5, మార్చి 2023, ఆదివారం

పంచదార పళ్లెం

*పంచదార పళ్లెం*


చాలా సంవత్సరాలకు ముందు జరిగిన ఒక యదార్ధ సంఘటన నా మదిలో మెదిలి ఇక్కడ పేర్కొంటున్నాను. 


మా గురువు గారి ఇంటికి నేను తరచూ వెళ్లి సందేహ నివృత్తి  చేసుకునేవాడిని. మా గురువు గారికి ఒక ఏడు ఈడు గల    ముద్దులొలికే కుమారుడు ఉండేవాడు.  ఆ పిల్లవాడు తరచూ మా గురుపత్నిని ఎత్తుకోమని మారాం చేసేవాడు. వాడి మనస్సు మళ్లించటానికి ఆవిడ ఒక పెద్ద పళ్ళెరంలో పంచదారను వెదజల్లి వాని ముందర ఉంచేవారు.  దానిని ఒక్కొక్క రేణువు వేలుతో తీసుకొని తింటూ సమయం గడిపే వాడు.  ఆ సమయంలో గురుపత్ని తన గృహ పనులను చేసుకునేవారు. 


అదే విధంగా ఒకటి రెండు రోజులు గడిచాయి. ఆమెకు పిల్లవానితో కొంత ఊరట లభించటంతో  తన పనులు నిర్విఘ్నంగా చేసుకునేవారు. 


ఒక రోజు నేను ఆ పిల్లవానిని చూసి ఆశ్చర్యచకితుడిని అయ్యాను. దానికి కారణం వాడు తన చేయిని మొత్తంగా నోటిలోకి తీసుకొని ఉమ్మి అంటించుకొని చేతితో పళ్ళెరంలోని పంచదారను అద్దుకొని ఒక్క నిమిషంలో నాకి మొత్తం పంచదార అయిపోగొట్టి ఎత్తుకోమని తల్లిగారిని వేధించసాగాడు. మేడమ్ మీరు తెలివిగా వాడికి పంచదార పళ్లెం ఇస్తే వాడు వాడి తెలివితో ఒక్క క్షణంలో మొత్తం తిని మళ్ళి ఏడుస్తున్నాడు అని అన్నాను.  అవును వీడికి రోజు రోజుకు తెలివి పెరుగుతున్నది అని ఆవిడ అన్నారు. 


ఇక విషయంలోకి వస్తే మోక్షార్థి అయిన భక్తుడు అమ్మవారిని (జగన్మాతను) మోక్షాన్ని ప్రసాదించమని పదే పదే వెంటపడి వేధిస్తూవుంటే ఆ తల్లి కూడా మా గురుపత్ని లాగానే మనకు అనేక పంచదార పళ్లెరాలను ఇచ్చి మైమరపించ ప్రయత్నిస్తుంది. 


ఆ పంచదార పళ్లెరాలలో పంచదారే కాక అనేక విధాల ఐహిక సుఖాలు, భోగాలు, విషయ సుఖాలు ఒకటేమిటి మన అరిషడ్వార్గాన్ని తృప్తి పరిచే సమస్తం ఉంటాయి. అమాయకుడైన సాధకుడు వాటిలో తలమునకలు ఐయి జగన్మాతను మరిచి సర్వ సుఖాలను అనుభావిస్తు పాపపు కార్యాలను చేస్తూ మరల మరల ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. 


తెలివైన సాధకుడు అమ్మవారి లీలను తెలుసుకొని మా గురు పుత్రుడు చేసినట్లుగా సర్వ సుఖాలను క్షణంలో అవగొట్టి వాటిలో ఏది శాశ్వతం కాదని తెలుసుకొని అమ్మ చరణాలను వేడుతాడు.


లేదా ఇంకొక విధమైన సాధకుడు తల్లి పెట్టిన ప్రలోభాలకు లొంగకుండా వాటి అన్నింటీని తృణప్రాయంగా భావించి అమ్మవారిని (మోక్షాన్ని) చేరటమే  తన జీవిత పరమావధిగా భావించి తాపత్రయ పడతాడు. నిరంతర సాధన, అకుంఠిత దీక్ష, మొక్కవోని నమ్మకం సాధకునికి మోక్షాన్ని చేకూరుస్తుంది. ఇది సత్యం. 


కాబట్టి భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే, సాధక మిత్రమా,  బాహ్య మైన సుఖాలను, భోగాలను తృణప్రాయంగా తలంచి శాశ్వతము, నిత్యము, సత్యము అయిన మోక్ష సుఖానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తేనే సాధకుడు మోక్షాన్ని పొందగలరు. 


సాధకునికి ప్రారంభంలో అనేక అవరోధాలు కలుగుతాయి.  నిజానికి సంసారిగా వుంటూ సాధన చేయటం అనేది రెండు పడవల మీద ప్రయాణం లాంటిది. ఎంతో నేర్పుతో, ఓర్పుతో, సహనంతో, చాకచక్యంతో, వివేకముతో, సమర్థతో తన పూర్తి భారాన్ని అమ్మవారి మీద పడ వేసి తాను చేసే కర్మలన్నీ ఆ తల్లి తనతో చేయిస్తున్నదని  భావించి ఏ కర్మలోను తన మనస్సును లగ్నం చేయకుండా కేవలం ఒక సాక్షిభూతంగా భావిస్తూ కర్మలు చేస్తూ, నిత్యం ప్రతి క్షణం మనస్సు తల్లి పాదాలమీద నుంచి మరల్చకుండా సాధన చేసే సాధకునికి మోక్షం కరతలామలకం అవుతుంది.  


ఇది సత్యం. ఎన్నో వేల జన్మలనుంచి ప్రాధేయ పడితేనో మనకు పరమేశ్వరుడు ఈ మానవ జన్మ ఇప్పుడు ఇచ్చాడు.  దీనిని సార్ధకత చేసుకొని ఇప్పుడే జన్మరాహిత్యానికి కృషి చేయాలి. ఇంకా ఆలస్యం చేస్తే మనం తిరిగి జీవన చక్రంలో పరిభ్రమించక తప్పదు.  సాధ్యమైనంత వరకు పాప కార్యాలను నిరోధించి పుణ్య కార్యాలకు ప్రాధాన్యత ఇస్తూ కర్మలు చేస్తేనే మనం మోక్షాన్ని పొందగలము.


ఓం తత్సత్,


 ఓం శాంతి శాంతి శాంతిః 


మీ 


భార్గవ శర్మ

98486 47145

కామెంట్‌లు లేవు: