4, ఫిబ్రవరి 2024, ఆదివారం

🪐శ్రీ కృష్ణావతారం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.                *పురాణ పఠనం*

.        *🪐శ్రీ కృష్ణావతారం🪐*

.               *79వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


శివకృష్ణులకు యుద్ధమగుట 


వరదుడు, ఉదారుడు, భక్తజనవత్సలుడు అయిన పరమేశ్వరుడు బాణాసురుని తన కన్నకొడుకుల కన్నా అధికంగా అభిమానిస్తాడు. కనుక, బాణుని పక్షాన యుద్ధం చేయాడానికి ప్రమథులు, గుహుడూ, తన అనుచర భూతకోటి వెంటరాగా భయంకరమైన శూలాన్ని ధరించి బయలుదేరాడు. అలా విలాసంగా కదలివస్తున్న కైలాసపర్వతంలాగ మహోన్నతమైన నందీశ్వరునిపై ఎక్కి శంకరుడు యుద్ధరంగానికి వచ్చాడు. నందీశ్వరుని కాలిగిట్టల తాకిడికి పైకిలేచిన దుమ్ము సూర్యబింబాన్ని క్రమ్మివేసింది; తోక కదలిక వలన పుట్టిన గాలిదెబ్బకు మేఘాలు చెదరిపోయాయి; వాడి కొమ్ముల ధాటికి బ్రహ్మాండభాండం బ్రద్దలయింది; ఖణిల్లని విలాసంగా వేసిన రంకెకు రోదసీకుహరం దద్దరిల్లింది; మెడలోని గంటల గణగణ ధ్వనులకు సర్వదిక్కులూ పెటపెటలాడాయి. పరమశివుడు ఇలా బయలుదేరి యుద్ధోత్సాహంతో ప్రతిపక్షంతో తలపడ్డాడు. అప్పుడు ఇరుపక్షాలవారికీ ద్వంద్వయుద్ధం జరిగింది. ఆ పురాతన యోధుల యుద్ధాన్ని చూడడానికి బ్రహ్మాది దేవతలు, మునీంద్రులు, యక్ష, రాక్షస, సిద్ధ, చారణ, గంధర్వ, కిన్నరాదులు తమ తమ విమానాలు ఎక్కి ఆకాశంలో గుమికూడారు. అప్పుడు శివ కేశవులూ; కుమార ప్రద్యుమ్నులూ; కూపకర్ణ కుంభాండులూ; బలరాముడూ సాంబుడూ; బాణనందనుడు బలుడూ బాణసాత్యకులూ; ఒండొరులతో తలపడ్డారు. రథికులు రథికులతోనూ; అశ్వికులు అశ్వికులతోనూ; గజారోహకులు గజారోహకులతోనూ; పదాతులు పదాతులతోనూ యుద్ధం ప్రారంభించారు. ఖడ్గాల రాపిడికి నిప్పులు రాలుతున్నాయి; సింహనాదాలతో, ధనుష్టంకారాలతో, ఏనుగు ఘీంకారాలతో, గుఱ్ఱాల సకిలింపులతో, పటహము భేరి కాహళము మృదంగము శంఖమూ మున్నగు వాయిద్యాల సంకుల ధ్వనులతో బ్రహ్మాండం దద్దరిల్లి పోయింది.

శ్రీకృష్ణుడు సింహనాదంచేసి శార్జ్గమనే తన ధనస్సును ఎక్కుపెట్టి, బాణవర్షాన్ని కురిపించి, యుద్ధవిశారదు లైన ప్రమథగణాలనూ, భూత, పిశాచ, ఢాకినీ వీరులను దిగ్భ్రాంతి చెంది పారిపోయేలా చేసాడు. ఇలా బాణప్రయోగం చేసి విజృంభించిన శ్రీకృష్ణుడి పరాక్రమాన్ని సహించలేక, పరమేశ్వరుడు నిప్పులు క్రక్కే శరపరంపరలను పీతాంబరుడైన కృష్ణుడిమీద ప్రయోగించాడు. ఆ బాణాలు అన్నింటిని, మధ్యలోనే శ్రీకృష్ణుడు చూర్ణం చేసాడు. నుదట అగ్నిని కురిపించే కనులు గల ఆ పరమశివుడు, పరిస్థితిని గమనించి, త్రిలోకపూజ్యమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు కూడ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, శివుడు వేసిన బ్రహ్మాస్త్రాన్ని మరలించాడు. ఇది చూసిన దేవేంద్రాది దేవతలు ఆశ్చర్యచకితులై శ్రీకృష్ణుని స్తుతించారు. అంతట ఉమాపతి ఉపేంద్రుడిమీద వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అసురారి ఆ అస్త్రాన్ని పర్వతాస్త్రంతో నివారించాడు. ఉగ్రుడు మహోగ్రుడై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగా, కృష్ణుడు ఐంద్రబాణంతో దానిని అణచివేశాడు. ఇంకా.....అనంతరం మిక్కిలి కోపంతో పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని వింట సంధించాడు. చక్రాయుధుడు లోకభయంకరమైన నారాయణాస్త్రాన్ని ప్రయోగించి పాశుపతాన్ని మరలించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు పరమశివుని అస్త్రాలు అన్నింటినీ రూపుమాపాడు. రాజా! అంతట పరమేశ్వరుడు నిరుత్సాహం చెందాడు. ఆ సమయం కనిపెట్టి జయశీలి అయిన శ్రీకృష్ణుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. అలా ప్రయోగించడంతో.....ఆ సమ్మోహనాస్త్రం యొక్క ప్రభావం వలన శరీరం స్వాధీనం తప్పి, శంకరుడు నందీశ్వరుని మూపురంపైకి వ్రాలిపోయాడు. శూలపాణి స్పృహ తప్పుట చూసి, చక్రధారి అయిన కృష్ణుడు శత్రుసైన్యాన్ని శరపరంపరలతో చిందరవందర చేసాడు. కొందరిని గదాఘాతాలతో తుత్తుమురు చేసాడు. ఈవిధంగా శత్రుసైన్యాన్ని హతమార్చాడు. ఆ సమయంలో ప్రద్యుమ్నుడు అనివార్య శౌర్యంతో కుమారస్వామిని ఎదుర్కున్నాడు. పట్టుదలతో తీవ్రమైన బాణాలను ప్రయోగించాడు. అంతట, నెత్తురు ముద్దగా మారిన కుమారస్వామి శత్రువులు సింహనాదాలు చేస్తుండగా యుద్ధరంగం నుండి పరాజితుడై నెమలివాహనం మీద వెనుదిరిగాడు. శత్రు భయంకరుడైన సాంబుడు విజృంభించి తీవ్రక్రోధంతో వాడి బాణాలను ప్రయోగించగా, బాణుడి కొడుకు బెదరి శౌర్యం కోల్పోయి శత్రువీరులు హేళనచేస్తుండగా పలాయనం చిత్తగించాడు. పరాక్రమశాలియైన బలరాముడు వజ్రాయుధంతో సమానమైన తన రోకలిని చేపట్టి, కుంభాండక కూపకర్ణులను ఎదురుకొన్నాడు. ఆ ఆయుధం దెబ్బలకు వారిద్దరూ నెత్తురు కక్కుకుని అసువులు వీడారు. ఆ సమయంలో, బాణుడి సైన్యం దీనత్వంతో అనాథ యై, పారిపోసాగింది, అది చూసి బాణాసురుడు సాత్యకిని అలక్ష్యం చేసి ప్రళయాగ్ని వలె విజృంభించి తన సైన్యాన్ని పురికొల్పి తానే సేనకు నాయకత్వం వహించాడు. అప్పుడు ఉభయసైన్యాలూ అన్యోన్య జయకాంక్షతో తలపడిన ఉత్తర దక్షిణ సముద్రాలవలె విజృంభించి యుద్ధానికి సిద్ధపడ్డాయి. సంకులయుద్ధం సాగింది. గదలు, ఖడ్గాలు, సురియలు, శూలాలు, చక్రాలు, శక్తులు, బల్లెములు, పట్టిసములు మున్నగు ఆయుధాలతో ఇరుపక్షాల సైనికులు యుద్ధం చేసారు; కొందరు భయంతో పారిపోయారు; కొందరు ధైర్యంతో ఎదిరించారు; కాళ్ళు, వేళ్ళు, తలలు, చేతులు తెగిపోయాయి; ఎముకలు ముక్కలు అయ్యాయి; ప్రేగులు కుప్పలు పడ్డాయి; చెవులు తెగిపోయాయి; కళ్ళు విచ్ఛిన్నమయ్యాయి; మాంసఖండాలు కొండలవలె యుద్ధరంగంలో


పడ్డాయి; రథాలు


కుప్పకూలాయి; గజాలు నేలవ్రాలాయి; గుఱ్ఱాలు కూలబడ్డాయి; కాల్బలం మట్టికరచింది; యుద్ధరంగంలో పడిన ఈ శవాల మాంసాన్ని భక్షించడానికి గుమికూడిన భూత, పిశాచ, బేతాళుల భయంకర ధ్వనులతో సకల దిశలు మారుమ్రోగాయి. ఆ రణరంగం ఈతీరున మహాభీషణమై ఘోరాతిఘోరంగా మారిపోయింది. బాణాలు కలువపూలుగా; చామరాలు నురుగు తెట్టెలుగా; గొడుగులు తెల్లతామరలుగా; రక్తము నీరుగా; ఎముకలు ఇసుకతిన్నెలుగా; భుజాలు సర్పాలుగా; కేశాలు నాచుగా రణరంగం ఒక రక్తపుటేరులా ఆ సమయంలో భాసించింది. అప్పుడు బాణాసురుడు మిక్కిలి కోపంతో తన రథాన్ని ముందుకు నడిపించి, సహస్ర బాహువులు ఉన్నాయనే అహంకారంతో, శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు. బాణాసురుడు తన ఐదువందల చేతులతో ఐదువందల ధనుస్సులను ధరించి తక్కిన ఐదువందల హస్తాలతో రెండేసి చొప్పున బాణాలను సంధించబోతుంటే, అంతలోనే, శ్రీకృష్ణుడు అవక్రవిక్రమంతో విజృంభించి ఆ ధనుస్సులను ధ్వంసం చేసాడు; సంకోచించకుండా సారథిని సంహరించాడు; బాణుని రథాన్ని నుగ్గునుగ్గు గావించాడు. అలా చేసిన శ్రీకృష్ణుడు, ప్రళయకాలం నాటి మేఘగర్జనం అంత గట్టిగా తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఆ శంఖారావం వినిన సమస్త జనులు భయభ్రాంతులు అయ్యారు. రాక్షస స్త్రీల గర్భాలు భేదిల్లాయి. శ్రీకృష్ణుని భయంకర పరాక్రమానికి దైన్యము చెంది, బాణాసురుడు ఏమీచేయలేక చిన్నబోయి ఉండగా.....బాణుడు అలా కృష్ణవిజృంభణకు ప్రతికృతి చేయలేకపోతున్న ఆ సమయంలో, బాణాసురుడి తల్లి అయిన కోటర, తన కుమారుడిని రక్షించుకో దలచి వీడినజుట్టుతో వివస్త్రయై శ్రీకృష్ణుని ఎదుట నిలబడింది. ఆమెను చూడడానికి అసహ్యించుకుని మాధవుడు ముఖము త్రిప్పుకున్నాడు. ఆ సమయంలో బాణాసురుడు తలపాగ వీడిపోగా; భూషణాలు రాలిపోగా; యాదవులు పరిహసిస్తుండగా; తన పట్టణానికి పారిపోయాడు. అప్పుడు భూతగణాలు కూడా యుద్ధరంగం వీడిపోయాయి.


సశేషం🙏


*🙏 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: