17, మార్చి 2024, ఆదివారం

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 53*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*శృతివిప్రతి పన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా ।*

*సమాధావచలా బుద్ధిస్తదా యోగామవాప్స్యసి ।।*


*భావము:* 

కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందెదవు.


*వివరణ:*  

సాధకులు ఆధ్యాత్మిక పథంలో పురోగమించేటప్పుడు తమ మనస్సులో వారికి భగవంతునితో సంబంధం బలపడుతూ ఉంటుంది. ఆ సమయంలో, తాము పూర్వం చేసే వైదిక కర్మలు ప్రతిబంధకంగా, సమయం తీసుకునేవిగా అనిపిస్తాయి. తమ భక్తి తో పాటుగా ఇంకా పూజలు మొదలగునవి చేయాలా అని అనుకుంటారు మరియు పూజాది కార్యాలను వదిలి పూర్తిగా సాధన లో నిమగ్నమైతే ఏదైనా తప్పు చేసినట్టవుతుందా అని సంశయ పడతారు. ఇలాంటి వారు తమ సందేహానికి ఈ శ్లోకం లో జవాబు తెలుసుకొంటారు. కోరికలను తీర్చే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా సాధన లోనే నిమగ్నం అవటం తప్పు కాదని, పైగా అది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.


మాధవేంద్ర పూరి అనే 14వ శతాబ్ద ముని చాలా దృడంగా ఈ భావాన్ని వ్యక్తం చేస్తాడు. అతను విస్తృతమైన కర్మకాండ ఆచారాలు పాటించే ఒక వేద బ్రాహ్మణుడు, కానీ సన్యాసం తీసుకుని, పరిపూర్ణంగా శ్రీ కృష్ణభక్తి లో నిమగ్నమయిపోయాడు. తన జీవిత తదుపరి దశలో ఇలా అన్నాడు:


*సంధ్యా వందన భద్రమస్తు భవతే భోః స్నాన తుభ్యం నమః*

*భో దేవః పితరశ్చతరపణ విధౌ నహం క్షమః క్షమ్యతాం*

*యత్ర క్వాపి నిషద్య యాదవ కులోత్తాస్య కంసద్విషః*

*స్మారం స్మారమఘం హరామి తదలం మన్యే కిమన్యేన మే*


"అన్ని వైదిక ఆచారాలకి నా క్షమార్పణ అర్పిస్తున్నాను, ఎందుకంటే వాటిని పాటించటానికి ఇక నావద్ద సమయం లేదు. కాబట్టి ఓ ప్రియమైన, సంధ్యా వందనము (ఉపనయనం జరిగి యజ్ఞోపవీతం పొందినవారు రోజుకు మూడు సార్లు చేసే వైదిక ప్రక్రియ), పుణ్య స్నానాలు, యజ్ఞయాగాదులు, పితృకర్మలు వంటివి, దయచేసి నన్ను క్షమించండి. ఇప్పుడు, నేనెక్కడ కూర్చున్నా, కంస విరోధి అయిన శ్రీ కృష్ణ పరమాత్మ నే ధ్యానిస్తున్నాను, అది చాలు నన్ను ఈ భౌతిక బంధాల నుండి విడిపించటానికి".


శ్రీ కృష్ణుడు 'సమాధౌ-అచలా' అన్న పదాన్ని, భగవంతుని ధ్యాస లో ఉండే ధృఢ సంకల్పాన్ని సూచించటానికి, ఈ శ్లోకం లో ఉపయోగించాడు. 'సమాధి' అన్న పదం 'సమ్' (సమత్వము) మరియు 'ధి' (బుద్ది) అన్న మూలధాతువుల నుండి ఏర్పడింది, అంటే 'పరిపూర్ణ సమత్వ బుద్ధి స్థితి'. ఉన్నతమైన చైతన్యం లో స్థిర బుద్ది కలిగి, ప్రాపంచిక భౌతిక ప్రలోభాల పట్ల మోహితుడు కానివాడు ఆ యొక్క 'సమాధి' అంటే సంపూర్ణ యోగ స్థితిని పొందుతాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: