1, జనవరి 2024, సోమవారం

ఆపాత మధురానుభూతులు*

 *ఆపాత మధురానుభూతులు* 


Nostalgia in our Lives:

                  ***


రైల్వే స్టేషన్ లో వెయింగ్ మిషన్ ఎక్కడానికి 10 పైసల బిళ్ల కోసం మారాం చేసిన జెనరేషన్ మాది...

ఇంటి ముందు కొచ్చే పాల ఐసు 10 పైసలూ, ఫ్రూట్ ఐసు 5 పైసలూ నూ....

యస్సెల్సీ పాసవగానే టైప్ ఇన్ స్టిట్యూట్ కి పేపర్లు గుండ్రంగా చుట్టుకుని వెళ్లిన తరం వాళ్లం...

అద్దెకి బుక్స్ ఇచ్చే షాప్ దగ్గర్లో వుందా, ఆస్పత్రి వుందా అని అద్దె ఇళ్లు చూసుకున్న బంగారు రోజులవి....

సినిమా హాలు క్యూలో పాటల పుస్తకాలు కొనుక్కుని బట్టీలు పట్టే కాలం అది...

గెజిటెడ్ ఆఫీసర్లు అయినా సైకిళ్లు  తొక్కేవాళ్లు ఆ రోజుల్లో...

డ్రాయింగ్ రూమ్ లలో జిమ్ములలో తొక్కే అవసరం పడేది కాదు...

చేబదుళ్లకి కాదేదీ అనర్హం...

పిన్నిగారింట్లోంచి గ్లాస్ తో కాఫీ పొడైనా...బాబాయ్ గారి రేలీ సైకిల్ అయినా, పక్కింటి అన్నయ్య జామెంట్రీ బాక్సూ , స్కూల్లో డ్రామాకి ఎదురింటి అక్కయ్య జడగంటలూ...కొండొకచో కాలి జోళ్లూనూ!!!


అప్పు పుట్టని పచారీ షాపులూ బట్టల కొట్టులూ వుండేవే కావు...

రేషన్ షాపుల్లో పంచదార కోసం, కిరసనాయిల్ కోసం నిలబడి,డ్యూయెట్లూ...

పాలసీసా కోసం బూతుల దగ్గర నిలబడినప్పుడు లవ్ లెటర్స్ ఎక్స్చేంజ్ లు జరిగేవి...

మధ్యతరగతి మందహాసం కాదు...పగలబడి నవ్వేది....

ఇంటి ముందుకు

కోతులాడించేవాడు, పాములాడించేవాడు,గంగిరెద్దులాడించేవాడు,ఎలుగు బంటిని తెచ్చేవాడు,చిలక జోస్యం చెప్పేవాడు,వానల్లు పడాలి వాన దేవుడా అని కప్పలకి పెళ్లిళ్లు చేసే వాళ్లు కాలాన్ని బట్టి వచ్చి వినోదం అందించే వాళ్లు...

మేకప్పులు అంటే మాకు తెలీని రోజుల్లో మొహాలకి గులాబీ రంగులేసుకునొచ్చి, ఇళ్ల ముందు సినిమా పాటలకి డాన్స్ లాడే వారు...

గారడీల వాళ్లు బాలన్సింగ్ ఎలాగో పైన తాడు మీద చిన్న పిల్లలని నడిపిస్తూ చూపించే వాళ్లు....

మూలికలూ, పసర్లూ అమ్మేవాళ్లు తాము నయం చెయ్యలేని రోగం లేదనే వాళ్లు...

స్టేషన్ దగ్గర చెవి గులిగిలు తీస్తామనే పెట్టెలతో తిరిగే వాళ్లూ, ..

ఇళ్లముందు కొచ్చి సవరాలు కడతాం అనే వాళ్లూ..

వాళ్ల కోసం టిన్నుల్లో జుట్టు వూడితే దాచుకున్న వాళ్లూ వుండేవారు .. 

మధ్యాహ్నాలు భోజనాలయి వంటింటి గుమ్మం మీద తల పెట్టి కునుకు తీస్తుంటే...

 "దువ్వెన్నలు, బొట్లు, కాటుక పెట్లు, ఈర్ పేన్లు...లబ్బర్ గాజులు రిబ్బన్లహో"...అంటూ పెట్టె నెత్తిన పెట్టుకొచ్చే వాళ్ల దగ్గర దొరకని ఫ్యాన్సీ వస్తువుండేది కాదు..వాళ్లు వెళ్లగానే "పాత బట్టలకి స్టీల్ సామాన్లిస్తాం"..అన్న వాళ్లు వచ్చి ఎన్నేసినా, చూపించినా గంగాళం కాకుండా ,ఆఖర్న ఉగ్గు గిన్నె ఇచ్చి పోయేవాళ్లు..గోతాముడు పాత బట్టలొదిలిపోయేవి..కత్తికి సాన పెడ్తాం, నవార్లు నేస్తాం..పరుపులేకుతాం..గిన్నెలకి సొట్టలు తీస్తాం..బంగారు వెండి వస్తువులకి పాలిష్ పెడతాం ...అరువు మీద  చీరలిస్తాం అంటూ ఇంటి ఇల్లాళ్లని ఊపిరి తీసుకోనిచ్చే వాళ్లు కారు..ఇంక ముగ్గు అమ్మే వాళ్లూ ,ఉప్పు అమ్మేవాళ్లూ, కూరలూ పండ్లూ అమ్మే వాళ్లూ... సరేసరి....మాదా కబళం వాళ్లు "అన్నం వుంటే పెట్టమ్మా నీ కొడుకులు, బిడ్డలు, మనవలు సల్లంగుండ" అంటూ టైముల వారీగా వచ్చే వాళ్లు...సాయంత్రం 8 గంటల బిచ్చగాడొచ్చి వెళితే మా నానమ్మ మాత్రలేసుకునేది..

 రేడియోలో బినాకా గీత్ మాలా ఊహల రెక్కలు విప్పేది..భూలే భిస్రే గీత్ అమర లోకాల్లో విహరింప చేసేది... రహస్య ప్రేమలు, అచ్చట్లు, ముచ్చట్లు... "ఏమిటో" అనుకోవడాలు ప్రొద్దుట సంస్కృత వార్తలు 'ఇతి బలదేవానంద సాగరహా 'తో ప్రారంభం అయితే ఈ మాసం పాటలూ కార్మికుల కార్యక్రమాలూ సంక్షిప్త శబ్ద చిత్ర ప్రసారాలూ..వివిధ భారతి మీరుకోరిన పాటలూ..పండితులచే నిర్మించబడ్డ నాటకాలూ..వావ్ రేడియో స్వర్ణ యుగం అది!

అప్పట్లో పేపరు చదువుతూ కాఫీ తాగని మనుషులు అరుదు..ఇంగ్లీష్ పేపర్ చదువుతే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయినట్లే ,దూర్దర్శన్ లో ఇంగ్లీష్ వార్తల వల్ల ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాం..తాతయ్యలకీ దూరపు చుట్టాలకీ ఉత్తరాలు రాస్తూ లెటర్ రైటింగులు నేర్చుకున్నాం....ఉభయకుశలోపరి ఎక్కడ పెట్టాలో, గంగాభాగీరధీ సమానురాలైన ఎప్పుడు వాడాలో తెలుసు!!

ఎన్నని చెప్పగలం ఆ పాత మధురమైన జ్ఞాపకాలు.... *ఇప్పటికి ఎప్పటికి మా గుండెల్లో నిలిచిపోయి మా గుండెలు అగిపోయేవరకు మాతో వెన్నుండి మమ్మల్ని నడిపిస్తున్న........ ఏమో... మాటలు రావట్లేదు 😌*


జారే అరుగుల ధ్యాసే లేదు

పిర్ర పై చిరుగుల ఊసేలేదు

అమ్మ చేతి మురుకులు లేవు

అలసట లేని పరుగులు లేవు

ఎత్తరుగులు మొత్తం పోయే

రచ్చబండలూ మచ్చుకు లేవు

 వీధిలో పిల్లల అల్లరి లేదు

 తాతలు ఇచ్చే చిల్లర లేదు

 ఏడు పెంకులు ఏమైపోయే

 ఎద్దు రంకెలు యాడకి పోయె

ఎక్కడా వెదురు తడికెలు లేవు

ఏ తడికకీ భోగి పిడకలు లేవు

కూరలమ్మే సంతలు లేవు 

పెరుగులమ్మే ముంతలు లేవు

బువ్వా లాటల విందే లేదు

గవ్వలాటలు ముందే లేదు

కుప్పిగంతులు లేనే లేవు 

కళ్ళ గంతలు కానే రావు

డ్రింకు మూతల గోలే లేదు 

బచ్చాలాడే ఇచ్చా లేదు

కోతి కొమ్మచ్చి ఏమైపోయే

అవ్వా అప్పచ్చి ముందే పాయె

గూటీ బిళ్ళా గూటికి పోయే

తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె

గచ్చకాయలు మచ్చుకు లేవు

చింత పిక్కలు లెక్కకూ లేవు

ధారగా కారే ముక్కులు లేవు 

జోరుగా జారే లాగులు లేవు

కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు

కొండముచ్చుని కెలుకుడు లేదు

బట్టన మురికి అంటక పోయె

మనసుకి మురికి జంటగ చేరె

కాకి ఎంగిలి కరువై పోయే

భుజాన చేతులు బరువై పోయె

అన్ని రంగులూ ఏడకో పోయె

ఉన్న రంగులూ మాసికలాయె

దానికితోడు కరోనా వచ్చె

బళ్ళూ, గుళ్ళూ మూసుక పోయె

బడిగంటల ఊసే లేదు

బడికి పోయే ధ్యాసే లేదు

మూతులన్నీ మాస్కుల పాలు

చేతులన్నీ సబ్బుల పాలు

ఆన్ లైన్ లో పాఠాలాయె

అర్థం కాని చదువులాయె

ప్రశ్నలకు జవాబులుండవు

కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు

ప్రస్తుత బాల్యం వెలవెల పోయె

దానికి మూల్యం ప్రస్తుత మాయే

రేపటి సంగతి దేవుడి కెరుక

నేటి బాలలకు తప్పని చురక

బాలానందం లేని జీవితం

మానవాళికే మాయని మరక.

మేమేఅదృష్టవంతులమ్*!           

1950-70 లో పుట్టిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు. 

ఆంగ్ల  మాధ్యమంలో  చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము.  లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము. 

పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత 

గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న *సామాజిక -ఆర్థిక* పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. 

దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. *ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది...* అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది.

*పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.* 

పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన *ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.* 

దాదాపు అందరం దుంపల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మాలో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే!  

ఆ రోజుల్లో  చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు.  

ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే.

మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. *మూడు అణాలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో.* అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్  ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.

మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట

రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం

ఈ నాటికీ దాదాపు అందరం 48-65సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే!

అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకొని పిలుస్తున్న వాళ్ళమే.   

*ఇక మాకన్నా అదృష్టవంతు లెవరుంటారు?*

*ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బాల్యాన్నిమనమే రాసుకున్నట్టుగానే వుంది.


1950-75పుట్టిన వారికి అంకితం.

🙏✍️🕉🌟🇮🇳

కామెంట్‌లు లేవు: