27, ఫిబ్రవరి 2023, సోమవారం

- అది ధ్యానం.

 *నీటిలో మునిగితే- అది స్నానం. నీలో మునిగితే- అది ధ్యానం. నీలోకి నీవు మునిగిపోవడం నీళ్ళలో మునిగినంత తేలిక కాదు. స్నానానికి సాధనతో పనిలేదు. ధ్యానానికి సాధన తప్ప వేరే దారి లేదు. ధ్యానం కుదరడం లేదని ఫిర్యాదు చేసే  చాలామంది చెరువు గట్టున నిలబడి చూసేవారే కాని, నీళ్లలోకి దిగినవారు కారు.* 


 *తన వద్ద శిష్యరికం చేసిన పూర్వ విద్యార్థిని పిలిపించి బుద్ధుడు ధ్యానం గురించి అడిగాడు. శిష్యుడికి అది రెండో ఎక్కం లాంటిది. రకరకాల ప్రక్రియలు, ధ్యాన దశల గురించి అప్పటికే విశేషంగా చదివి ఉన్నాడు. పరిశోధనలు చేశాడు. ఆ విద్యలో గట్టి పాండిత్యం సాధించాడు. కనుక బుద్ధుడు అడిగీ అడగ్గానే ఎన్నో సాధనా విధానాలను గడగడా వల్లించాడు. బుద్ధుడు శిష్యుడికేసి ప్రసన్నంగా చూస్తూ ‘మంచిది భిక్షూ! ఇక ధ్యాన సమయంలో నీవు పొందిన అలౌకిక అనుభూతులను కొన్నింటిని వివరించు’ అని అడిగాడు. తెల్లబోయాడు శిష్యుడు. నోట మాట రాలేదు.*


 *‘ఎవరికైనా  ధ్యానం గురించి పాఠం చెప్పడానికి తగినంత పరిజ్ఞానాన్ని సాధించావే తప్ప నీవు నిజమైన ధ్యానివి కాలేకపోయావు’ అన్నాడు బుద్ధుడు. లోకంలో సాధకులమనుకునే వారిలో చాలామందిది ఇదే పరిస్థితి.* 

 *నిజానికి ధ్యానమంటే గాఢమైన* *అనుభూతే తప్ప, ఆలోచన కానేకాదు. ధ్యానంలో ఆలోచించడానికి ఏమీ లేదు. వెదురుబొంగు లోపల దట్టంగా* *అలముకున్న గుజ్జు, పోగులు పూర్తిగా కాలిపోయి, ఖాళీ అయ్యాక- వేణువు కావడానికి సిద్ధమవుతుంది.* *ముసురుకున్న ఆలోచనలను తుడిచేశాక, ధ్యానం తానుగా మనసులోకి  వచ్చి చేరుతుంది.*


 *ఆపై నెమ్మదిగా గుండెల్లో ప్రశాంతత ఆవరిస్తుంది. ఆనందం వరిస్తుంది. శరీరం గొప్ప శక్తి కేంద్రమై తరిస్తుంది. ఈలోగానే  ఆలోచనలు తిరిగి దాడి చేస్తాయి. పాత జ్ఞాపకాలు తరుముకొస్తాయి. అవి చాలా బలమైనవి. వాటిని ప్రతిఘటిస్తే మనిషి విఫలమవుతాడు. పారిపోతే దొరికిపోతాడు. వాటితో ఘర్షణ వృథా! సాధకుడు వాటిని స్వేచ్ఛగా లోనికి  అనుమతించాలి.*


 *చిరునవ్వుతో పలకరించాలి.* *ఆలోచనలకు దారివ్వడమంటే మనసును మచ్చిక చేసుకోవడమని అర్థం. ఆ సాక్షీభూత స్థితిలో మనిషికి, మనసుకు మధ్య స్నేహం కుదురుతుంది. ఆలోచనలనేవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు.*


 *వేగంగా కదిలిపోతూ ఉంటాయి. వాటంతటవి తొలగిపోయేవరకు మనిషి ఓపిక పట్టాలి.* 

 *ఆ సంధి  సమయంలో మనిషికి సహనమే గొప్ప వరం. ధ్యానం కోసం వేచి చూసే స్థితికి చేరుకోవడం విజయంలో తొలిమెట్టు. ఆ స్థితిలో మనసులోకి వచ్చి పోతున్నా పట్టించుకోని విషయాలే స్వయంగా మనిషిని ధ్యానంలోకి తోసేస్తాయి. పరిశీలనలోంచి మనసును అనుభూతిలోకి, ఆస్వాదన లోకి నెట్టేస్తాయి. లీలగా మనిషి ధ్యానంలో లీనమవుతాడు.*    

 *సాధన  క్రమంలో ఒళ్ళు* *జలదరించడం, ఆవలింతలు* *రావడం, అకారణమైన ఆనందమేదో గుండె తలుపు తట్టడం గాని  జరిగితే- అవన్నీ* *ధ్యానంలో పురోగతికి సూచనలని  మనం గ్రహించాలి. పరమహంస* *యోగానందజీ  చెప్పినట్లు వాటి  ప్రోత్సాహంతో మరింత లోతులకు ప్రయాణం సాగించాలి.*


 *ఆ అనుభూతులు వాటంతటవే రావాలి తప్ప మనం ఎదురు చూడకూడదు,  వాటికోసం ప్రయత్నించకూడదు. వైకుంఠపాళిలో  నిచ్చెనల్లాంటివవి. ధ్యానానికి గమ్యం- ఆ నిచ్చెనలు కావు... పరమపద సోపానం!* 

*శుభోదయం*🙏

కామెంట్‌లు లేవు: