12, డిసెంబర్ 2023, మంగళవారం

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

 ✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

.           ప్రథమ సంపుటము

 

.             *ఉపోద్ఘాతము -2*         

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


71-106 అధ్యాయలలో శివలింగ-దుర్గా-గణశాది పూజావిధానం చెప్పబడింది. ఇక్కడ చెప్పిన వివిద మంత్రాలకు సంబంధించిన విషయాలకూ, శారదాతిలక-మంత్రమహోదధులలో విషయాలకూ చాలా పోలిక లున్నాయి. 107-116 అధ్యాయాలలో స్వాయంభువసృష్టి, భువనకోశ వర్ణనమూ, వివిధ తీర్థాలమాహాత్మ్య వర్ణనమూ ఉన్నాయి. 


118-120 అధ్యాయాలలో భారతదేశము, దాని ఎల్లలు, ఆయా ప్రదేశాల ఆయామ వైశాల్యాదులు వర్ణింపబడ్డాయి. 121-149 అధ్యాయలలో ఖగోళశాస్త్రము, జ్యోతిః శాస్త్రము (ఫలిత భాగము), సాముద్రిక శాస్త్రము మొదలైన విషయాలు ప్రతిపాదింపబడినవి. 


150-167 వివిధ వర్ణాశ్రమాదులకు సంబంధించిన ధర్మాలు, 168-174 అధ్యాయాలలో పాపాలు, వాటికి ప్రాయశ్చిత్తాలు చెప్పబడినవి. 175-207 అధ్యాయాలలో వివిధ వ్రతాల చర్చ ఉన్నది. 208-217 అధ్యాయాలలో ఉపవాసాది వివిధ పుణ్యకార్యాల వర్ణన ఉన్నది. 


218-258 అధ్యాయాలలో రాజధర్మాలు, రాజ్యాపాలనా విధానము, శస్త్రవిద్య, వ్యవహారనిర్ణయము మొదలైన విషయాలు అతి విస్తృతంగా చెప్పబడ్డాయి. 259-271 అధ్యాయాలలో వివిధవైదిక కర్మకలాపాల చర్చ చేయబడింది. 


272వ అధ్యాయంలో పూరాణవాఙ్మయాన్ని గూర్చిన వివరణ ఉన్నది. 273-278 అద్యాయాలలో సూర్యచంద్రవంశరాజులు వర్ణన చేయబడింది. 279-300 అధ్యాయాలలోను, 369, 370 అధ్యాయాలలోను, మనుష్యాయుర్వేదమే కాకుండా, గజాశ్వవృక్షాద్యాయుర్వేదం కూడా చెప్పబడింది. 


301-326 అధ్యాయాలలో వివిధ దేవతల పూజా విధానాలు, వారికి సంబంధించిన మంత్రాలు, తత్సాధన విధానాదులు చెప్పబడినవి. 327వ అధ్యాయంలో దేవాలయప్రాశస్త్యాన్ని వర్ణింపబడింది. 328-336 అధ్యాయాలలో 'చందస్సు', 336 వ అధ్యాయంలో 'శిక్ష', 337-348 అధ్యాయాలలో అలంకార శాస్త్రానికి సంబంధించిన వివిధ విషయాలు, 349-359 అధ్యాయాలలో వ్యాకరణశాస్త్ర విషయాలు, 360-367 అధ్యాయాలలో నిఘంటువు ఉన్నాయి. 


నిఘంటు భాగంలో అమర సింహుని నామలింగాను శాసనంలోని శ్లోకాలు యథా తథంగా చేర్చబడ్డాయి. 369-370 అధ్యాయాలలో మానవుని శరీరానికి సంబంధించిన వివిధ భాగాల వర్ణన ఉన్నది. 371వ అధ్యాయంలో అనేక విధాలైన నరకాల వర్ణన ఉన్నది. 


372-376 అధ్యాయాలలో యోగశాస్త్ర విషయాలు చెప్పబడినవి. 377-380 అధ్యాయాలలో అద్వైతసిద్దాంతం ప్రతిపాదించబడినది. చివరి మూడు అధ్యాయాలలో (381-383) భగవద్గీతసారము, యమగీత, అగ్నిపురాణ మాహాత్మ్యము ఉన్నాయి.


"అగ్నేయేహి పురాణాస్మిన్‌ సర్వావిద్యాః ప్రదర్శితాః" (అ.పు. 383-51) అని చెప్పినట్లు, మధ్యయుగానికి చెందిన భారతదేశంలో ప్రచారంలో ఉన్న అన్ని శాస్త్రీయవిషయాలూ ఈ పురాణంలో పొందుపరచబడి ఉన్నాయి.

సశేషం....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: