3, డిసెంబర్ 2023, ఆదివారం

 *#కృష్ణా_నీ_మీద_మనసాయెరా   #గోపికావిలాపము* 


 ( కందములలో శతకము - 05 )


🌺🍃 *----------------* 🍃🌺


🌹🙏🌹


*మధురంబానల్లని సిగ ,*

*మధురము శిఖిపింఛమదియె , మణిమకుటమునున్ .*

*మదురము లలాట తిలకము ,*

*మధురంబా కనుగవలును , మరువను కృష్ణా !*


( 41 )


🌹🙏🌹( భావము )


నల్లని నీ కురుల ముడి , ఆ కురులపై మెరిసే నెమలి పింఛము,

మణులతో పొదిగిన ఆ కిరీటము ,

నుదుటిపై బహు అందముగా తీర్చిదిద్దిన ఆ తిలకము

ఆ చక్కని కనుదోయి , అతి మనోహరముగా ఉన్నవి ! 🙏


అవి నేను మరచిపోలేను *కృష్ణా !!*


🌹🙏🌹


*చెక్కిలి నునుపులు మధురము ,*

*చక్కని నక్రంబు బోలె సంపెంగవలెన్ ,*

*జుక్కల వలె గుండలములు ,*

*మక్కువ జూపెడి నగవులు , మధురము కృష్ణా !*

 

( 42 )


🌹🙏🌹( భావము )


నీ నునుపైన మెరిసెడి చెంపలు , సంపెంగను పోలుచున్న ఆ నాశికము ,

రెండు చెవులకూ నక్షత్ర కాంతులీనుచూ ఊగుతున్న కుండలాలు ,

మరలా మరలా చూడాలని ప్రేమము పుట్టించే ఆ చిరు దరహాసము ,

అన్నీ అతి మనోహరమైనవి *కృష్ణా !*


🌹🙏🌹


*అధరంబనితర మధురం-*

*బధరముపై మురళినాద మతిమధురంబై ,*

*సుధలను గురిపించెడి నీ*

*మధుకర రూపమును గొల్తు , మన్మధ కృష్ణా !*


( 43 ) 


🌹🙏🌹( భావము )


ఇక నీ పెదవులు పోలికకు అందనంత మధురము .🙏


ఆ పెదవులపై నువ్వు పలికించే మురళీనాదము ఇంకా మధురాతి మధురము .🙏


తేనియలను కురిపిస్తున్నదా అన్నట్లుగా ఉండెడి నీ రూపమును 

సదా ధ్యానించుకొనుచున్నాను ,

మన్మథాకారుడవైన *ఓ కృష్ణా !*


🌹🙏🌹


*పమ్ముకొనిన యా భుజములు ,*

*సొమ్ములు ధరియించి ఛాతి సొగసును జూపెన్ ,*

*గమ్మని మేని సుగంధము ,*

*ఝుమ్మనగా రేచె మదిన , జొకములు కృష్ణా !*

 

( 44 ) 


🌹🙏🌹( భావము )


ఉప్పొంగినట్లుగా ఉన్న ఆ భుజములు ,

రత్న హారములు ధరించగా మెరుస్తున్న నీ ఛాతి అందమంటే ఏమిటో చూపిస్తున్నది .🙏


అసలు నీ మేని సుగంధమును తలుచుకుంటే

మదిలో ఝుమ్మని రేగుతాయి లలితమైన మదన భావనలెన్నో *కృష్ణా !*🙏


🌹🙏🌹


*నడుముకు వడ్డాణముతో ,*

*వడివడి తిరుగాడు సొగసు వలపును రేపెన్ .*

*బడిపడి తిరిగితినయ నే*

*బిడియపడని కామినివలె , బ్రీతిగ కృష్ణా !*


( 45 ) 


🌹🙏🌹( భావము )


నడుముకు కట్టిన ఆ వడ్డాణముతో , గబగబా నువ్వు అడుగులు వేయుచూ తిరుగాడుట చూస్తుంటే ,

ఆ ఆందములకు నాలో నీపై ప్రేమ ఇంకా ఇంకా పెరిగిపోతున్నది .🙏


అందుకేనేమో నీ వెనుక పడి మరీ తిరుగుతున్నాను ,

ఏమాత్రము సిగ్గుపడని కామిని లాగా , నీవే నాకు ప్రీతి అనుచూ *కృష్ణా !*


🌹🙏🌹


*ఊరువులవియే చూచితి ,*

*నేరుపుగా నీ మగసిరి నిరుపమమనెదన్ ,*

*జేరి తలవాల్చ నీయర*

*సారముగా దాసినౌదు , సత్యము కృష్ణా !*


( 46 ) 


🌹🙏🌹( భావము )


బలమైన నీ తొడలను చూడగా అనిపిస్తున్నది 

మగతనమనగా నీదే అని దానికి సాటి ఇంకొకటి లేదని !🙏


ఆ తోడలపై నా తలవాల్చి సేదతీరాలని ఆశ ,

దానికోసము గుత్తముగా నీకు ఊడిగము చేయుటకు నేను సిద్ధము , 

ఇది నిజము *కృష్ణా !*

 

🌹🙏🌹


*నిలువెత్తు మన్మధుడవై ,*

*చెలికత్తెల కడను జేరి, చెలికానిగ నూ-*

*యలకెత్తి సరసములతో*

*జలిపొత్తులనెన్నొ చూపు , జాణవు కృష్ణా !!*


( 47 )


🌹🙏🌹( భావము )


నిలువత్తు మన్మధ రూపుడవై  చెలులవద్ద నీవు 

సరసములతో వారిని ఉయలలూగించు వాడవు ,

వారి చలికి వేడిమి నిచ్చే పోందువు , 

బహు చతురుత చూపించెడివాడవు నీవు *కృష్ణా !*


🌹🙏🌹


*ఆపాదమస్తకంబును*

*నేపారుచు నెంత చూచి నివ్వెర వడినన్ ,*

*నా పాలిట దైవమనెడి*

*యాపాదన మద్భుతమిల , నందును గృష్ణా !*


( 48 ) 


🌹🙏🌹( భావము )


నిన్ను క్రింది నుంచీ పై దాకా కళ్ళప్పగించి ఎంతగానో 

అతిశయమును పొందినా , 

చివరకు నాకు నీవు దైవమువంటి వాడవు 

అను భావన కలిగించుకొనుటయే 

అద్భుతము కదా *కృష్ణా !*


🌹🙏🌹


*పాదము లొత్తెడి భాగ్యము ,* 

*నీ దాసిగ నుండు సుఖమె నిజసుఖమౌ నా*

*పాదములే సర్వస్వము ,*

*లేదయ యితరమగు చింత , లేదయ కృష్ణా !*


( 49 ) 


🌹🙏🌹( భావము )


నీ పాదములను ఒత్తగలిగే భాగ్యమే భాగ్యము .🙏


నీకు దాసిగా ఉండుటలో కలిగే ఆనందమే నిజమైన ఆనందము .🙏


అటువంటి నీ పాదములే నాకు సర్వస్వము .🙏


ఇది తప్ప నాకు ఇక వేరు ఆలోచన లేదు కృష్ణా ! లేనే లేదు *కృష్ణా !*


🌹🙏🌹


*చెంతన నుండగ జాలును ,*

*బంతము బోకుండ జేతు బరిచర్యలు , నా*

*యంతము నీకడనగుచో*

*నంతయె చాలు , నికనేమి యడుగను గృష్ణా !*


( 50 ) 


🌹🙏🌹( భావము )


నీ సన్నిధిలో నేను ఉండగలిగితే చాలు .🙏


నీకు అన్ని రకములైన సేవలనూ ఏ పంతానికీ పోకుండా చేసెదను.🙏


నా తుది శ్వాస  నీ సన్నిధిలోనే విడువగలిగితే చాలు !🙏


ఆ విధముగా నాపై దయచూపు నిన్ను వేరే ఇక ఏమియూ అడుగను *కృష్ణా !*


🌹🙏🌹


*హరే కృష్ణ ! హరే కృష్ణ !* 🙏


పద్యములు  51 to 60  రేపటి శీర్షికలో .....


మీ ఆశీర్వాదములను కోరుకొనుచూ ..


మీ సూచనలు అభిప్రాయములు సదా స్వాగతిస్తూ ...


భవదీయుడు 

✍ *--వేణుగోపాల్ యెల్లేపెద్ది*

కామెంట్‌లు లేవు: