4, ఏప్రిల్ 2023, మంగళవారం

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

 🙏


*గ్రంథం:* నమ్మిన వారికి సొమ్ము - నమ్మకుంటే (వారి ప్రారబ్దం),  భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*చీటీల ద్వారా శ్రీ స్వామి పలకడం* 


గొర్తి సాయిశివ (స్విట్జర్లాండ్) తన అనుభవాన్ని  ఇలా తెలుపుతున్నారు:


1999వ సంవత్సరంలో పాల్వంచ ఆడమ్స్ కాలేజీలో ఇంజనీరింగ్ సీటు వచ్చాక మా నాన్నగారి మ్రొక్కుబడి ప్రకారం కృతజ్ఞతలు తెలుపుకొని, మూడు నిద్రలు చేయటానికై గొలగమూడి శ్రీ వెంకయ్యస్వామి సన్నిధికి వచ్చాము. స్వామి సన్నిధిలో శ్రీ సుబ్బరామయ్య సార్ సత్సంగంలో మూడు రోజులు గడిచిపోయాయి. ఇక యింటికి బయలుదేరుతూ సుబ్బరామయ్య సారికి నమస్కరించి సెలవు తీసుకుందామని వెళ్ళాము. నేను మనస్సులో శ్రీ వెంకయ్యస్వామిని సార్ ద్వారా సందేశం యిప్పించమని ప్రార్థించాను. సార్ అప్పుడు చెప్పిన మాటలు: *"వెంకయ్య స్వామి నీకు సీటు యిప్పించారు, చదువుకొనే అవకాశం కలిగించారు. కనుక ఆ పనిని టాప్ మోస్ట్ గా, క్షుణ్ణంగా, ఆయనను మెప్పించేంతగా చేయటమే ఆయన సేవ అని"*.


 ఆ తర్వాత ఉత్తరాల ద్వారా విద్యార్ధి లక్షణాలు తెలియచేస్తూ, నిజమైన బాబా సేవ అంటే విద్యార్థిగా నేను చేయవలసినదేమిటో తెలియచేయటమే కాక, ఆ విధంగా చేసేందుకు తగిన శక్తినీ, ఉన్ముఖతనూ కలుగచేసి *సార్ ద్వారా శ్రీ వెంకయ్యస్వామి నా జీవితంలో, దృక్పథంలో ఎంతో మార్పు తీసుకు వచ్చారు.* అందువల్లనే ' గేట్' పరీక్షలో మంచి ర్యాంకు వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ.ఐ.ఎస్సి, బెంగుళూరు)లో మాస్టర్స్ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) చేసే అవకాశం కలిగింది. అది కేవలం శ్రీ స్వామివారి భిక్షే. లేకుంటే ఇంటర్వ్యూలో కూడా వెంకయ్య స్వామి, సాయిబాబా, భరద్వాజ మాష్టారు మొ॥ మహాత్ముల ప్రస్తావన రావటమేమిటి? వారి గురించి, వారు చెప్పిన నియమాలు గురించి అంతసేపు ఇంటర్వ్యూ బోర్డు వారు వినటం, ప్రశ్నించటం ఏమిటి? దీని ద్వారా ఐ.ఐ.ఎస్సి లో కూడా సీటు ఇప్పించినది వారేనని బల్లగుద్ది చెప్పటం కాదూ?


 మొదటి సెమిస్టర్ పూర్తయింది. అప్పుడు. కూడా ఒకటే ధ్యేయం! సార్ మాటలు తరచూ చెవుల్లో మారు మ్రోగుతూ ఉండేవి. *టాప్ మోస్ట్ గా ఆయన ఇచ్చిన పనిని నిర్వర్తించాలి. ఎవ్వరూ చేయలేనంతగా! మన ప్రయత్నం మనం చేస్తే కొండంత అండగా స్వామి నిలుస్తారు. మనకు సరైన మార్గదర్శకం చూపిస్తారు అని.* మొదటి సెమిస్టరు ఫలితాలలో అన్ని సబ్జెక్టులలో టాప్ గ్రేడ్ వచ్చింది. అప్పుడు మా గైడ్ అడిగిన ప్రశ్న. 'నువ్వు కావాలనుకుంటే ఇప్పుడు డైరెక్టుగా పిహెచ్.డికి నీ రిజిస్ట్రేషన్ని అప్లోడ్ చేసుకోవచ్చును. అలా చేస్తే నువ్వు పూర్తి చేసిన సెమిస్టర్ కూడా నీ పిహెచ్.డి.లోకి జమ చేయబడుతుంది. ఇంకొక మూడు, నాలుగు సంవత్సరాలలో డైరెక్ట్ పిహెచ్.డి. డిగ్రీ వస్తుంది. నీ నిర్ణయం ఏమిటో చెప్పు' అని


అప్పటికి బాబా నా చిన్నప్పటి నుండీ ప్రసాదించిన అనుభవాల దృష్ట్యా మరియు సుబ్బరామయ్య సార్ సత్సంగాల వల్ల దృఢంగా ఏర్పడిన భావం - *ఏ విషయంలోనైనా గురువు మీద ఆధారపడాలని!* అందునా ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకోవటానికి నా పరిమితమైన విచక్షణకో, ఇష్టాయిష్టాలకో చోటివ్వక భగవంతుని ఆజ్ఞానుసారం, ఆయన మార్గదర్శకత్వాన్ని పొంది, ఆయన నిర్ణయానికి సంతోషంగా తలవొగ్గడంలోనే నా మరియు అందరి శ్రేయస్సు వుంటుంది అని. మరుసటి మారు గొలగమూడి వెళ్ళినప్పుడు సార్ కి నా పరిస్థితి మరియు నాకు ఉన్న ఆలోచనలు వివరించాను. నా ఆలోచనలు ఇవి:


(1) పిహెచ్.డి.కి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అప్ గ్రేడ్ చేయించుకోవటం.


(2) మాస్టర్స్ పూర్తి చేసి డిగ్రీ వచ్చాక విదేశాలలో ఇంకా మంచి యూనివర్శిటీలో పిహెచ్.డి. చేయటం


(3) మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత, ఇక్కడే ఇండియాలోనే మా గైడ్ వద్దనే పిహెచ్.డి. చేయటం


మొదటి ఆప్షన్లో అయితే మూడు సంవత్సరాలు కలిసి వస్తాయి. తక్కువ వయస్సులోనే పిహెచ్.డి వచ్చేస్తుంది. రెండవ ఆప్షన్లో ఎక్స్పీరియన్స్ మరియు క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ బాగుంటాయి. మూడవ ఆప్షన్ అయితే ఏ కారణం వల్లనైనా పిహెచ్.డి డిగ్రీ రాకపోయినా, కనీసం మాస్టర్స్ డిగ్రీ అయినా చేతిలో వుంటుంది అని.


సార్ సమాధానం: "ఇటువంటి విషయాలలో మన సొంత తెలివితేటలతో తర్కించుకోవటం కాక, *'స్వామీ! నాకు ఏది మంచిదో అది నువ్వే చెప్పు నాకు తెలియదు' అని హృదయపూర్వకంగా ప్రార్థించి ఆయన సందేశం తీసుకో" (స్వామి సమాధిమీద చీట్లు వేసి ఏది వస్తే అది చేయి - అని ఈ సందర్భంలో స్వామి సందేశం పొందేందుకు ఒక మార్గం సూచించారు)* ఆ విధంగా స్వామిని ప్రార్థించుకొని వారి సందేశం కోరగా 'అబ్రాడ్ (విదేశ) యునివర్శీటీలో పి.హెచ్.డి చేయి' అని స్వామి ఆజ్ఞాపించారు! అలాగే స్విట్జర్లాండ్లో ప్.హెచ్.డి. పూర్తి చేయించారు. నమ్మిన వారికి స్వామి వారు పిలిచిన పలికే దైవం.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*గ్రంథం:-నేను దర్శించిన మహాత్ములు*

*శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర*

*రచన:-*

*శ్రీఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


   ఇలా కొద్దికాలం గడిచాక ఒకనాడు హైదరాబాద్ లో నా దగ్గర చదువుకున్న ఒక పాత విద్యార్థి వచ్చి తాను గృహస్థుడుగా పూనేలో వుంటున్నానని, శిరిడీ వచ్చినప్పుడు తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని ఎంతో ప్రేమతో ఆహ్వానించాడు. నిజానికి నేనా రోజులలో ఏ స్నేహితులను, బంధువులను, చివరకు విజయవాడలో ఒంటరిగా వుంటున్న మా తండ్రిగారిని గూడ చూడటానికి వెళ్ళేవాడినికాను. కారణం ఏనాటికైనా సన్యసించి దేశమంతా సంచరించాలని, చివరకు ఎక్కడో ఏకాంత స్థలంలో భగవత్ ధ్యానం చేస్తూ జీవితశేషం గడిపి ప్రశాంతంగా శరీరం విడిచిపెట్టడం ఒక్కటే నా ధ్యేయంగా వుండేది. కానీ అదంతా ఆ పాత విద్యార్థితో ఏకరువు పెట్టి ఎప్పుడో గాని మరలా కలసుకోని అతని ఆత్మీయతను, ఆదరణను కించపరచదల్చక అతడితో మొహమాటానికి మాత్రమే పూనా వస్తానని చెప్పాను. 

    

*********************************

ఆన్లైన్ లో చదువుటకు ఈ లింక్ ను ఉపయోగించుకోగలరు.


https://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Aanandamai-Amma-Charitra&page=1

కామెంట్‌లు లేవు: