7, జూన్ 2024, శుక్రవారం

జ్యేష్ఠ మాసం

 *జ్యేష్ఠ మాసం ప్రారంభం సందర్భంగా...*


*జూన్ 07 శుక్రవారం జ్యేష్ఠ మాసం ప్రారంభం...*


*జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవునికి ప్రీతికరమైన మాసం...*


ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని. ఈ మాసంలో చేసే విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. అలాగే నీళ్ళను దానం చేయడం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి. జ్యేష్ఠ శుద్ద తదియనాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతి దేవిని పూజించడమే కాదు, దానాలకు శుభకాలం. ముఖ్యంగా అన్న దానం చేయడం ఉత్తమం. జ్యేష్ఠశుద్ద దశమిని దశపాపహర దశమి అంటారు. అంటే పది రకాలను పాపాలను పోగొట్టే దశమి అని అర్ధం. పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం, లేదా ఏదైనా నదిలో పదిసార్లు మునకేస్తే మంచి ఫలితాన్నిస్తుంది. ఈ మాసం శుక్లపక్ష పాడ్యమి మొదలు దశమి వరకు అంటే తొలి పదిరోజులూ కాశీలోని దశాశ్వమేధఘాట్ లో బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానం చేయడంతో పాటు గంగానదిని పూజించాలి. అందుకు వీలుకాని వారు సమీపంలోని నది గానీ, లేదా ఇంటిలో గానీ గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి. నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లం నదిలో వేయాలి. ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించి ఆలయాల సందర్శిస్తే శుభం జరుగుతుంది.


జ్యేష్ఠ శుద్ద ఏకాదశినే నిర్జల 'మతత్రయ' ఏకాదశి అనే పేరుతోనూ పిలుస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు, పాయసం, పానకం, నెయ్యి, గొడుగు పేదవారికి దానం చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 12 ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుంది. జ్యేష్ఠ శుద్ద ద్వాదశిని దశహరా అంటారు. ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి. ఈరోజు నది స్నానాలు చేయాలి. అలాంటి అవకాశంలేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగా దేవిని స్మరించడం ఉత్తమం. జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్టి అంటారు. ఈ రోజున తిలలు దానం చేసిన వారికి ఆశ్వమేథయాగం చేసిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ మాసంలో గొడుగు, చెప్పులను అనాధలకు, నిర్భాగ్యులకు దానం చేసిన వారికి ఉత్తమగతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం తెలిపింది. వామన ప్రీతికి విసనకర్ర, జల కలశం, మంచి గంధం దానం చేయాలి. ఈ పౌర్ణమినే ఏరువాక పున్నమి పేరుతో జరుపుకుంటారు. ఇది రైతుల పండుగ.. ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి, ఉరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారు. వటసావిత్రి వ్రతం చేయనున్న మహిళలు జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదమూడో రోజున మహిళలు వటసావిత్రి వ్రతం చేసుకుంటారు. భర్తలు పది కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసార కోరుకుంటూ ఈ పూజ చేస్తారు.


జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగినీ 'వైష్ణవ మాద్వ ' ఏకాదశి, సిద్ద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులు నేరవేరుతాయి. ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీటిని త్యాగం చేసి ద్వాదశినాడు స్నానాదికాలు పూర్తిచేసి, బ్రాహ్మణులకు నీటితోపాటు సువర్ణదానం చెయ్యి. తర్వాత జితేంద్రియులైన బ్రాహ్మణులతో కలసి భోజనం చెయ్యి. శ్రీమహావిష్ణువు నాతో ' *ఏ మానవుడు నన్ను తలచి ఏకాదశి వ్రతం చేస్తారో వారు పాపాల నుండి విముక్తులవుతారు అని తెలియజేశాడు. జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి ప్రదోష కాలంలో శివునికి అభిషేకం, బిల్వదళాలతో పూజిస్తే అకాల మృత‌్యుహరణం, యశస్సు కీర్తి, ఆరోగ్యం లభిస్తుంది. సూర్యుడిని ఆరాధించే 'మిథున సంక్రమణం' వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే 'ఏరువాక పున్నమి' ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి. ఇక దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే 'జ్యేష్ఠ పౌర్ణమి' శ్రీ మహా విష్ణువు ఆరాధనలో తరింపజేసే 'అపర ఏకాదశి' ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంది. ఏకాదశి వ్రతం చేసిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది. ఏకాదశి రోజు ఎవరైతే నీటిని కూడా తాగకుండా వుంటారో వారికి ఒక్కొక్క ఏకాదశికి కోటి సువర్ణ ముద్రలు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది.

కామెంట్‌లు లేవు: