15, ఆగస్టు 2023, మంగళవారం

నీలకంఠేశ్వరా

 నీలకంఠేశ్వరా!   


మ: నిను సేవించిన గల్గు మానవులకున్ వీటీవధూటీఘటీ/

ఘనకోటీ శకటీకటీ తటిపటీ గంధేభవాటీ పటీ/

ర, నటీ, హారిసువర్ణహార మకుటీ ప్రఛ్ఛోటికా పేటికల్/

కనదామ్నాయమహాతురంగ!

శివలింగా! నీలకంఠేశ్వరా!


ఎఱ్ఱాప్రెగ్గడ:-నీలకంఠేశ్వర శతకం.


         కాకతి రాజుల కాలంలో వీరశైవం మహోన్నత స్థితిని అందుకొన్నది. ఆమహా తరుణంలో శివకవులు నలుముఖముల విజృభించి అద్భుతమైన సాహిత్య సృజన చేశారు. నాడు శతకసాహిత్యం ఆవిర్భావ దశలో ఉన్నను మంచి మంచి శతకాలు వెలిశాయి. అందులో నీలకంఠశతకం ఒకటి."ట"కార యమకంతో నాట్యంచేసిన యీపద్యం నాటి కవులకు గల భాషాధికారానికి నిలువుటద్దం!


అర్ధములు: వీటీవధూటీ ఘటీ-వారాంగనా సముదాయము;కోటీ:కోటిధనము;శకటీకటీ- వాహన(బండ్లు)సముదాయము;తటిపటీర:నదీతీరములయందుపెరిగినచందనవృక్షములు;గంధేభవాటీ- మదగజ సముదాయము;పటీర-చందన: నటీ-నాట్యకత్తెలు;హారి-మనోహరమైన; సువర్ణహార-బంగరుహారములు;మకుటీ-కిరీటములు;ప్రఛ్ఛోటికా-పల్లకీలు;పేటికల్- పెట్టెలు; కనత్-ప్రకాశించు; ఆమ్నాయమహాతురంగ-వేదములే గుర్రములైనవాడా!; 


భావము:- ఓనీలకంఠేశ్వరా! వేదాశ్వా! నిను పూజించిన వారికి ఏమికొదవ?వారాంగనా సముదాయములేమి,అనేకకోట్ల ధనమేమి?వాహన సముదాయములేమి? ,చందనవృక్షాదులేమి, మదగజాదులేమి, కర్పూరాది సుగంధద్రవ్యాదులేమి,నట్టువరాండ్రేమి? బంగరు హారాదులేమి.సర్వము సంపన్నమే! నీవు శంకరుడవుగదా! స్వామీ !సదానీసేవాభాగ్యము ననుగ్రహింపుము.


విశేషాంశములు: భోగపుకాంతలు నాటి విలాస జీవనమునకు ప్రతీకలు.


గజాంతమైశ్వర్యం"-అనునది నాటి నానుడి. మదగజములు గలిగినవాడు ధనవంతులలో మేటి.

.చందనము కర్పూరాది సుగంధవస్తుసేవనము నాటిధనికుల జీవనరీతి.


బంగరుగద్దెలు హారములు మంజూషలు వారి అపారమైన ఐశ్వర్యమునకు నిదర్శనములు.


అలంకారం: యమకము:

కామెంట్‌లు లేవు: