున ఉండి రెండు చేతులతో కాలి మడమలకు సమీపమున రెండు పాదములను దృఢముగా పెట్టి ఈ రెండు పాదముల చేత కంద స్థానమునందు ఉండు కందమును చక్కగా పీడించవలెను . ఇట్లు పీడించుటచే కుండలిని చాలనం అగును. ఇక్కడ చాలనం అనగా నిద్రపోవుచుండెడి కుండలిని శక్తిని మూలాధారం నుండి ఊర్ధ్వముఖమునకు చలింపచేయుట లేక తీసుకొనిపోవుట . ఈ రహస్యము గురుముఖంగా తెలుసుకొనదగినది. ఈ కుండలిని శక్తిని చాలనము చేయుటకు అనేక మార్గములు కలవు. ఇట్టి విధానములు అన్నియు రహస్యముగా గురుసన్నిధిలోనే నేర్చుకొనవలెను.


                   ఏకాగ్రత చిత్తముతో గురుపదేశమగు రీతిని ప్రాణాయామము చేయుటచే గూడ  కుండలిని శక్తిని చాలనము చేయవచ్చు . ఈ శక్తిని చాలనము చేసి ప్రాణశక్తిని తన స్వాధీనము నందు ఉంచుకొనిన యోగి అణిమాది సిద్ధులను సాధించుచున్నాడు. ఇట్టి కుండలిని శక్తిని సాధించిన కాస , శ్వాస , జ్వరాదిరోగములు ఎప్పటికి బాధించవు . ఇట్టి మహాముద్రాది కరణముల చేత , నానావిధములగు ఆసనముల చేత , కుంభకముల చేత కుండలి మేల్కొన్నప్పుడు ప్రాణవాయువు శూన్యం అనెడి బ్రహ్మరంధ్రమునందు లయమగుచుండెను .


          కుండలిని శక్తి గురించి సంపూర్ణంగా మీకు వివరించాను . తరవాతి పోస్టులో మీకు శరీరము నందు గల చక్రాల గురించి వివరిస్తాను.


            మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  

కామెంట్‌లు లేవు: