12, డిసెంబర్ 2023, మంగళవారం

శ్రీదేవీ భాగవతము

 శ్రీదేవీ భాగవతము


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


* హరిశ్చంద్రుడి పుత్రవ్యామోహం

దైవజ్ఞా! నువ్వు మంత్రవిద్యా విశారదుడవు. మాకు సంతానం కలిగే ఉపాయం ఏదైనా

ఆలోచించు. ధర్మజ్ఞుడివి. అపుత్రస్య గతిర్నాస్తి అంటారు. నా దుఃఖం తెలిసి, కులపురోహితుడవైయుండి,

శక్తిమంతుడవైయుండి ఇలా ఉపేక్ష చెయ్యడం నీకు భావ్యమేనా ! ఈ పిచుకలు చూడు. ఎంత ధన్యమో

వాటి జీవితం ! పిల్లల్ని లాలించి ఆనందిస్తున్నాయి. మేమే మందభాగ్యులం. రేయింబవళ్ళు దిగులు

పడుతున్నాం.

కలవింకాస్త్విమే ధన్యా యే శిశుం లాలయంతి హి |

మందభాగ్యోఽహమనిశం చింతయామి దివానిశమ్ (14 - 31)

హరిశ్చంద్రుడి అభ్యర్ధనలో ధ్వనిస్తున్న నిర్వేదాన్ని అర్ధం చేసుకున్నాడు వసిష్ఠుడు. మహారాజా!

నువ్వన్నది ముమ్మాటికీ నిజం. ఈ సంసారంలో దంపతులకి పిల్లలు లేకపోవడాన్ని మించిన దుఃఖం లేదు.

దీనికి ఒక మార్గంఉంది. వరుణుడిని ఉపాసించు. అతడు సంతానదాయకుడైన దేవత. నీ కోరిక

నెరవేరుతుంది. దైవమూ పురుషకారమూ రెండూ సమానప్రతిపత్తి కలవే. ప్రయత్నం లేకుండా ఏ

కార్యమూ సిద్ధించదు. నిజానికి తత్త్వదర్శులై మానవులు గట్టి ప్రయత్నమే చెయ్యాలి. అదే కార్యసాధకం.

మరోదారి లేదు.

దైవం పురుషకారశ్చ మాననీయావిమౌ నృభిః ॥

ఉద్యమేన వినా కార్యసిద్ధిస్సంజాయతే కరమ్

న్యాయతస్తు నరైః కార్యం ఉద్యమస్తత్త్వదర్శిభిః |

కృతే తస్మిన్ భవేత్సిద్ధి: నాన్యథా నృపసత్తమ

ఈ ఉపాయానికి హరిశ్చంద్రుడు సంతృప్తిచెందాడు. మరోసారి గురువుగారికి నమస్కరించి

తపస్సుకి వెళ్ళిపోయాడు. గంగాతీరం చేరుకుని ఒక ప్రశాంత ఏకాంత ప్రదేశంలో పద్మాసనం వేసుకుని

కూర్చుని వరుణుడిని ధ్యానించాడు. చాలా ఏళ్ళకు వరుణుడు కరుణించి ప్రత్యక్షమయ్యాడు. వరం

కోరుకోమన్నాడు. ఋణత్రయ విముక్తికోసం సుఖప్రదుడైన పుత్రుణ్ణి అనుగ్రహించమని కోరాడు

హరిశ్చంద్రుడు

కామెంట్‌లు లేవు: