15, ఆగస్టు 2023, మంగళవారం

రామాయణమ్ 291

 రామాయణమ్ 291

...

రాముడికి ఇతర దృష్టిలేదనీ నిత్యము శోకముతో ఉన్నాడనీ నీవు చెప్పిన మాటలు విషము కలిపిన అమృతమువలే  ఉన్నవి.

.

దైవము మనిషిని ఐశ్వర్యము వైపునకు గానీ అతిభయంకర దుఃఖదారిద్ర్యములొనికి గానీ మనుజుని తాడు కట్టుకొని లాగుకొని పోవును.మనుష్యుడు నిమిత్తమాత్రుడు. 

.

ఓ హనుమా!దైవమును దాటగల శక్తి ఎవ్వరికున్నది ? మేము మువ్వురమూ ఇంత దుఃఖసాగరములో మునిగితి మన్న అది దైవప్రేరితము గాక మరేమిటి ? మా శోకమునకు ఎప్పుడో అంతము?

.

నాకు ఆ దుష్ట రాక్షసుడు ఒక సంవత్సరము మాత్రము గడువొసగినాడు .అందులో పది నెలలు గడచిపోయినవి .ఈ బొందిలో ఇక ప్రాణము నిలుచునది రెండు నెలలే ! ఆ లోపుగనే రాముడు ససైన్యముగా ఇచటికి ఏతెంచి రావణుని సంహరించి నా చెర విడిపించవలే !

.

విభీషణుడు ! రావణుని తమ్ముడు ! చెవినిల్లు కట్టుకొని పోరుచున్నాడు ! నన్ను తిరిగి రాముని వద్దకు చేర్చమని ! కానీ రావణుడు ఆ హితమును పెడచెవిని పెట్టుచున్నాడు.

.

వాడు కాలానికి లొంగి‌నాడు ,

కాలునికి అతిథిగా వెళ్ళవలెనని ఉవ్విళ్ళూరుచున్నాడు.తెగఆరాట పడుచున్నాడు.

పోగాలము దాపురించినవాడికి మంచివిషయము తలకెక్కుతుందా?

.

ఈ సంగతులు నాకు విభీషణుడి పెద్దకూతురు " నల " తన తల్లి పంపగా నా వద్దకు వచ్చి తెలిపినది .

.

శచీదేవికి దేవేంద్రుని గురించి తెలిసినట్లు నాకు నా రాముని గురించి బాగుగా తెలియును ..రామునిలో ఉత్సాహము,పురుషప్రయత్నము,

బలము ,క్రూరత్వములేకుండుట,

కృతజ్ఞత్వము, పరాక్రమము మొదలైన గుణములు పుష్కలముగా యున్నవి .

.

రామ కోదండ ధనుష్ఠంకారమే శత్రుశిబిరములో హాహాకారములు పుట్టించును. 

.

హనుమంతుడా ! నా రాముడు ఒంటరిగా యుద్ధము చేసి జ‌స్థానములో పదునాల్గువేలమంది రాక్షసులను యమసదనమునకు పంపవేసినాడు.

.

ఓయి హనుమంతుడా!

నా రాముడు శత్రుభయంకరుడు

నా రాముడు సకల గుణాభిరాముడు

నా రాముడు సర్వలోక మనోహరుడు

నా రాముడు పోతపోసిన ధర్మము

నా రాముడు నా మనోవీధులలో నిత్యసంచారి !

.

వూటుకూరు జానకిరామారావు 

.

కామెంట్‌లు లేవు: